
గంగుల ప్రతాప్‌రెడ్డికి షాక్!
►పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అనుచరులు
►ఫోన్లు చేసి పిలిచినా ఒక్కరూ రాని వైనం
సాక్షి, నంద్యాల : అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా నంద్యాల ఉప ఎన్నికలో గెలవాలని అధికార టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. అలవికాని హామీలిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, స్థానికంగా చిన్న చితకా లీడర్లను కొనుగోలు చేస్తోంది. అయినా అనుకున్న రీతిలో జనానికి చేరువ కాలేక పోవడంతో స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు.
ఇందులో భాగంగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత గంగుల ప్రతాప్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తన వద్దకు పిలిపించుకుని పార్టీ కండువా కప్పారు. ప్రతాప్‌రెడ్డి చేరికతో టీడీపీకి బలం చేకూరిందంటూ సంబరపడ్డారు. ప్రతాప్‌రెడ్డి కూడా నంద్యాలలో తన సత్తా చూపిస్తానని, టీడీపీ అభ్యర్థిని గెలిపించుకొస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. టీడీపీలో చేరిన అనంతరం ఆయన ఆళ్లగడ్డకు చేరుకున్నారు.
అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం.. ముఖ్య అనుచర వర్గమంతా రావాలని స్వయంగా ఫోన్లు చేసి పిలిచినట్లు సమాచారం. అయితే.. ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా వెళ్లలేదు. దీంతో ఆయనకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. కొందరు నాయకులు ఫోన్‌లోనే.. ‘సొంతంగా మీరు పోటీ చేసి ఉండింటే మద్దతిచ్చే వాళ్లం. అయినా సుమారు 30 ఏళ్లుగా భూమా వర్గంతో ప్రత్యక్షంగా పోరాడుతూ ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశాం. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని గెలిపించేందుకు రమ్మంటే ఎలా వస్తాం?’ అని ప్రతాప్‌రెడ్డిని నిలదీసినట్లు.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ద్వారా తెలిసింది.
అధికార పార్టీ నుంచి ఏదో ఆశించి.. ఆ మేరకు మాట్లాడుకుని.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఆ పార్టీలో చేరిన ప్రతాప్ రెడ్డి పిలిస్తే వెంట వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేమని ఇటు ఆళ్లగడ్డ, అటు నంద్యాలలో పలువురు నేతలు తెగేసి చెబుతుండటంతో ఆయన తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఆశలు గల్లంతు
గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో చక్రం తిప్పుతారని భావించిన టీడీపీ నాయకులకు ప్రస్తుతం నిరాశే ఎదురవుతోంది. గోస్పాడు మండలంతో పాటు నంద్యాల పట్టణంలో ప్రతాప్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందని, దీంతో పార్టీకి లాభం చేకూరుతుందని అధికార పార్టీ నాయకులు భావించారు. అయితే.. గోస్పాడు మండలంలోని అనేక మంది నేతలు, ప్రజాప్రతినిధులు, అనుచరులు ఇపుడు ప్రతాప్‌రెడ్డితో కలవడానికే ఇష్టపడడం లేదు. ఫోన్ చేసి పిలిచినా గోస్పాడు మండలం నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్లి కలవలేదు. పైగా.. దయచేసి తమఇంటి వద్దకు వచ్చి టీడీపీకి మద్దతివ్వాలని అడగొద్దని ఫోన్‌లోనే సున్నితంగా తేల్చి చెబుతున్నట్లు సమాచారం.