చా..నిజమా
చా..నిజమా
Published Mon, Mar 17 2014 2:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
మారిన మనిషిగా చెప్పుకున్నా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ను వదలని ప్రతికూలత
బీ-ఫారాల కోసం రూ.లక్షలు గుంజుతున్నారని ఆరోపణలు
ఓ సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని విమర్శలు
పార్వతీపురం టీడీపీలో వింత పరిస్థితి
‘నేను పూర్తిగా మారిన మనిషిని..నన్ను నమ్మండి..’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ..! ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు మాటలని గుర్తొచ్చే సిందా..? సరిగ్గా ఇవే మాటలు వల్లిస్తున్నా మన జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపు రెడ్డి జగదీష్‌ను ఎవరూ నమ్మడం లేదట..‘ఈ సారైనా గెలవాలి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి. నాకిది మంచి అవకాశం. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించాలి.’ అని కృతనిశ్చయంతో ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ గత అనుభ వాల దృష్ట్యా ఇప్పటికీ ఆయనను ప్రతికూలత వెంటాడుతూనే ఉంది. బీ-ఫారాలకు రూ. లక్షలు వసూలు చేస్తున్నారని, ఓ సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు కాలం కలిసి రావడంలేదు. పూర్వం నుంచి ఆయన కుటుంబ వ్యక్తిత్వమో, వ్యవహార శైలో తెలియదు గానీ పార్వతీపురం ప్రజలు ఆ కుటుంబానికి పట్టం కట్టడం లేదు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏదీ రాలేదు. టీడీపీలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం నియోజకవర్గంలో ఆ కుటుంబ సభ్యు లు రెండు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయారు. 1999లో ద్వారపురెడ్డి జగదీష్ వదిన ప్రతిమాదేవి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరిశర్ల శివున్నాయుడు చేతిలో పరాజయం పాలవగా, 2004లో స్వయంగా జగదీష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి శత్రుచర్ల విజయరామరాజు చేతిలో ఓట మి చవిచూశారు.
ఇక ఆ తర్వాత పార్వతీపు రం శాసనసభ నియోజకవర్గం ఎస్సీజనరల్‌గా రిజర్వ్ కావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశానికి దూరమయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మ న్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడమో, నేరుగా నామినేటెడ్ పోస్టులు పొందడమో మాత్రమే ఆయనకు ప్రత్యామ్నా యం. దీంతో గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున జగదీష్ భార్య శ్రీదేవి ప్యానెల్ పోటీ చేసింది. కానీ ఆ ఎన్నికల్లో కేవలం మూడు కౌన్సిలర్ స్థానాలు మాత్రమే దక్కడం తో చైర్‌పర్సన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయా రు.
చివరికి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ బలపరిచిన బొబ్బిలి చిరంజీవులు ఓటమి చెందారు. ఇలా ప్రతి ఎన్నికల్లో ప్రజల ఆదరాభిమానాలు పొందడంలో జగదీష్ విఫలమవుతున్నారు. ప్రతి విషయంలో తలదూర్చి ఇబ్బంది పెడతారని కొన్ని వర్గాలు..రోడ్డు విస్తరణలో అడ్డగోలుగా వ్యవహరించారని వ్యాపార వర్గాలు ఓ స్థిరమైన అభిప్రాయానికి వచ్చేయడంతో ఎన్నికలొచ్చేసరికి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ, షరా మూమూలుగా ఓటమిని చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ ప్రజాదరణ ఎక్కువగా వైఎస్సార్‌సీపీలోకి జంప్ అవుతారని తెలుసుకుని, చేజారిపోతున్న నాయకు ల్ని ఆపకపోతే పార్టీ బలహీనమవుతుందన్న ఉద్దేశంతో హుటాహుటిన జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలను ఆయనకు అప్పగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అందరికీ జగదీష్ పరిచయమయ్యారు.
ఇప్పుడా హోదాతో పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. తనకిదే మంచి అవకాశమని చైర్మన్ పోస్టుపై కన్నేశారు. తనకు పార్టీలో మరెవరూ పోటీ లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నారు. కాంగ్రెస్ పరి స్థితి అగమ్యగోచరంగా తయారవడం, వైఎస్సార్‌సీపీలో సీట్లు ఖాళీలేకపోవడంతో వలస వచ్చిన నాయకుల తో పాటు టీడీపీ నేతలను కౌన్సిలర్లుగా బరిలో కి దించారు. అంతేకాకుండా ఓ సామాజిక వర్గ నేతతో ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్ ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా ‘నేను మారిన మనిషిని. నాకిదే అవకాశం. గెలిపిస్తే రుణం తీర్చుకుంటాను’ అంటూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు.
ఎన్నికల ఫండ్ కోసం...
కానీ, నామినేషన్ వేసిన అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చేసరికి పార్టీ ఫండ్‌కని, ఎన్నికల ఖర్చుకని రూ. మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు తెల్లమొహం వేస్తున్న ట్లు తెలుస్తోంది. గత పదకొండేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమనే డబ్బులడుగుతున్నారంటూ సొంతపార్టీ అభ్యర్థులే నివ్వెరపోతుం డగా, నేరకపోయి వచ్చామంటూ వలస అభ్యర్థులు వాపోతూ సన్నిహితు వద్ద తమ బాధను వెళ్లగక్కుతున్నట్లు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సొంతంగా పోటీలో ఉంటాం
ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు డబ్బులిచ్చుకోలేక స్వతంత్రంగానే బరిలోకి దిగుతామంటూ తెగేసి చెప్పేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తమను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని, తమకు అన్యా యం చేశారని పట్టణంలోని ఓ సామాజిక వర్గం ఆవేదన చెందుతోంది. వైస్‌చైర్మన్ పదవి కూడా తమకు దక్కకుండా జగదీష్ కుట్రపూరితంగా వ్యవహరించారని పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఆ సామాజిక వర్గ నేతలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి జగదీష్‌ను ఏదో ఒక రకంగా ప్రతికూల పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి.
Advertisement
Advertisement