సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఐదేళ్లు పరిపాలించినా శ్రీకాకుళం జిల్లాలో తమకంటూ ప్రత్యేకంగా ఫలానా పని చేశామని చెప్పుకోవడానికి టీడీపీ నాయకులకు ఏ ప్రాజెక్టూ కనిపించట్లేదు. వంశధార ప్రాజెక్టు, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు మిగులు పనులు చేశామని చెప్పుకోవడానికైనా అవి రెండూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడుపోసుకున్నవే! ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)ను ఆయనే ప్రారంభిస్తే గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా నిర్వీర్యం చేసే చర్యలే చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే ఉద్దేశంతో డాక్టరు బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని వైఎస్ ప్రారంభించారు. కానీ గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఉన్న ఉద్యోగులను కనీసం రెగ్యులైజేషన్ కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న కోడిరామ్మూర్తి స్టేడియాన్ని ఆధునిక క్రీడాప్రాంగణం నిర్మించే పేరుతో నాలుగేళ్ల క్రితం కూలదోయించారు. క్రీడా ప్రాంగణానికి చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేసినా ఈ మూడేళ్లలో పునాదుల నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఇక శ్రీకాకుళంలో రింగ్‌రోడ్డు వేస్తామని, స్మార్ట్‌సిటీ చేస్తామని, పారిశ్రామిక హబ్‌లు తీసుకొస్తామని జిల్లాలో పర్యటనకొచ్చినప్పుడల్లా హామీలు ఇచ్చినా వాటి జాడ లేకుండా పోయింది. ఇలా టీడీపీ చెప్పుకోవడానికి ఏమీ కనిపించకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రభావం ఈనెల 17న శ్రీకాకుళంలో జరిగిన ఆపద్ధర్మ ముఖ్య మంత్రి చంద్రబాబు బహిరంగసభ, 26వ తేదీన జరిగిన లోకేష్ ప్రచార కార్యక్రమాలపైనా కనిపించింది. పొందూరులో ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. రోడ్డుషోలకు జనాదరణ అంతంతమాత్రంగానే ఉంది.
ప్రలోభాలకే పెద్దపీట...
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రలోభాలకే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీఎత్తున డబ్బు సంచులు టీడీపీ నాయకులకు అందుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రాజాంలో టీడీపీ అభ్యర్థికి సంబంధించిన రూ.5 కోట్ల వరకూ నగదు సోదాల్లో పట్టుబడిందని వార్తలు వచ్చాయి. పలాసలో గ్రామస్థాయి నాయకులకు టీడీపీ నేతల నుంచి భారీగానే నజరానాలు అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గం లోనూ కనిపిస్తోంది. ఇది చాలదన్నట్లుగా మరో వైపు విద్యా, వ్యాపార సంస్థలు, వాటికి సంబం ధించిన వాహనాల ద్వారా డబ్బును గ్రామాలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిఘా వైఫల్యం వల్లేనా?
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టకుండా డబ్బు పంపిణీని నిరోధించేందుకు జిల్లాలో 19 స్టాటిక్ సర్వైవల్ టీమ్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇలాంటి బృందాలు ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం వంద వరకైనా ఉండాలి. కానీ వాటిలో ఐదో వంతు కూడా లేవు. దీంతో తనిఖీలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. పేరుకు 24 గంటల పాటు పనిచేస్తాయని చెబుతున్నప్పటికీ రాత్రిపూట ఒక్కో బృందంలో సభ్యులు ఇద్దరు ముగ్గురికే పరిమితమవుతున్నారు. దీంతో ఆ బృందాలు రాత్రిపూట కొన్ని వాహనాలను తనిఖీ చేయకుండానే వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల తనిఖీ చేసినప్పుడు పరిమితికి మించి నగదు పట్టుపడినా, ఆధారాల్లేని సొమ్ము దొరికినా టీడీపీ నాయకుల పేర్లు చెబితే వదిలేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment