- ఎమ్మెల్సీ ఎన్నికలో డబ్బు పంపిణీకి తెరతీసిన టీడీపీ
- అభ్యర్థి రామకష్ణ గెలుపే ధ్యేయంగా అడ్డదారులు
- ఉపాధ్యాయ సంఘాలకు ఖరీదైన లాప్‌ట్యాబ్‌లు,సెల్‌ఫోన్లు అందజేత
- తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన లక్ష్మణరావు
గుంటూరు : ఈ నెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ డబ్బు పంపిణీకి తెరతీసింది. ఒక్కో ఓటుకు రూ.మూడు వేల చొప్పున అందజేస్తోంది. గురువారం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంపిణీ ప్రారంభం కాగా, శుక్ర, శనివారాల్లో పట్టణాలు, నగరాల్లో పంపిణీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతలు నేరుగా పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు ఈ డబ్బు అందజేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి ముద్దు కష్ణమనాయుడు, ఇతర సీనియర్లు అభ్యర్థి ఏఎస్ రామకష్ణ గెలుపు కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి మంత్రి పుల్లారావు ఏ రోజుకారోజు అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే జిల్లాకు చేరుకుంటూ పార్టీ నేతలకు సూచనలు ఇస్తున్నారు.
ఒక దశలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చలేనని అభ్యర్థి చేతులు ఎత్తేయడంతో మంత్రి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో నేతలంతా అవసరమైన నిధులను సమకూర్చుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు డబ్బు పంపిణీ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సందర్భంలోనూ నాయకులందరితో మాట్లాడి అభ్యర్థి గెలుపునకు గట్టిగా కషి చేయాలని ఆదేశించారు. దీంతో గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు పంపిణీ ప్రారంభమైంది. కొందరు టీడీపీ నేతలు మాచర్ల, రెంటచింతలకు వెళ్లి కవర్లు అందజేశారు. జిల్లాల వారీగా నేతలకు డబ్బు పంపిణీ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే అభ్యర్థి ఏఎస్ రామకష్ణ ఉపాధ్యాయ సంఘాలకు లాప్‌ట్యాబ్‌లు, ఖరీదైన సెల్‌ఫోన్లను బహుమతులుగా అందజేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా వరకు అభ్యర్థి తరఫున ప్రచారం, డబ్బు పంపిణీ బాధ్యతలను ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ముద్దు కష్ణమనాయుడులు నిర్వహిస్తున్నారు. ప్రచార సామగ్రి పంపిణీ, ఇతర పనుల నిర్వహణ బాధ్యతలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు చూస్తున్నారు.
ఓటర్లకు చంద్రబాబు లేఖ
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ ఓటరుకు నేరుగా ఓ లేఖ రాశారు. ఓటరు పేరుతో ముద్రించిన ఆ లేఖలో ఉపాధ్యాయులకు ఆయన చేసిన సేవలను వివరించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పదవీ విరమణ వయసు, ఫిట్‌మెంట్ పెంచిందని, పనిగంటల్లో మార్పుల చేసినట్టు తెలిపారు. తాము అందించిన సేవలను దష్టిలో ఉంచుకుని అభ్యర్థి ఏఎస్ రామకష్ణకు ఓటు వేసి గెలిపించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఉన్నప్పటికీ మంత్రి పుల్లారావును జిల్లాలో ఎన్నికల పనులు చూడాలని ఆదేశించినట్టు తెలిసింది.
లక్ష్మణరావు ఫిర్యాదు
శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి కొంతమంది దళారులు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఎస్పీలకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రామకష్ణపై కేసు నమోదు
టీడీపీ అభ్యర్థి ఏఎస్ రామకష్ణపై ఈ నెల 3వ తేదీన పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో కె.రజనీష్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 420 తోపాటు మరో పది సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సివిల్ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశారు.
ఓటుకు రూ. 3వేలు ఇస్తున్న టీడీపీ
Published Fri, Mar 20 2015 12:14 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement