
‘ఆధార్’ పడిగాపులు
నక్కపల్లి : రుణమాఫీ వర్తించాలంటే ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డు నకళ్లను అందజేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రైతుల రద్దీతో ఇతర లావాదేవీలకు బ్యాంకులకు వెళ్లేవారు సకాలంలో పనులు పూర్తికాక ఇబ్బందులు పడుతున్నారు.టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వివిధ ధ్రువపత్రాల నకళ్లను అడగడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఈనెలాఖరులోగా ఆధార్ నంబర్లు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు మంజూరు కావని అధికారులు హెచ్చరించడంతో లబ్ధిదారులు పిల్లాపాపలతో ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. రేషన్‌డీలర్లు, వీఆర్వోలు అక్కడ తిష్టవేసి రేషన్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆధార్‌కార్డులు కలిగిన వారయితే జిరాక్స్‌లు తీసుకోవడానికి సయితం క్యూలో వేచి ఉంటున్నారు.
నర్సీపట్నం డివిజన్‌లో రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా మూడు లక్షల యూనిట్లకు ఆధార్ నంబర్లు సీడింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆధార్ కార్డులు లేనివారికోసం ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలామంది కూలిపనులు మానుకుని కూడా ఆధార్ నంబర్లు సీడింగ్ చేయించుకోవడం, కొత్తకార్డులు తీసుకోవడం కోసం ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఇవ్వకపోతే దాన్ని సాకుగా చూపి లబ్ది చేకూర్చరేమోనన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.