ఏలూరులోని అన్న క్యాంటీన్ భవనం
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ఏడాది గడువుండగా హడావుడిగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్మాణంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రూ.కోట్లు దండుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు పెట్టే భోజన పథకంలోనూ చేతివాటం చూసుకున్నారనే ఆవేదన సామాన్య ప్రజల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు రూ.5కే భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను నిర్మించగా జిల్లాలో 16 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.36 లక్షలు చొప్పున, స్థానిక నగరపాలక, మున్సిపల్ సంస్థల ద్వారా రూ.6 లక్షలు చొప్పున వెరసి ఒక్కో అన్న క్యాంటీన్‌కు రూ.42 లక్షల నిధులు కేటాయించారు.
క్యాంటీన్‌ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల నుండి ఉచితంగానే అందజేశారు. అయినా ఒక్కో చదరపు అడుగుకి స్థలంతో కలిపి రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చవుతుండగా అన్న క్యాంటీన్లకు స్థలం ఖర్చు లేకుండానే ఒక్కో అడుగుకి రూ.5,532 చొప్పున చెల్లించడంపై అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వచ్చాయి. బిల్డింగ్ నిర్మాణానికి ఒక్కో అడుగుకి రూ.1500 నుండి రూ.2 వేలు ఖర్చవుతుండగా అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం తన అనుచరులకు అడుగుకి రూ.3,500 నుంచి రూ.4 వేలు అదనంగా దోచి పెట్టిందని పలువురు ఆరోపిస్తున్నారు.
క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై జేసీకి ఫిర్యాదు
ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణంలో దాదాపుగా రూ.30 లక్షలు చొప్పున ఒక్క మన జిల్లాలోనే సుమారు రూ.4.80 కోట్ల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు జిల్లాలోని పలువురు రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో నిర్మించిన ఒక్కో అన్న క్యాంటీన్‌లో రూ.30 లక్షల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్లు ఇటీవల పాలకొల్లుకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల నిర్మాణానికి రూ.12 లక్షలకు మించి అవ్వదని, అయినా ఒక్కో దానికి రూ.42 లక్షలు ఖర్చు చూపి దోచుకున్నారనేది వీరి ప్రధాన ఆరోపణ.
పైగా అన్నక్యాంటీన్లు నిర్మించిన స్థలం కూడా ఆయా స్థానిక సంస్థలకు చెందిన స్థలం కావడంతో కేవలం భవన నిర్మాణానికే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఒక్కో అన్న క్యాంటీన్‌ను 756 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుయాయులకు భారీగా ముట్ట చెప్పేందేకే అన్న క్యాంటీన్లను ఆదాయ వనరులుగా వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం విచారణ చేపట్టాలి
అన్న క్యాంటీన్ల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను నిర్మించి రూ.62 కోట్ల మేరకు అవినీతికి పాల్పడింది. ఆఖరుకి పేదలకు భోజనం పెట్టే ఇటువంటి పథకంలోనూ గత పాలకులు తమ ధన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో అడుగుకి రూ.5,532 ఏ లెక్కన ఇచ్చారో వారికే తెలియాలి. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల నిర్మాణంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి.
– యడ్ల తాతాజీ, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్
ప్రజాధనం దుర్వినియోగం
అన్న క్యాంటీన్ల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసింది. పైకి పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్నామంటూ గొప్పగా ప్రచారం నిర్వహించింది. తీరా చూస్తే వాటి నిర్మాణంలో పచ్చచొక్కాల నేతలు తమ చేతి వాటం ప్రదర్శించారు. అన్నక్యాంటీన్ల పేరుతో ఎన్నికల్లో ఆయాచిత లబ్ధి పొందాలని చూసి బోర్లాపడ్డారు. తమ నాయకుల జేబులు నింపేందుకే వీటిని సాధనాలుగా వాడుకున్నారు.
– పళ్ళెం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ
Comments
Please login to add a commentAdd a comment