సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాతపట్నంలోని కిమిడి-కళింగ రోడ్డు నుంచి శాఖా గ్రంథాలయం పక్క నుంచి హౌసింగ్ బోర్డుకాలనీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నెలరోజుల క్రితం ఓ సీసీ రోడ్డు వేశారు. ఈ వీధిలో పట్టుమని పది ఇళ్లు కూడా లేవు. అక్కడ ఓ టీడీపీ నేత భారీ భవంతి ఉంది. ఆ ఇంట్లో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం కూడా నడుస్తోంది. పాతపట్నం మేజర్ పంచాయతీలో సుమారు 50 రోడ్లు ఉన్నాయి. వీటిలో 30 రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వీటి బాగు పట్టని ఇంజినీరింగ్ అధికారులు పార్టీ కార్యాలయం ఉన్న వీధిపై అవ్యాజమైన ప్రేమ చూపడంపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్ విభాగం నుంచి సుమారు రూ.7లక్షలు మంజూరు చేసి ఈ రోడ్డు వేశారని తెలిసింది. అయితే తమకేమీ తెలియదని, ఊర్లో చాలా ప్రాంతాల్లో రోడ్లు మంజూరయ్యాయని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇక్కడ రోడ్డు వేశామని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. సుమారు 60 మీటర్ల సీసీ రోడ్డు పనులు పూర్తి కాగా మరో 90మీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఎస్టీలు లేని ఊర్లో ఎస్టీ గ్రాంట్లు
ఇదిలా ఉంటే గ్రామంలో రోడ్ల పనుల నిమిత్తం ఐటీడీఏలోని ఎస్టీ గ్రాంట్ల నిధుల నుంచి సొమ్ము ఖర్చుచేసినట్టు తెలిసింది. అసలు ఎస్టీలే లేని ఆ ప్రాంతంలో ఎస్టీ నిధులు ఎలా వినియోగిస్తారన్నది మరో ప్రశ్న. ఓ ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పేరిట రోడ్డు వేయడం ఓ ఎత్తయితే ఇదేమీ తమకు తెలియదని, ఈ రోడ్డు కోసం తామేమీ నిధులు ఖర్చుచేయలేదని ఇంజినీర్లు చెబుతుండడం మరో ఎత్తు. ఆ ప్రాంతం పూర్తిగా థ్వంసం కావడంతో రోడ్డు వేశామని చెబుతున్నా గ్రామంలో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మరివాటి మాటేమిటో అధికారులే చెప్పాలి.
అధికారులే దగ్గరుండి వేయించారు
టీడీపీ కార్యాలయానికి అనుబంధంగా అధికారులే దగ్గరుండి సీసీ రోడ్డు పనులు చేయించారు. పంచాయతీకి సంబంధించి నిధులేవీ ఖర్చుచేయలేదు. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వేయాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. పాతపట్నం పరిధిలో చాలా రోడ్లకు డ్రైనేజీ సౌకర్యం లేదు. అలాంటప్పుడు ఏ విభాగం నుంచి నిధులు ఖర్చుచేశారన్నది అంతులేని ప్రశ్నగా మిగిలిపోతోంది. మహిళా సమాఖ్య భవనం నుంచి అనుబంధ(అప్రోచ్) రోడ్డుకు, ఇతర రోడ్లకు సంబంధించి వాస్తవానికి ఎక్కడ రోడ్డు పనులు మంజూరయ్యాయన్నది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదే విషయమై ఐటీడీఏ ఏఈ సింహాచలాన్ని వివరణ కోరగా రోడ్డు పనులు మంజూరు కావడం వాస్తవమేనని, అయితే టీడీపీ కార్యాలయానికి తామే రోడ్లు వేయించామన్నది అవాస్తవమన్నారు.
ఖర్చెవరిది?
గ్రామంలో రోడ్లు వేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ మిగతా రోడ్లపై లేని ప్రేమ టీడీపీ కార్యాలయంపైనే ఎందుకుందన్నది అనుమానం. ఎస్టీ గ్రాంట్ల నుంచి నిధుల్ని ఎస్టీలు లేని ప్రాంతంలో ఎలా ఖర్చుచేశారు. పోనీ అక్కడ వేసిన సీసీ రోడ్డుకు ఎవరు నిధులు మంజూరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయన్నది తక్షణమే వెల్లడించాలి.
- కలమట వెంకటరమణ మూర్తి,
ఎమ్మెల్యే, పాతపట్నం.
అధికార దుర్వినియోగం
Published Thu, May 14 2015 1:04 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement