gangula pratap reddy
-
హోదా ఇవ్వడం జరిగేది కాదు : కన్నా
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కర్నూలు నుంచి విజయవాడ వెళ్తూ మార్గంమధ్యలో గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పిడతల సరస్వతి నివాసానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఎప్పుడో చెప్పారని, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చామన్నారు. ఆ నిధులను అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ భయంగా బతుకుతోందన్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక టీడీపీ ఇబ్బంది పడుతోందని, రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉంటూ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని సంపాదించి 2024లో వైఎస్సార్సీపీకి ప్రధాన పోటీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, రాచర్ల గేటులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పిడతల సరస్వతి కన్నాను కోరారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, జిల్లా ఇన్చార్జి శశిభూషణ్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. -
బిగ్‌షాక్; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి (నంద్యాల), పసుపులేటి సుధాకర్ (కావలి జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి), కంచర్ల హరిప్రసాద్ (రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్), డి. వెంకయ్య (టీడీపీ చిత్తూరు ఓబీసీ సెల్ సెక్రెటరీ), సి. చంద్రప్ప(బిసి వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్- శ్రీకాళహస్తి) షేక్ నిజాముద్దీన్, మాజహర్ భేగ్ కమలం పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో ఇతర పార్టీ నుంచి నాయకులు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. -
నాడు అలా.. నేడు ఇలా.. గంగుల పరిస్థితి
కర్నూలు(అర్బన్): నాడు ప్రధానమంత్రి కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన గంగుల ప్రతాపరెడ్డి నేడు అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1,86,766 ఓట్ల మెజారిటీతో గంగుల ప్రతాపరెడ్డి విజయం సాధించారు. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కోసం తన పదవిని త్యాగం చేశారు. నాడు దేశంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహరావు దేశంలోని ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి ఎన్నిక కావాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే పీవీ నంద్యాల నుంచి పోటీ చేసేందుకు వీలుగా గంగుల రాజీనామా చేశారు. 1991లోనే నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీవీ నరసింహరావు తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై విజయం సాధించారు. అయితే నేడు అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
గంగుల ప్రతాప్‌రెడ్డికి షాక్!
►పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అనుచరులు ►ఫోన్లు చేసి పిలిచినా ఒక్కరూ రాని వైనం సాక్షి, నంద్యాల : అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా నంద్యాల ఉప ఎన్నికలో గెలవాలని అధికార టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. అలవికాని హామీలిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, స్థానికంగా చిన్న చితకా లీడర్లను కొనుగోలు చేస్తోంది. అయినా అనుకున్న రీతిలో జనానికి చేరువ కాలేక పోవడంతో స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత గంగుల ప్రతాప్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తన వద్దకు పిలిపించుకుని పార్టీ కండువా కప్పారు. ప్రతాప్‌రెడ్డి చేరికతో టీడీపీకి బలం చేకూరిందంటూ సంబరపడ్డారు. ప్రతాప్‌రెడ్డి కూడా నంద్యాలలో తన సత్తా చూపిస్తానని, టీడీపీ అభ్యర్థిని గెలిపించుకొస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. టీడీపీలో చేరిన అనంతరం ఆయన ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం.. ముఖ్య అనుచర వర్గమంతా రావాలని స్వయంగా ఫోన్లు చేసి పిలిచినట్లు సమాచారం. అయితే.. ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా వెళ్లలేదు. దీంతో ఆయనకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. కొందరు నాయకులు ఫోన్లోనే.. ‘సొంతంగా మీరు పోటీ చేసి ఉండింటే మద్దతిచ్చే వాళ్లం. అయినా సుమారు 30 ఏళ్లుగా భూమా వర్గంతో ప్రత్యక్షంగా పోరాడుతూ ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశాం. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని గెలిపించేందుకు రమ్మంటే ఎలా వస్తాం?’ అని ప్రతాప్‌రెడ్డిని నిలదీసినట్లు.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ద్వారా తెలిసింది. అధికార పార్టీ నుంచి ఏదో ఆశించి.. ఆ మేరకు మాట్లాడుకుని.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఆ పార్టీలో చేరిన ప్రతాప్ రెడ్డి పిలిస్తే వెంట వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేమని ఇటు ఆళ్లగడ్డ, అటు నంద్యాలలో పలువురు నేతలు తెగేసి చెబుతుండటంతో ఆయన తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆశలు గల్లంతు గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో చక్రం తిప్పుతారని భావించిన టీడీపీ నాయకులకు ప్రస్తుతం నిరాశే ఎదురవుతోంది. గోస్పాడు మండలంతో పాటు నంద్యాల పట్టణంలో ప్రతాప్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందని, దీంతో పార్టీకి లాభం చేకూరుతుందని అధికార పార్టీ నాయకులు భావించారు. అయితే.. గోస్పాడు మండలంలోని అనేక మంది నేతలు, ప్రజాప్రతినిధులు, అనుచరులు ఇపుడు ప్రతాప్‌రెడ్డితో కలవడానికే ఇష్టపడడం లేదు. ఫోన్ చేసి పిలిచినా గోస్పాడు మండలం నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్లి కలవలేదు. పైగా.. దయచేసి తమఇంటి వద్దకు వచ్చి టీడీపీకి మద్దతివ్వాలని అడగొద్దని ఫోన్లోనే సున్నితంగా తేల్చి చెబుతున్నట్లు సమాచారం. -
అలిగిన మంత్రి అఖిలప్రియ
చంద్రబాబుతో గంగుల ప్రతాప్‌రెడ్డి భేటీ టీడీపీలో చేరిక సమాచారంతో షాక్ తిన్న మంత్రి అఖిలప్రియ అర్ధాంతరంగా రోడ్ షో నుంచి వెళ్లిపోయి అనుచరులతో భేటీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ప్రతాప్‌రెడ్డి సీఎంను కలవడం చర్చనీయాంశమయ్యింది. ఆయన తెలుగుదేశంలో చేరారనే వార్తలతో మంత్రి భూమా అఖిలప్రియ శిబిరంలో కలకలం రేగింది. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ కూడా ప్రతాప్‌రెడ్డికే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతుండటంపై ఆ వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా ప్రతాప్‌రెడ్డిని ఎలా చేర్చుకుంటారంటూ అఖిలప్రియ రగిలిపోతున్నట్లు సమాచారం. బుధవారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలసి పాల్గొన్న అఖిలప్రియ.. విషయం తెలియగానే అక్కడినుంచి బయలుదేరి వెళ్లి తన ముఖ్య అనుచరులతో సమావేశమైనట్లు తెలిసింది. ఆళ్లగడ్డలో మొదటినుంచీ భూమా, గంగుల వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రతాప్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం అఖిలప్రియను షాక్‌కు గురిచేసింది. జిల్లాతో సంబంధం లేని ఇద్దరు మంత్రులు జరిపిన మంత్రాంగంతోనే గంగుల ప్రతాప్‌రెడ్డి టీడీపీలో చేరారని తెలుస్తోంది. అఖిలను పక్కన పెట్టిన చంద్రబాబు వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారాల నుంచి మంత్రి అఖిలప్రియను చంద్రబాబు దూరంగానే ఉంచారు. అటు ప్రచారంలో కానీ, ఇటు డబ్బు పంపిణీ వ్యవహారంలో కాని ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, సోమిరెడ్డిలు చక్రం తిప్పుతుండటం ఇప్పటికే భూమా వర్గానికి మింగుడు పడటం లేదు. మొత్తం పెత్తనమంతా జిల్లాకు సంబంధం లేని మంత్రులకు అప్పగించడాన్ని ఆమె వర్గీయులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నంద్యాల పట్టణంలో కూడా నగదు పంపిణీ వ్యవహారాలను అఖిలప్రియతో విభేదాలున్న ఎ.వి.సుబ్బారెడ్డికి, ఎమ్మెల్సీ ఫరూక్‌కు అప్పగించడం గమనార్హం. -
'ఆయన వైఎస్ఆర్ సీపీ నేత కాదు'
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ జనరల్ సెక్రెటరీ, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 'గంగుల ప్రతాపరెడ్డి 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి' తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరినట్టు కొన్ని చానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారాన్ని ఖండిస్తున్నాం. గంగుల ప్రతాపరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరనూ లేదు. మా సభ్యుడు కాదు. మా పార్టీకి సంబంధించిన నాయకుడూ కాదు. కాబట్టి ఆయన మా పార్టీని వీడటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెయాల్సిందిగా మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు' విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్ సీపీ నేత గంగుల ప్రతాపరెడ్డి అధికార టీడీపీలో చేరారని కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
‘ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు’
-
ఆళ్లగడ్డలో గంగుల ప్రభాకర్‌రెడ్డి వీరంగం
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడి వీరంగం సృష్టించారు. వైసీ పీఎం పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కుమార్‌రెడ్డిపై దాడి చేశారు. నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. గంగుల ప్రభాకర్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకువరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి భయంతోనే గంగుల ప్రభాకర్ రెడ్డి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.