ఆదాలకు కాంగ్రెస్, టీడీపీ అండ!
ఆదాలకు కాంగ్రెస్, టీడీపీ అండ!
Published Sat, Feb 1 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
సమైక్యాంధ్ర వాదన వెనుక వేరే మతలబు
రెబెల్‌గా ఆదాల బరిలో దిగేందుకు కాంగ్రెస్ ముఖ్యనేత సహకారం
ఓ కాంగ్రెస్ అభ్యర్థికి పొగ.. టీడీపీ మద్దతుపై ప్రభాకర్‌రెడ్డి ఆందోళన
సాక్షి, హైద రాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి సొంత పార్టీ నుంచే కాకుండా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నుంచి కూడా అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్రకు కట్టుబడిన వారంతా తనకు ఓటు వేస్తారంటూ రెబెల్ అభ్యర్థిగా ఆదాల రంగంలోకి దిగినప్పటికీ తెరవెనుక రాజకీయ మతలబు వేరే ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే కుదుర్చుకున్న ప్యాకేజీ మేరకు త్వరలోనే టీడీపీలో చేరాలని భావించిన కొందరు నేతలు కూడా రెబెల్‌గా ఆదాలను రంగప్రవేశం చేయించారని తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్‌లోని ముఖ్యనేత ఒకరు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నట్టు బలంగా వినిపిస్తోంది. ఆదాల అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన వారిలో చాలామంది నేతలు టీడీపీలో చేరడానికి ఇప్పటికే తెరవెనుక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి.
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కె.కేశ వరావు టార్గెట్‌గా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్, టీడీపీల్లోని ముఖ్యులు ఆదాలను రంగంలోకి దించినట్టు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన ఒక అభ్యర్థికి గండి కొట్టడానికి ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలుస్తోంది. తెరవెనుక లావాదేవీలు ముమ్మరం కావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సూచించిన వారికే కచ్చితంగా ఓటు వేస్తారన్న నమ్మకం లేకపోవడం రంగంలో మిగిలిన అభ్యర్థుల్లో ఆందోళన పెంచుతోంది.
మరోవైపు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న బీజేపీతో చేతులు కలపాలని తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న టీడీపీ మద్దతు ఉన్నట్టు ప్రచారం జరిగితే సీమాంధ్ర ఎమ్మెల్యేలు తనకు ఓటు వేయకపోవచ్చన్న ఆందోళన ఆదాలలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేత తెరవెనుక మద్దతునిస్తున్నప్పటికీ ఆ పార్టీలో ఎవరి నుంచి ఓట్లు వేయిస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడం కూడా ఆదాలను కలవరానికి గురిచేస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే శుక్రవారం ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవాలని భావించిన ప్పటికీ రెండు పార్టీల్లోని ముఖ్య నేతల ఒత్తిడితోనే చివరకు బరిలో మిగిలారని అంటున్నారు.
Advertisement