పింఛన్.. వంచించెన్
సాక్షి, ఏలూరు:వృద్ధులు, వితంతువులకు రూ.1,000.. వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్ మొత్తంగా అందిస్తామని పాలకులు ప్రకటిం చడంతో లబ్ధిదారులంతా సంబరపడ్డారు. అక్టోబర్ 2 నుంచి జన్మభూమి గ్రామ, వార్డు సభల్లో సొమ్ముల్ని పంపిణీ చేస్తామంటే ఆశగా ఎదురుచూశారు. కానీ.. వారి సంతోషం ఆదిలోనే ఆవిరవుతోంది. సామాజిక తనిఖీ పేరుతో ఇప్పటికే వేలాది మంది పేర్లను పింఛన్ల జాబితాల నుంచి తొలగించారు. అది చాలదన్నట్టు తాజాగా మరికొన్ని నిబంధనలు విధించారు. వాటివల్ల ఇప్పటివరకూ అర్హులైన వారు సైతం ఇకపై పింఛన్ తీసుకోవడానికి అనర్హులు కానున్నారు. మరోవైపు పింఛన్లు తీసుకునేందుకు గ్రామ సభలకు వెళుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాం గులు పింఛన్ జాబితాలో పేరు లేదనడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికొందరు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. దీంతో జన్మభూమి సభలు రసాభాసగా మారుతున్నాయి.
ఏలూరు 16వ డివిజన్‌లో బుధవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఇదే జరిగింది. అప్పినీటి వెంకటేశ్వరరావు అనే లారీ డ్రైవర్‌కు నాలుగేళ్ల క్రితం ప్రమాదం కారణంగా ఎడ మ కాలు తీసేశారు. అప్పటి నుంచి అతడు రూ. 200 పింఛన్ పొందుతున్నాడు. కాలు పూర్తిగా లేకపోరుునప్పటికీ 36 శాతమే వైకల్యం ఉందంటూ తాజాగా సదరం సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. దీంతో అతడిని వికలాంగుల కోటా నుంచి తొలగించి వృద్ధాప్య పింఛన్ జాబితాలో చేర్చారు. ఫలితంగా రూ.500 నష్టపోతున్నానని ఎమ్మెల్యే బడేటి బుజ్జికి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏలూరు దక్షిణపువీధికి చెందిన సుంకర అన్నపూర్ణ 1931వ సంవత ్సరంలో పుట్టారు. 83 ఏళ్ల వయసున్న ఈ వృద్ధురాలు గతనెల వరకు పింఛన్ తీసుకోగా, తాజా జాబితాలో ఆమె పేరు లేదు. ఎందుకు తీసేశారో చెప్పమంటూ ఆమె పాలకులను, అధికారులను నిలదీశారు. ఇలాంటి ఘటనలు ప్రతిచోట జన్మభూమి సభల్లో చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఇప్పటికే 23,770 మంది అనర్హులు
జిల్లాలో 3లక్షల 30వేల 993 మంది పింఛన్లు పొందేవారు. సామాజిక తనిఖీ నిర్వహించి 23,770 మందిని అనర్హులుగా గుర్తించారు. వీరిలో 7,470 మంది తక్కువ వయసు వారని, 1,036 మంది వితంతువులు కాకపోయినా పెన్షన్లు పొందుతున్నారని, 162 మంది వికలాంగుల పేరుతో పింఛన్ తీసుకుంటునారని అధికారులు చెబుతున్నారు. 2,092 మంది రెండుచోట్ల పెన్షన్లు పొందుతున్నారని, 7,545 మంది చనిపోయారని అంటున్నారు. ఇక పింఛన్ల కోసం కొత్తగా 56,784 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలు ఇవీ : పింఛన్ ఎగవేతకు ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరిస్తోంది. నిబంధనల పేరుతో అర్హులకు సైతం పింఛన్ ఎగ్గొడుతున్నారు. లబ్ధిదారుల వయసు రేషన్ కార్డులో ఒకటి, పింఛనుదారుల జాబితాలో మరొకటి ఉంటే పింఛన్ తొలగిస్తున్నారు.
పింఛనుదారుడికి పొలం ఉండి, సాంకేతికంగా అతని భూమిని కుమారులు పంచుకున్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతడి పేరుతోనే ఆ భూమి ఉంటే పింఛన్ దక్కదు. రేషన్ కార్డులు, అధార్‌కార్డులు, పింఛనుదారుల జాబితాలో పేర్ల నమోదులో పొరపాట్లు దొర్లడం వంటి కారణాల వల్ల కొందరు పింఛన్ కోల్పోవాల్సి వస్తోంది. పింఛనుదారుడిగా అర్హత ఉండి, పొట్టకూటి కోసం పొరుగు గ్రామాలకు వలస వెళ్లిన వారిని జాబితాలో చేర్చడం లేదు. మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు ఉన్నా, కారు ఉన్నా ధనవంతులకిందే లెక్కగట్టి పింఛన్ ఇవ్వమంటున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఏదైనా ఉద్యో గం చేస్తూ జీతం లేదా ఉద్యోగానికి సంబంధించి పెన్షన్ పొందుతున్న వారికి పింఛన్ రాదు. నెలవారీ జీతం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు సైతం అనర్హులే. వృద్ధాప్య పింఛనుదారులకు కనీస వయసు 65 సంవత్సరాలు. వితంతువులకు కనీస వయసు 16 ఏళ్లు, వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం ఉండాలని నిబంధన విధించారు.
పింఛన్ పెంచుతామని ఉన్నది తీసేస్తారా
నా వయసు 70 ఏళ్లు. చేనేత కార్మికుల కోటాలో పదేళ్లుగా పింఛన్ వస్తోంది. నా కుమారుడు సత్యనారాయణకు పెళ్లయిన తరువాత అతనికిచ్చిన రేషన్ కార్డులో నా పేరు కూడా చేర్చారు. కొన్నాళ్ల క్రితం వాడు చనిపోవడంతో నా కోడలు పుణ్యవతికి వితంతు పింఛన్ వస్తోంది. ఇప్పుడు నాకు ఇచ్చే పింఛను రద్దు చేశారు. ఇన్నేళ్లుగా అర్హత ఉన్న నేను ఇప్పుడు అనర్హురాలిననడం అన్యాయం. కొత్త ప్రభుత్వం పింఛన్ పెంచాతామంటే చాలా సంతోషించాను. ఇప్పుడు ఇస్తున్న పింఛన్ కూడా రద్దు చేస్తోంది.
- యర్రంశెట్టి నాగరత్నం, పెనుమంచిలి, ఆచంట మండలం
అత్తకు ఇచ్చి నాకు తీసేస్తే ఎలా
నా భర్త మరణించడంతో చాలా ఏళ్లుగా వితంతు పింఛన్ పొందుతున్నాను. మా అత్తగారికి వృద్ధాప్య పింఛన్ ఉండటంతో ఇంటికి ఒక్కటే పింఛన్ అంటూ నా పింఛన్ తొలగించారు. ఆనారోగ్యంతో ఏపనీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న నాకు ఆసరా ఏముంది. అత్తకు పింఛను ఇచ్చి నాకు తీసేస్తే నేనెలా బతకాలి.
- మల్లుల లక్ష్మి, కె.సముద్రపుగట్టు, అత్తిలి మండలం