పారిశ్రామిక వాడల్లో భూములపై సర్కార్ కన్ను
బొబ్బిలి:రాష్ట్రంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వం కన్ను పారిశ్రామిక వాడల్లో ఖాళీగా ఉన్న భూములపై పడింది. అతి తక్కువ ధరకు వందలాది ఎకరాలు కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టకుండా ఏళ్ల తరబడి వృథాగా ఉంచేసిన భూములపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పారిశ్రామికవాడల్లో ఎక్కడెక్కడ ఎంతెంత భూములున్నాయో నివేదిక లు కోరుతోంది. రాష్ట్రంలో కొత్తగా పారిశ్రామిక విధానం వస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని వెనక్కి తీసుకోవడమా? లేక ఇప్పటి ధరలకు అనుగుణంగా లెక్క కట్టి మిగిలిన సొమ్మును రాబట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవడమా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
గ్రోత్ సెంటర్‌లో ఖాళీగా 700 ఎకరాలు
బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో దాదాపు 700ఎకరాలు ఖాళీగా ఉ న్నాయి. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఇటువం టి భూములపైనే దృష్టిసారించారు. బొబ్బిలిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి 1995లో భూసేకరణ చేశారు. పట్టణంతో పాటు సమీపంలోని ఎనిమిది గ్రామాల నుంచి దాదాపు 1150 ఎకరాలను సేకరించారు. అప్పట్లో పరిశ్రమ లు స్థాపించడానికి ముందుకు వచ్చిన వారికి స్వ్కేర్ మీటరు రూ.200కు ఇస్తామని ప్రకటించి అందుకు అవసరమైన రహదారు లు, విద్యుత్తు, పరిపాలనాభవ నాల వంటివి నిర్మాణం చేశారు. గ్రోత్‌సెంటర్‌లో గ్రీన్‌బెల్టు, రిజర్వు సైటు, భవనాల కోసం 300 ఎకరాల వరకూ విడిచి పెట్టగా మిగిలిన 850 ఎకరాల్లో పరిశ్రమలకు దాదాపు 475 ప్లాట్లను వేశారు.
అయితే పారి శ్రామికవేత్తలు ముందుకు రాకపోవడంతో స్క్వేర్ మీటర్ ధర రూ.50 తగ్గించారు. అప్పటికీ ఎవ్వరూ రాకపోవడంతో ఒక రూపాయికి ఇచ్చేం దుకు ప్రకటించినప్పటికీ పారిశ్రామికవేత్తలు ముందుకు రా లేదు. అయితే 2004లో వైఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించడంతో బొ బ్బిలి గ్రోత్‌సెంటర్‌పై అందరి దృష్టి పడింది. 2006 నుంచి ఇక్కడ స్థలాల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టా రు. అప్పటికి స్క్వేర్ మీటరు ధర రూ.75ఉంది. దాంతో ప్ర ధానంగా స్టీల్‌ప్లాంటు నిర్మాణం కోసం బీకే స్టీల్స్ కంపెనీ 244 ఎకరాలు తీసుకుంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్‌ప్లాంటు సంయుక్తంగా 112 ఎకరాలను మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (మోయిల్) అనే పరిశ్రమను పెట్టడానికి భూములు తీసుకున్నారు. వైజాగ్ స్టీల్ ఎక్సేంజ్ మినీ స్టీల్‌ప్లాంటుకు 88 ఎకరాలు తీసుకున్నారు. ఈ మూడు కంపెనీలే 444 ఎకరాల వరకూ తీసుకున్నాయి. అవి ఏర్పాటైతే వాటికి సంబంధించి అనుబంధ ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నా...ఫలితం లేక పోయింది. వాటితో పాటు దాదాపు 150 ప్లాంట్లలో సుమారు 2వందల ఎకరాల వరకూ పరిశ్రమలు స్థాపించకుండా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం గ్రోత్ సెంటర్‌లో 130 వరకూ వివిధ స్థాయిల్లో నిర్మాణాలు ఉండగా, 80 వరకూ పనిచేస్తున్నాయి. పరిశ్రమల కోసం స్థలాలు తీసుకుని ప్రారంభించని వారికి ఏపీఐఐసీ అధికారులు నోటీసులు ఇస్తున్నా, వాటికి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎంచక్కా స్థలాలు వదలకుండా ఉంటున్నారు. ప్రస్తుతం గ్రోత్‌సెంటర్‌లో స్థలాల ధరలు స్క్వేర్ మీటరు రూ.750 వరకూ ఉంది.
ఇంత విలువైన స్థలంలో వందలాది ఎకరాలు వృథాగా ఉండకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచి స్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ర్టస్థాయిలో జరిగిన సమావేశంలో వీటిపై సుదీర్ఘంగా చర్చించినట్లు భోగట్టా. ముందుగా వాటి రద్దుకు నోటీసులు ఇవ్వడం, దానికి స్పందించి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కకట్టి వ్యత్యాసాన్ని తీసుకోవడం ఒకటే మార్గమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో రానున్న నూతన పారిశ్రామిక విధానంలో దీనిని అమలుచేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2006లో కేవలం రూ.75కే స్వ్కేర్‌మీటరును తీసుకుని ఇప్పుడు దానికి రూ.750 వసూలు చేసి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.