బ్యాంకు అధికారులకు వివరాలివ్వండి | Bank officials | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారులకు వివరాలివ్వండి

Published Tue, Aug 19 2014 3:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

Bank officials

  • ఈ నెల 28 లోపు ఆధార్ సీడింగ్ పూర్తికావాలి
  •  కలెక్టర్ శ్రీకాంత్
  • సాక్షి, నెల్లూరు: రుణమాఫీ కోసం బ్యాంకు అధికారులకు రైతులు తమ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్ తదితర వివరాలను వెంటనే అందజేయాలని కలెక్టర్ శ్రీకాంత్ సూచించారు. కలెక్టరేట్‌లోని జూబ్లీ సమావేశ మందిరంలో బ్యాంకు , రెవెన్యూ అధికారులతో సోమవారం కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతురుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం సూచించిన
    30 అంశాలతో కూడిన ఫార్మెట్‌లో వివరాలను అందజేయాలన్నారు.

    ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 14న జీఓ ఎంఎస్ నంబర్ 31ని జారీ చేసిందన్నారు. వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందన్నారు. వీలైతే రైతులు స్వయంగా వచ్చి సంబంధిత వివరాలను బ్యాంకు అధికారులకు అందిస్తే మంచిదని కలెక్టర్ సూచించారు. అలా కాని పక్షంలో ఎంపీడీఓలు, గ్రామాలకు వచ్చే  ఎన్యుమరేటర్లకు వివరాలు అందించాలన్నారు.

    ఆధార్ కార్డు లేని వారు తక్షణం సంబంధిత మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు వెళ్లి కార్డు తీయించుకోవాలన్నారు. ఆధార్‌లేని వారికి ఐదు రోజుల్లోనే కార్డు అందజేస్తామన్నారు. రుణమాఫీ పొందాలంటే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, రెవెన్యూ సిబ్బంది త్వరితగతిన ఆధార్ సీడింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకు రుణాలు పొందిన రైతుల  వివరాలను ముందు బ్యాంకు అధికారులకు అందించాలన్నారు. ఆ తర్వాత మిగిలిన వారి వివరాలను ఇవ్వవచ్చన్నారు.  

    ఈ ప్రక్రయ త్వరితగతిన పూర్తయ్యేలా ఆర్‌డీఓలు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. లీడ్ బ్యాంకు మేనేజర్  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు అధికారులు రైతులకు సంబంధించిన  ఆధార్,రేషన్‌కార్డు వివరాలను ఈ నెల 28 నాటికి తెప్పించుకోవాలన్నారు. జిల్లాలో వెంకటగిరి ,డక్కిలి మండలాల్లో మాత్రమే 2013లో కరువు నెలకొందన్నారు. ఆ రెండు మండలాల్లో మాత్రమే రుణాల రీషెడ్యూల్ ఉంటుందన్నారు. ప్రతి రైతుకు * లక్ష లోపు రుణాన్ని మాత్రమే ఇస్తామన్నారు.

    రైతులందరి వద్ద పాస్ బుక్కులు లేవని, ఇది ఇబ్బందికరంగా ఉంటుదని కొందరు బ్యాంకు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అడంగల్ చూసి రుణాలు ఇచ్చి ఉంటే ప్రస్తుతం ఆ వివరాలనే  అందజేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో  నాబార్డ్ ఏజీఎం వివేకానందరెడ్డి,సిండికేట్ బ్యాంకు ఏజీఎం శ్రీనివాసరావు,ఆర్డీఓలు కోదండరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, డీఎస్‌ఓ శాంతకుమారి,  వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement