
‘బంగారం’పై లేనట్టే
సాక్షి, ఏలూరు : నవ్యాంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయూలు జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేశాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సుమారు 7గంటలపాటు ఏకబిగిన సాగిన సమావేశంలో జిల్లా ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలపై ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్త్రీ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ద్వారకాతిరుమలలోని శ్రీవెంకటేశ్వర దేవ స్థానంలో నిత్యాన్నదానం పథకం కొనసాగింపు మినహా జిల్లాకు ఒక్క వరం కూడా లభించలేదు.
రాష్ట్రంలో 7 దేవాలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించగా, వాటిలో చిన్నతిరుపతి కూడా ఉంది. మంత్రివర్గ సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగింది. వాటిలో ప్రధానాంశం వ్యవసాయ రుణాల మాఫీ. దీనిపై కేవలం కమిటీ వేయూలని మాత్రమే నిర్ణయించడంతో జిల్లా రైతుల గుండెల్లో పిడుగుపడ్డట్టయ్యింది. రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. ఇలా కమిటీలు, నివేదికలని కాలయాపన చేస్తే ఖరీఫ్ రుణాలు ఎప్పుడు ఇస్తారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయూల్సిన అవసరం లేదని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు కావాలనే వారితో కేబినెట్ సమావేశంలో ఆ విధంగా మాట్లాడించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు చెల్లించవద్దని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాట తప్పేందుకే ఇలా చేయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయానికి 7గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వగలమని, 9గంటలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పడం ద్వారా ఇప్పట్లో ఆ హామీ నెరవేరే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించటం ద్వారా ప్రజలకిచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం లేదని తేల్చిచెప్పినట్టయియంది.