సాక్షి, అమరావతి: రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేయడంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆ వ్యయానికి చెందిన లెక్కలను కూడా సక్రమంగా చెప్పడం లేదు. వీటిని నీతి ఆయోగ్ బయ టపెట్టింది. లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయ ని, వాటికి వివరణ ఇస్తేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులకు వాస్తవ లెక్కలతో పాటు చేపట్టిన పనుల్లో వ్యత్యాసాలపై వివరణ ఇవ్వాలని నీతి ఆయోగ్ డైరెక్టర్ జె. కిశోర్ శర్మ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్‌కు లేఖ రాశారు. కేంద్ర నిధుల్లో ఇంకా రూ. 279.92 కోట్లకు వినియోగ పత్రాలను పంపించాలని స్పష్టం చేశారు.
విశాఖ జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన పనుల సంఖ్య తొలుత చెప్పిన దానికి ఆ తరువాత చెప్పిన దానికంటే ఎందుకు తగ్గాయని ఆ లేఖలో నీతి ఆయోగ్ ప్రశ్నించింది. ఈ ఏడాది జనవరిలో వైఎస్సార్ జిల్లాలో 1,257 పనులు పూర్తయినట్లు నివేదిక పంపారని, గత నెలలో పంపిన నివేదికలో పూర్తయిన పనులు 394 మాత్రమేనన్నారని ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో చెప్పాలంది. అలాగే విశాఖ జిల్లాలో కూడా పనులు ఎందుకు తగ్గిపోయాయని నిలదీసింది. చిత్తూరు జిల్లాకు రూ. 101.93 కోట్లను విడుదల చేస్తే కేవలం రూ. 51.31 కోట్లే వినియోగించడానికి, లెక్కల వ్యత్యాసాలకు కారణాలు ఏమిటో వివరణ ఇవ్వాలని, అప్పుడే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 350 కోట్లు విడుదలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని నీతి ఆయోగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ జిల్లాలకు గత మూడేళ్ల కాలంలో మంజూరు చేసిన పనుల్లో సగం కూడా పూర్తి చేయక పోవడం గమనార్హం.
వెనుకబడిన జిల్లాలంటే నిర్లక్ష్యమా?
Published Fri, Aug 11 2017 1:07 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM
Advertisement