
తెలుగుదేశం పార్టీకి 3.65 ఎకరాలు
►గుంటూరు జిల్లా ఆత్మకూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయం
►ఎకరానికి ఏడాదికి లీజు రూ.1,000
►33 ఏళ్ల పాటు లీజు తరువాత 99 ఏళ్లకు లీజు పొడిగింపు
►ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం
అమరావతి : రాష్ట్రంలో నిలువ నీడ లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. ఇళ్ల స్థలాల కోసం మూడు జన్మభూమి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇళ్ల స్థలాలను కేటాయించడంపై శ్రద్ధ చూపని తెలుగుదేశం సర్కారు మరోవైపు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే పనిలో పడింది. అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతి జిల్లాలో, రాష్ట్రస్థాయిలో వీలైనంత మేర కారుచౌకగా ఆస్తులను సమకూర్చిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు ప్రభుత్వం గతేడాది ప్రత్యేకంగా జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి గుంటూరు జిల్లా మంగళగరి మండలం ఆత్మకూరులో 3.65 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గతనెల 31వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి పేరుమీద పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ భూమిని కేటాయించారు.
తొలుత 33 ఏళ్లపాటు లీజుకు కేటాయిస్తూ, ఆ తరువాత లీజును 99 ఏళ్ల వరకు పొడిగించేలా నిర్ణయం తీసుకున్నారు. లీజును ఎకరానికి ఏడాదికి రూ.1,000గా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏ సిఫార్సు మేరకు ఆత్మకూరు గ్రామంలోని సర్వే నంబర్లు 392–2లో 0.13 ఎకరాలు, 392–3లో 0.64 ఎకరాలు, 392–4లో 1.80 ఎకరాలు, 392–8లో 0.74 ఎకరాలు, 392–9లో 0.27 ఎకరాలు, 392–10లో 0.07 ఎకరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించారు.
ఆ భూమి విలువ రూ.7 కోట్లు
ఆత్మకూరులో మార్కెట్ విలువ ఎకరానికి రూ.2 కోట్లు ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దీనిప్రకారం టీడీపీకి కేటాయించిన భూమి విలువ రూ.7 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కార్యాలయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో 2,000 చదరపు గజాల స్థలాన్ని ఏడాదికి రూ.25 వేల రూపాయల లీజుకు కేటాయిస్తూ గతేడాది జీవో జారీ చేశారు. అలాగే శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోనూ టీడీపీ కార్యాలయాల కోసం స్థలాలను కేటాయించారు.