కుమ్మక్కయ్యారు | TDP, Congress nexus | Sakshi
Sakshi News home page

కుమ్మక్కయ్యారు

Published Sat, Jul 5 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కుమ్మక్కయ్యారు - Sakshi

కుమ్మక్కయ్యారు

  • టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు
  •  ఎంపీపీ పీఠాల కోసం అడ్డదారులు
  •  డుంబ్రిగుడలోవైఎస్‌ఆర్‌సీపీ కో-ఆప్షన్ సభ్యుడి కిడ్నాప్
  • ఊహించినట్టుగానే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అధికారపార్టీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. వైఎస్‌ఆర్‌సీపీకి ఎంపీపీ పీఠాలు దక్కుకుండా టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. హంగ్ ఏర్పడిన మండలాల్లో స్వతంత్రులకు భారీ నజరానాలను ఆశ చూపింది. మెజార్టీ ఉన్న స్థానాల్లో సైతం వైఎస్‌ఆర్‌సీపీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్‌తో అపవిత్ర బంధాన్ని నెరపింది. డుంబ్రిగుడలో వైఎస్‌ఆర్‌సీపీ కో-ఆప్షన్ సభ్యుడిని కిడ్నాప్ చేసి రౌడీ రాజకీయాన్ని ప్రదర్శించింది. ఓ మంత్రి ఇలాకాలో బలవంతంగా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల మద్దతు కూడగట్టుకొని పీఠాన్ని సొంతం చేసుకుంది. పాయకరావుపేటలో హైడ్రామా సాగించినప్పటికీ అధికారపార్టీ ఆటలు సాగలేదు.
     
    విశాఖ రూరల్: జిల్లాలోని 39 మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గురువారం ఎన్నిక జరిగింది. ఇందులో టీడీపీ 26, వైఎస్‌ఆర్‌సీపీ 8 ఎంపీపీలను దక్కించుకున్నాయి. సబ్బవరంలో ఎంపీపీ పీఠం స్వతంత్ర అభ్యర్థికి దక్కగా.. మరో నాలుగు మండలాల్లో ఎన్నిక వాయిదా పడింది. ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వాస్తవానికి టీడీపీకి 20 మండలాల్లో, వైఎస్‌ఆర్‌సీపీకి పదింట స్పష్టమైన మెజార్టీ వచ్చింది.

    9 మండలాల్లో హంగ్ ఏర్పడింది. వీటిల్లో  స్వతంత్రులు కీలకంగా మారడంతో వారికి టీడీపీ భారీగా నజరానాల ఎర చూపింది. కొందరికి రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వరకు అధికారపార్టీ ముట్టజెప్పినట్టు భొగట్టా. ప్రభుత్వ పరంగా అవసరమైన పనులు చేయిస్తామని కూడా ఆశ చూపి మద్దతు పొందారు. స్వతంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీటీసీలను సైతం తమ వైపునకు తిప్పుకున్నారు. సబ్బవరంలో ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి.

    వైఎస్‌ఆర్‌సీపీకి ఎంపీపీ పీఠం దక్కకుండా కుటిల రాజకీయం నడపడం ఇక్కడ పరాకాష్ట. ఇలా కుట్రలు చేసి టీడీపీ 26 మండలాల్లో పీఠాలను దక్కించుకుంది. 8 మండలాల్లో ఎంపీపీలను వైఎస్‌ఆర్‌సీపీ సొంతం చేసుకుంది. చింతపల్లి, అరకు, డుంబ్రిగుడ, వి.మాడుగల ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
         
    సబ్బవరం ఎంపీపీ పీఠం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దక్కకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపన్నాయి. 19 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 10, టీడీపీ 6, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లు 2 సెగ్మెంట్లలో గెలిచారు. వైఎస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీ ఎంపీటీసీలను భయపెట్టి టీడీపీ నాయకులు వారి పార్టీలో చేర్పించుకున్నారు. ఇందులో ఒకరు వైఎస్‌ఆర్‌సీపీకి తిరిగి వచ్చారు. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏకమై కాంగ్రెస్ సానుభూతిపరులైన స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకున్నారు. ఒక ఇండిపెండెంట్‌కు రెండేళ్లు, మరో సభ్యుడికి ఏడాదిన్నర, కాంగ్రెస్ ఎంపీటీసీకి ఏడాదిన్నర చొప్పున అధ్యక్ష పదవిని పంచుకోడానికి ఒప్పందం కుదిరింది.
         
    నర్సీపట్నం మండల పీఠాన్ని దక్కించుకోడానికి టీడీపీ కుటిల రాజకీయం చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం ఎంపీపీని దక్కించుకోడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఇక్కడ మొత్తం 9 ఎంపీటీసీలకు వైఎస్‌ఆర్‌సీపీకి 4, టీడీపీకి 3, ఇండిపెండెంట్లు రెండింట గెలిచారు. వాస్తవానికి హంగ్ ఏర్పడినప్పటికీ మంత్రి ఒత్తిడితో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ముగ్గురు సభ్యులు టీడీపీకి మద్దతు తెలపడంతో ఎంపీపీ పీఠం ఆ పార్టీ వశమైంది.
    డుంబ్రిగుడ మండలంలో టీడీపీ నాయకులు బరి తెగించారు. ఏకంగా వైఎస్‌ఆర్‌సీపీ కో-ఆప్షన్ సభ్యుడిని కిడ్నాప్ చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది.
         
    పాయకరావుపేటలో ఎంపీపీ పీఠం దక్కించుకోవడానికి అధికార పార్టీ హైడ్రామా సాగించింది. కానీ విఫలమైన టీడీపీ ఉపాధ్యక్ష ఎన్నికను వాయిదా వేయించింది.
         
    కోటవురట్ల ఎంపీపీ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ ఒక అభ్యర్థిని టీడీపీ లాక్కుంది. దీంతో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు చెరో 8 స్థానాలు ఉండడంతో టాస్ వేశారు. అదృష్టం వైఎస్‌ఆర్‌సీపీని వరించింది. ఉపాధ్యక్ష పదవి మాత్రం టీడీపీకి దక్కింది.
     
    అనంతగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ చెరో 4 స్థానాలు, సీపీఎం ఒక సెగ్మెంట్‌ను దక్యించుకోగా, స్వతంత్రులు అత్యధికంగా ఐదు స్థానాల నుంచి విజయం సాధించారు. దీంతో టీడీపీ వారితో మంతనాలు జరిపి స్వతంత్ర అభ్యర్థిని ఎంపీపీ అధ్యక్షుడిగా ఎన్నుకొని తెలుగుదేశం పార్టీ కండువా కప్పడం విశేషం. చింతపల్లి, అరకు ఎంపీపీ ఎన్నికలకు కోరం లేకపోవడంతో వాయిదా వేశారు.మాడుగుల ఎంపీపీకి సంబంధించి కో-ఆప్షన్ సభ్యుడి నామినేషన్లు నిర్దుష్ట సమయానికి వేయకపోవడంతో ఇక్కడ ఎన్నికను కూడా వాయిదా వేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement