జలయజ్ఞానికి టీడీపీ విఘ్నాలు.. | TDP Government Not Completed The Projects In Addanki Constituency | Sakshi
Sakshi News home page

జలయజ్ఞానికి టీడీపీ విఘ్నాలు..

Published Sat, Mar 16 2019 2:14 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

TDP Government Not Completed The Projects In Addanki Constituency  - Sakshi

అసంపూర్తిగా యర్రం చినపోలిరెడ్డి పథకం

ఇది నీటి కథ.. కన్నీటి కథ. ప్రజల కన్నీళ్లు తుడవడానికి నడుం బిగించిన మహా నాయకుడు కన్ను మూశాక, కసాయి పాలకుల ఏలుబడిలో అటకెక్కిన ఆనకట్టలు కథ. 5 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలు పడుతున్న వ్యథ. పొట్ట చేతబట్టుకుని ప్రజలు వలసపోకూడదని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు రైతు బాంధవుడు రాజశేఖరరెడ్డి. ఆయన మరణం రైతులకు తీరని శాపమే అయ్యింది. తర్వాత వచ్చిన పాలకులే ‘‘పచ్చ’’పాతం చూపిస్తుంటే కాలువల్లో పారాల్సిన నీళ్లు రైతుల కళ్లల్లో పారుతున్నాయి. జలదాత రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞాన్ని టీడీపీ నాయకులు విఘ్నాలు కలిగిస్తు ప్రజలకు సాగు, తాగు నీరు అందకుండా అడ్డుపడుతున్నారు. నీటి కష్టాలు తీరాలంటే ఆ పెద్దాయన బిడ్డ పాలన రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగనన్నతో రాజన్న పాలన చూడాలని ఆశ పడుతున్నారు.

సాక్షి, అద్దంకి (ప్రకాశం): వర్షాధార భూములను ఆరుతడి, మాగాణి భూములుగా మార్చడం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా నియోజకవర్గంలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో భవనాశి మినీ రిజర్వాయర్, యర్రం చిన్నపోలిరెడ్డి  పథకాన్ని చేపట్టారు. మిగిలిన మండలాల్లో ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో 25వేల ఎకరాల మెట్ట భూములను మాగాణి, ఆరుతడి పంట పండే భూములుగా చేయాలనేదే రాజశేఖర్‌రెడ్డి సంకల్పం. ఆయన అకాలం మరణం తరువాత గద్దెనెక్కిన అధికార టీడీపీ ఆ ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కడ రాజశేఖర్‌రెడ్డికి పేరు వస్తుందని భయంతో ప్రాజెక్టులను వదిలేసింది. పాదయాత్ర సమయంలో అద్దంకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని తమ ఓటుతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ముందుకు సాగని భవనాశి..
శింగరకొండ క్షేత్ర సమీపంలోని భవనాశి చెరువును విస్తరింపజేసి, బల్లికురవ మండలంలోని వెలమావారిపాలెం వద్ద గుండ్లకమ్మ నదికి అడ్డంగా చెక్‌ డ్యాం ఏర్పాటుతో, నీటిని కాలువ ద్వారా చెరువులకు నీరు మళ్లించి మినీ రిజర్వాయర్‌ చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ప్రస్తుతం ఉన్న 1797 ఎకరాల సాగు భూమితో పాటు, మరో 5 వేల ఎకరాల భూములను మాగాణి భూమూలుగా మారి రైతులు ఆర్థికంగా బలపడతారని సంకల్పించారు. రూ.27 కోట్ల నిధుల కేటాయింపుతో 2009లో మినీ రిజర్వాయరు పనులకు శంకుస్థాపన చేశారు. 2013లో పనులు ప్రారంభయమ్యాయి. ఆయన హఠన్మరణం తరువాత పరిణామాలు, 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో, ప్రాజెక్టుల పనులు పూర్తికాలేదు.ఏడాదికేడాది పనులు పూర్తి కాకపోవడంతో, ఇదే చెరువును సోర్స్‌గా చేసుకుని నిర్మించిన తారకరామ ఎత్తిపోతల పథకం మూలనపడింది. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తేనే  ప్రాజక్టులు పూర్తి చేస్తారని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు.

ఎత్తిపోతల పథకాలు వదిలేశారు..
బల్లికురవ: మండల పరిధిలోని నక్కబొక్కలపాడు గ్రామం పేరుకు సాగరు ఆయకట్టులో ఉన్న చివర భూములు కావడంతో ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదు. 2008లో డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కృషితో నక్కబొక్కలపాడు వాగు నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు రూ.7 కోట్లు నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే 90శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. తదనంతరం వచ్చిన టీడీపీ 10 శాతం పూర్తిచేకుండా ఐదేళ్లు పాలన పూర్తి చేసింది. ఈర్ల చెరువును 2009లో రిజర్వాయరుగా మార్చేందుకు రూ.50లక్షలు మంజూరు చేశారు. పనులు మాత్రం ముందుకు సాగలేదు.

చినపోలిరెడ్డి పథకంలో నిర్లక్ష్యం..
మేదరమెట్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిలోకి రాగానే కొరిశపాడు మండలంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని రూ.177 కోట్ల వ్యయంతో 2004వ సంవత్సరంలో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.ఈ రిజర్వాయర్‌ 2008వ సంవత్సరాలనికి పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ పథకం పూర్తి చేసుకుంటే మండలంలోని పలు గ్రామాలకు సుమారు 20 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందిచే అవకాశం ఉంది. ఆయన అకాల మరణంతో పనులు నిలిపేశారు. వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచిన స్థానిక శాసనసభ్యుడు అధికార పార్టీలోకి వెళ్లడంతో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ముంపుకు గురవుతున్న తూర్పుపాలెం గ్రామానికి గానీముంపుకు గురైన  వ్యవసాయ భూములకు గానీ ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు.ఈ గ్రామంలో కేవలం రెడ్డి సామాజిక వర్గం వారు అధికంగా ఉండటంతో ఇక్కడ ఎలాంటి పరిహారం అందించలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒంగోలు మాజీ ఎంపీ వైవీసుబ్బారెడ్డి తండ్రి పేరుతో పథకం నిర్మాణం ఉండటం వల్లనే అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.

రావమ్మకుంట పూర్తయితే పచ్చని పొలాలు
జే పంగులూరు: మండల పరిధిలోని 21 గ్రామాల్లో భూమి వర్షాధారంతో పండే మెట్ట భూమి. అలవలపాడులోని రావమ్మకుంటకు, కొండమూరు చెరువుకు పమిడిపాడు మేజరు నుంచి నీరు వచ్చేది. ఐదు సంవత్సరాలుగా మేజరుకు నీరు సక్రమంగా అందకపోవడంతో, చెరువులు వట్టిబోయాయి. చెరువులను రిజర్వాయర్లుగా మారిస్తే తిరిగి పూర్వ వైభవంతో మాగాణి పంట పండించుకుంటామని ప్రజా ప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంగులూరు మండలం మాగాణి, మెట్ట పంటలతో భూములు పచ్చాగా కళకళలాడాలంటే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు.

భవనాశి పూర్తయితే భూములు సస్యశ్యామలం
భవనాశి మినీ రిజర్వాయరు పూర్తయితే వేలాది ఎకరాల భూములకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తయితే రాజశేఖరరెడ్డికి పేరొస్తుందని టీడీపీ నాయకులే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలు ఉపయోగపడే పథకాలపై ఇలా నిర్లక్ష్యం వహించడం టీడీపీ తగదు. ప్రాజెక్ట్‌ పూర్తి కావాలంటే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాల్సిందే.
- యర్రా అంజయ్య, గోవాడ

జగనన్నను సీఎం చేస్తాం, జలాన్ని తెచ్చుకుంటాం
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించుకుని జగనన్నను సీఎం చేసుకుంటాం. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసుకుని సాగుకు, తాగుకు నీటిని తెప్పించుకుంటాం. జలదాత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలు పూర్తి కావాలంటే వైఎస్సార్‌ సీపీ గెలవాల్సిందే.
- చల్లగుండ్ల శ్రీనివాసరావు, నక్కబొక్కలపాడు

పథకాన్ని నిర్వీర్యం చేశారు
మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్లైనా పూర్తి చేయలేదు.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకం కాబట్టి పథకం పూర్తి చేస్తే ఆయనకు పేరు వస్తుందని పట్టించుకోలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలకు ఏలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఇంత వరకు ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించలేదు.
- లేళ్ల సుబ్బారెడ్డి, తూర్పుపాలెం, మేదరమెట్ల

రావమ్మ కుంట పూర్తయితే వెయ్యి ఎకరాలకు నీరు
పంగులూరు పరిధిలో మెట్ట భూములు ఎక్కువ, రావమ్మ కుంట చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే వెయ్యి ఎకరాలు సాగు భూమిగా మారుతుంది. తాగునీటికి కూడా ఇబ్బందులు తొలుగుతాయి. పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్‌స్రాŠ సీపీ అధికారంలోకి వస్తే మా సమస్య తీరుతుందని నమ్ముతున్నాం.
- శేఖర్‌బాబు, పంగులూరు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

బీళ్లుగా మారిన పంగులూరు భూములు

2
2/3

విస్తరించాల్సిన భవనాశి చెరువు

3
3/3

నిలిచిన ఎత్తిపోతల పథకం నిర్మాణపు పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement