- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై స్వారీ
- రేషన్ బియ్యం నుంచి రుణమాఫీ వరకు జోక్యం
- అనుయాయులకే లబ్ధి చేకూరేలా అధికారులపై ఒత్తిళ్లు
గుంటూరు ఈస్ట్ : తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలు, రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై స్వారీ చేస్తున్నాయి. తమ ఇష్టులకు మాత్రమే పథకాలు వర్తించేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇతర పార్టీల సర్పంచ్‌లను సైతం కాదని టీడీపీ అనుయాయులకే లబ్ధి చేకూరుస్తున్నాయి.
దీపం పథకం : కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 28 వేల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. జిల్లాలోని 12 మున్సిపాల్టీలు, 57 మండలాలు, గుంటూరు కార్పొరేషన్‌లోని అర్హులకు ఈ పథకం కింద దరఖాస్తులు తీసుకుని కనెక్షన్లు మంజూరు చేయాలి. అన్ని మండలాల్లో తహశీల్దార్లు గ్రామ కమిటీలు సిఫారసు చేసిన వారి దరఖాస్తులనే తీసుకొంటున్నారు. ఇదేమని బీజేపీ, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వారంతా వాపోతున్నారు.
రుణమాఫీలోనూ మతలబే...
జిల్లాలో రుణమాఫీకాని రైతుల కోసం ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టరు కార్యాలయంలో ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన వందలాది మంది రైతుల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు కాలేదని ఇప్పుడు దరఖాస్తు ఇవ్వడానికి అర్హత లేదని సమాధానం వచ్చింది. అన్ని అర్హతలు ఉండి ఇప్పటికి రెండుసార్లు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం పత్రాలన్నీ సమర్పించినా, తమ వివరాలు కనీసం వెబ్‌సైట్లో నమోదు కాకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ టీడీపీ నాయకులు అనధికారికంగా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాల్సిన రైతుల పేర్లను టీడీపీ నాయకులు ఆయా మండలాల్లో బ్యాంకర్లకు సూచించారని తెలుస్తోంది. ఆ ప్రకారమే రుణమాఫీ జరిగినట్టు సమాచారం.
ఇతర పథకాల్లోనూ ఇదే తంతు...
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ మాటే చెల్లుబాటు అవుతోంది. వారు సూచించిన వారికే ప్రథమ స్థానం లభిస్తోంది. వీటితోపాటు రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టలు, డ్రయర్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై సరఫరా చేసే విషయంలోను గ్రామ కమిటీ సభ్యుల హవాయే కొనసాగుతోంది. సర్పంచులు, వీర్వోలు, వీఆర్‌ఏలు, సెక్రటరీలు మాట ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు. రేషన్ బియ్యం, పింఛన్‌పై బతికే అభాగ్యులపై కూడా గ్రామ కమిటీ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.
సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరం...
ఇతర పార్టీల జెండాపై గెలిచిన సర్పంచ్‌లను డమ్మీలు చేస్తున్నారు. గ్రామ కమిటీ సభ్యులు చేసే అసత్య ఆరోపణలకు అధికారులు స్పందించి ఇతర పార్టీల సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, డ్వాక్రా మహిళల విషయంలో పార్టీల పరంగా వ్య త్యాసాలు చూపించడమేకాకుండా వారిపై వేటు వేస్తున్నారు. అనేక మండలాల్లో, గ్రామాల్లో టీడీపీ నాయకుల ప్రతాపానికి గురైన మహిళలు గత 9 నెలల్లో వందలాదిమంది జిల్లా అధికారుల వద్దకు వచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు.
దేశం కమిటీల దందా!
Published Sun, May 3 2015 4:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement