ఆరు నెలలు... హామీలు పొల్లు!
ఎన్నికల ముందు
పేద జిల్లా అయిన విజయనగరానికి ప్రత్యేక నిధులిస్తాను.
తోటపల్లితో పాటు తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాను.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను.
జూట్ పరిశ్రమల సంఖ్య పెంచుతాను.
ఆసియాలోనే అతిపెద్దదైన గరివిడి ఫేకర్ లాకౌట్‌కు నాటి మంత్రి బొత్స కారణమని, అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపిస్తాను.
ఇవన్నీ ఎన్నికలకు ముందు విజ యనగరం అయోధ్య మైదానంలో ఫిబ్రవరి 26న నిర్వహించిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు ఇచ్చిన హామీలు
ఎన్నికల తరువాత...
విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తాను.
వైద్య, ఆరోగ్యానికి బాసటగా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తాను.
జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఫుడ్‌పార్క్ నెలకొల్పుతాను.
పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతాను.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తాను.
లలిత కళలకు ఊపిరిపోసేలా విజయనగరంలో లలిత కళల అకాడమీని ఏర్పాటు చేస్తాను.
జిల్లాలో ఎక్కడో ఒక చోట హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తాను.
తీర ప్రాంతంలో నౌకాశ్రయాన్ని నిర్మిస్తాను.
ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాను.
ఇవన్నీ ముఖ్యమంత్రి అయ్యాక సెప్టెంబర్ 4న శాసనసభలో చంద్రబాబు ప్రకటించిన జిల్లా అభివృద్ధి ప్రణాళిక
(హామీలను) అంశాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అటు ఎన్నికలకు ముందు, ఇటు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. చంద్రబాబు అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. అయినా హామీలు అలాగే ఉండిపోయాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏదో చేసేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు గాని, ఆ పార్టీ నేతలకు గాని ఇవేవీ గుర్తుకు రానట్టుంది. చంద్రబాబు జిల్లాకు మేలు చేయకపోగా ప్రకటించిన హామీల విషయంలో మాట మార్చి మడం తిప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల బదులు ప్రైవేటు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అనుకూలమైన స్థలం లేదని, అందుకే గిరిజన యూనివర్సిటీ తరలిపోతోందని తప్పించుకున్నారు. జూట్ పరిశ్రమల సంఖ్యను పెంచుతామని చెప్పిన చంద్రబాబు మూతపడిన జూట్ పరిశ్రమల్ని తెరిపించేందుకు కనీస చొరవ చూపడం లేదు.
గరివిడి ఫేకర్ మూత పడేందుకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ ఆరోపించి ఎన్నికల్లో లబ్ధిపొందిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఆ పరిశ్రమ తెరిచేందుకు చర్యలు తీసుకోలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని విజయనగరం నడిబొడ్డున ఉన్న అయోధ్య మైదానంలో గొప్పగా ప్రకటించారు. ఇప్పుడా ఊసే లేదు. ఇంతకంటే దారుణమేంటంటే విజయనగరం అమ్మలాంటి దని, పేద జిల్లాగా ఉండిపోయిందని, జిల్లాకు ప్రత్యేక నిధులు ఇస్తానని ప్రజాగర్జనలో ప్రకటించారు. ఇప్పుడేమో ఆ ప్రకటనను మరిచిపోయారు. ఏడాదిలోపే తోటపల్లితో పాటు తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. కానీ బడ్జెట్‌లో కనీస నిధులు కేటాయించలేదు. ఇప్పుడా ప్రాజెక్టులు పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్ పట్టుభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాకు ఎలక్ట్రికల్స్ హార్డ్‌వేర్ పార్కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
కానీ ఇంతవరకూ అతీగతి లేదు. కళారంగానికి ఊపిరి పోస్తానని, లలిత కళల అకాడమీని కేటాయిస్తూ ప్రకటన చేశారు. అయితే, అకాడమీ పక్కనపెడితే, ప్రస్తుతమున్న సంగీత కళాశాల ఆలనా పాలనా చూసేందుకు చొరవ చూపలేదు. జిల్లాను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతానంటూ శాసన సభలో వెల్లడించారు. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. జిల్లాలో మామిడి, అరటి, జీడి, బొప్పాయి ఉత్పత్తులకు చెందిన విభిన్న రకాల పరిశ్రమలు తీసుకొచ్చేలా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి బాట వేస్తామన్నారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని, జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. కానీ ప్రతిపాది జాబితాల్లో జిల్లాకు చోటే లేకుండా పోయింది. ఈ హామీలు నెరవేరకపోవడమే కాకుండా, ఈ ఆరు నెలల కాలంలో జిల్లా ఒరిగిందేమీ లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.