పార్వతీపురం సభలో బురద నీళ్ల బాటిల్ చూపిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్
కురుపాం : గిరిజన సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా కురుపాం రావాడ కూడలిలో గురువారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విద్య, వైద్యం, తాగునీరు, రహదార్లు లేక గిరిజనం నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయకుండా నవనిర్మాణ దీక్ష, అమరావతి అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఈ సర్కారు పట్టించుకోకపోవడంతో గిరిజనులు, యువత, కార్మికులు పూర్తిగా నష్ట పోయారని చెప్పారు. జనసేన కార్యకర్తలు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు గుర్తిస్తే వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇచ్చారు.
ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తారు
పార్వతీపురం: ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని వృథా ఖర్చులకు వాడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం పార్వతీపురం పాతబస్టాండ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ, స్టార్ హోటల్స్‌లో గడపడానికి, మహానాడు, నవ నిర్మాణ దీక్ష, ధర్మ పోరాట దీక్షలకు ఖర్చు చేసేందుకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారని విమర్శించారు.
ప్రజా ధనాన్ని సొంత ఖర్చులకు వాడుకోవడం దారుణమన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా బురద నీళ్లనే మంచినీళ్లుగా ఇళ్లకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో రోడ్లు చూస్తుంటే భయమేస్తుందని వ్యాఖ్యానించారు. ఏడేళ్ల కాలంలో పూర్తైన ఆర్‌వోబీ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదన్నారు. ఉత్తరాంధ్రలో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉత్తరాంధ్రలో ఉద్యమం పుట్టుకువస్తుందన్నారు. 2019లో జనసేన అధికారంలో వస్తే ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని, పాలన కేవలం విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లోనే కేంద్రీకరించారని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువ ధరకు కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అది జరగనివ్వమని పేర్కొన్నారు.
36 సార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి
బొబ్బిలి: ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలనీ, ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటూ మూడున్నరేళ్లలో 36 సార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గురువారం సాయంత్రం బొబ్బిలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మళ్లీ తనకు మద్దతు ఇవ్వాలంటూ అడుగుతున్నారని, తాను ఎంతమాత్రం ఒప్పుకోనని పేర్కొన్నారు.
బొబ్బిలిలో యువతకు ఉద్యోగాల్లేవనీ, జూట్ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేవలం అమరావతికే పరిమితమయ్యారని, మిగిలిన ప్రాంతాలను విడిచిపెట్టారని ఎద్దేవా చేశారు. చెరుకు రైతులకు బకాయిలు ఉంటే కంపెనీని ప్రశ్నించడం లేదని, కొత్త సాఫ్ట్‌వేర్‌తో అంగన్‌వాడీలను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు వారికి మద్దతు ఇచ్చినందుకు క్షమించాలని పవన్ అంగన్‌వాడీలను కోరారు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్ స్థానికుల ఉద్యోగాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికా లేక స్థానికేతరులు భూ కబ్జా చేయడానికా అని ప్రశ్నించారు. ఎంపీ అశోక్‌కు తాను ప్రచారం చేసిన విషయం గుర్తుంటుంది కానీ ఇప్పుడు గుర్తులేనని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించారు. రాష్ట్రంలో రోడ్లు మీ తాతముత్తాతలు వేయించారా..? లేక హెరిటేజ్ సొమ్ముతో వేశారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment