గుంటూరులో ‘తమ్ముళ్ల’ అరాచకం
దారికాచి ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, వారి వాహనాలపై దాడులు
ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు తీవ్రగాయాలు
నలుగురు ఎంపీటీసీలు, మరో ముగ్గురి కిడ్నాప్.. కిడ్నాపైన వారిలోముగ్గురు మహిళా ఎంపీటీసీలు
మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ ఎత్తుకెళ్లి తమ వాహనాల్లో పడేసిన టీడీపీ నేతలు
గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద ఘటన
కోడెల కుమారుడి నేతృత్వంలోనే ఈ దుశ్చర్య!
దాడిలో పాల్గొన్న నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు టీడీపీ నేతలు
గుంటూరు-మాచర్ల రహదారిపై వైఎస్సార్ సీపీ రాస్తారోకో
అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసులు
దౌర్జన్యంగా ముప్పాళ్ల ఎంపీపీ స్థానం దక్కించుకున్న టీడీపీ
కోడెల కుమారుడి కనుసన్నల్లోనే..!
ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ కనుసన్నల్లోనే ఆదివారం వైఎస్సార్‌సీపీ ఎంపీపీలు, నేతలపై దాడి జరిగి నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాడి జరిగిన ప్రాంతానికి టీడీపీ నాయకులు వచ్చిన వాహనాలన్నీ కోడెల అనుయాయులు, మాజీ ఎంపీపీకి చెందినవే. ఈ దాడికి నరసరావుపేటలోని కోటలో పథక రచన జరిగినట్లు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డవారిలో అధిక శాతం కార్యకర్తలు కోడెల పాత నియోజకవర్గమైన నరసరావుపేట, రొంపిచర్ల మండలాలు, ఆయన సొంత మండలమైన నకరికల్లు మండలానికి చెందిన వారే ఉన్నట్లు సమాచారం. గుంటూరు నుంచి ముప్పాళ్లకు ఎంపీటీసీలను తీసుకెళ్లేందుకు వీలున్న అన్ని దారుల్లో టీడీపీ నాయకులు కాపుకాశారని, ఎటు నుంచి వెళ్లినా దాడి చేసేలా పథక రచన చేశారని చెబుతున్నారు.
పోలీసుల వైఫల్యం వల్లే దాడులు!
ఈ దాడుల వెనుక పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శిస్తున్నారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలను తీసుకొచ్చే సమయంలో దాడులకు పాల్పడేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, తమ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని కోరినప్పటికీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరానికి దగ్గర్లో, మేడికొండూరు పోలీసు స్టేషన్ సమీపంలోనే దాడి జరిగినప్పటికీ గంట వరకు పోలీసులు అక్కడకు చేరుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. ఎస్పీ లేకపోవడంతో అక్కడకు చేరుకున్న ఏఎస్పీ జానకీ ధరావత్, డీఎస్పీలు గంగాధరం, నరసింహంలు ఏంచేయాలో పాలుపోక మిన్నకుండిపోయారు. కనీసం ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిన వాహనాలను పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేయడంగానీ, గాలింపు చర్యలు చేపట్టడంకానీ, నాకాబందీ నిర్వహించడం కానీ చేయకపోవడం చూస్తుంటే పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి ఎంపీటీసీలను ఎత్తుకెళ్ళేందుకు టీడీపీ నేతలు ఉపయోగించిన వాహనాలు ముప్పాళ్ళ ఎంపీపీ కార్యాలయం వద్దే తిరుగుతున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టనట్లే వ్యవహరించారు. టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన ముప్పాళ్ళ ఎంపీటీసీ గద్దల శివకోటేశ్వరరావు ఎన్నిక అయిపోయిన తరువాత తాను ఇంటికి వెళ్లిపోతానని చెప్పినప్పటికీ, పోలీసుల ముందే నరసరావుపేటకు చెందిన టీడీపీ నేతలు ఆయన్ని బలవంతంగా ఇన్నోవా వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. పైగా, దానికి పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ సాగనంపారు.