నమ్మించి..! నట్టేటముంచి..!! | TDP campaign | Sakshi
Sakshi News home page

నమ్మించి..! నట్టేటముంచి..!!

Published Fri, Aug 8 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

TDP campaign

సాక్షి ప్రతినిధి, తిరుపతి:  టీటీడీ ఉద్యోగులను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మాటలతో ఊరించి.. చేతలతో ఉసూరుమనిపించారు. ఎన్నికల ప్రచారంలో టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీని తన మనుషుల ద్వారా అడ్డుకున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
 
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం 2008లో అప్పటి బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రణాళిక రచించారు. ఆ మేరకు టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. తిరుపతి సమీపంలో బ్రాహ్మణపట్టు, ఎస్వీ డెయిరీ ఫామ్, ఎస్వీ లెప్రసీ ఆస్పత్రి, ఎస్వీ పూర్ హోమ్ భూములను టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఒక్కో ప్లాట్‌ను రూ.50 వేల నామమాత్రపు ధరతో టీటీడీ ఉద్యోగులకు పంపిణీ చేయాలని సంకల్పించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయలేకపోయారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి సీఎంగా వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేశాక తిరుపతిలో పర్యటించిన సమయంలో ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

టీటీడీ ఉద్యోగులకు తక్షణమే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణంతో ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్ పడింది. ఆ తర్వాత టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీపై వివాదం చెలరేగింది. భక్తితో దేవునికి ఇచ్చిన భూములను టీటీడీ ఉద్యోగులకు ఎలా ఇస్తారంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. 2006 నాటి మార్కెట్ విలువ ప్రకారం టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు బ్రాహ్మణపట్టులో 125 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 40 అంకణాల చొప్పున వెయ్యి మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

ఇదే భూమిలో 25 శాతం భూమిని సంబంధిత రైతులకు ఇవ్వాలని నిశ్చయించారు. ఎస్వీ పూర్ హోమ్‌కు చెందిన 23 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 33 అంకణాల చొప్పున 448 మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్వీ డెయిరీ ఫామ్‌కు చెందిన 20 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 33 అంకణాల చొప్పున 394 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ సమీపంలోనూ, వినాయక్‌నగర్ సమీపంలోనూ ఉన్న భూమిలో డీ-టైప్ క్వార్టర్స్ నిర్మించి.. 1020 మందికి ప్లాట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
 
ఇది పసిగట్టిన టీడీపీ నేతలు.. ఆ ఇంటి పట్టాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉద్యోగులకు పంపిణీ చేయిద్దామని టీటీడీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన టీటీడీ ఉన్నతాధికారులు ఇంటి పట్టాల పంపిణీని వాయిదా వేశారు.

ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు.. తమ మనుషుల ద్వారా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దాతలు దానం చేసిన భూమిలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఎలా ఇస్తారంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దాంతో.. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు దక్కకుండా పోయాయి. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తే.. ఇదే రకమైన డిమాండ్ ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, తుడ, మున్సిపల్ కార్పొరేషన్ వంటి సంస్థల సిబ్బంది నుంచి కూడా వస్తుందని ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థల ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబే తన మనుషులతో సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేయించి హైకోర్టు తీర్పుపై స్టే తీసుకొచ్చారని అధికార  వర్గాలు అనుమానిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement