సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఎవ్వరూ నన్ను మోసం చేయలేరు. పింఛను కోసం వయస్సును మార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు శ్మశానం నుంచి వచ్చి పింఛన్లు తీసుకుని తిరిగి శ్మశానానికి వెళ్లిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదో విడత జన్మభూమి–మావూరు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి లో శుక్రవారం నిర్వహించిన సభలో ముఖ్య మంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్‌లో విద్య విషయంలో అన్ని విధాలుగా విజయనగరం జిల్లాను అభివృద్ధి చేస్తానంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం పిల్లలు ఒత్తిడికి గురి కావటంతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలోనే విద్యార్థుల ఆత్మహత్యలు తక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో తెల్లవారితే 4 గంటలకు నిద్రలేపి రాత్రి 12 గంటల వరకు చదివించటంతో సమస్యలు వస్తున్నాయని, పిల్లల జీవితాలతో ఆడుకోవటానికి వీల్లేదన్నారు.
సమైకాంధ్రంగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం కాగా తానే హైటెక్ సిటీ పెట్టి, 25 ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉంటే 300లకు పెంచానని చెప్పుకొచ్చారు. పిల్లల్ని పనిలో పెట్టుకోవటం క్షమించరాని నేరం అని, 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు స్కూల్లో ఉండాలనీ తెలిపారు. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమని చెప్పిన తానే పిల్లల్ని కనండి జనాభా పెంచండి అని ఇప్పుడు చెబుతున్నాననీ పిలుపునిచ్చారు. లేకుంటే ఇతర దేశాల మాదిరి ముసలి వారి సంఖ్య పెరిగిపోతుందని ముందు జాగ్రత్తతో ప్రచారం ప్రారంభిస్తున్నాననీ వివరించారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డిజిటల్ తరగతులు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో యూనివర్శిటీలను మెరుగుపర్చేందుకు పోటీ పెట్టి ఎక్కడికక్కడ యూనివర్శిటీ, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలకు ర్యాంకింగ్‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో జీవితాలను మార్చేది టెక్నాలజీ అని అయితే దానికి బానిసలు కావద్దనీ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment