పెంచుతామన్నారు...ఉన్నది ఊడగొట్టారు | pensions cancelled by TDP govt | Sakshi
Sakshi News home page

పెంచుతామన్నారు...ఉన్నది ఊడగొట్టారు

Published Fri, Oct 10 2014 1:34 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

పెంచుతామన్నారు...ఉన్నది ఊడగొట్టారు - Sakshi

పెంచుతామన్నారు...ఉన్నది ఊడగొట్టారు

ఇటీవల నిర్వహించిన సర్వే అనంతరం వయస్సు తక్కువగా ఉందని కొందరికి, సెంటు భూమి లేకపోయినా ఐదు ఎకరాలపైనే స్థలం ఉందని మరికొందరికి, ఎప్పుడో పుష్కరకాలం కిందట చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని వితంతువులకు పింఛ న్ నిలిపివేశారు. దీంతో పలువురు వీధిన పడ్డారు. ఇంతవరకూ అందుతున్న పింఛన్‌తో జీవితాలను నెట్టుకొస్తున్న వారి  గుండెల్లో వేదన గూడుకట్టుకుంది. పింఛన్‌సొమ్ము పెంపు పేరుతో తమను వంచించారని వాపోతున్నారు. చిన్నపాటిఆధారాన్ని లాగేసుకోవద్దని, పింఛన్‌ను పునరుద్ధరించాలని జన్మభూమి సభల్లో కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ వారికి భరోసా ఇవ్వడం లేదు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  జిల్లాలో ఎక్కడ చూసినా అభాగ్యుల కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి.   జన్మభూమి కార్యక్రమాలు వారి వేడుకోలు, దీనగాథలతో నిండిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా అటు అధికారులు గాని, ఇటు ప్రజాప్రతినిధులు గాని చలించడం లేదు. కనీస స్థాయిలో దయాదాక్షిణ్యాలు చూపడం లేదు. రాజకీయ కక్ష సాధింపులో అభాగ్యులు బలి పశువు లైపోతున్నారు. సర్వేకు ముందు జిల్లాలో  36,624 మంది వికలాంగులు, 84,410 మంది వితంతువులు, 1,29,512 మంది వృద్ధులు, 816 మంది కల్లుగీత కార్మికులు, 2,576 మంది చేనేత కార్మికులు పింఛన్లు పొందేవారు. వివిధ కారణలు చూపి 32 వేల మంది పింఛన్లు నిలిపివేశారు. అలాగే ఆధార్‌కార్డులేదని 46వేల మందికి పింఛన్లు బట్వాడా చేయలేదు. దీంతో ఎలా బతకాలని నిస్సహాయులు విలపి  స్తున్నారు.  నేడో రేపో చావు వస్తుందనుకుంటున్న పండుటాకులకు కూడా నీ వయసు తక్కువ ఉందని అనర్హులుగా ప్రకటించడంతో ఎవరికి చెప్పుకోవాలో వారికి అర్థంకావడం లేదు.

 కుటుంబాన్ని పోషించే భర్త చనిపోవడంతో దిక్కులేక ఒంటరిగా బతుకుతున్న విత ంతువుల్ని  నీ భర్త డెత్ సర్టిఫికేట్ లేని కారణంగా  పింఛను ఇవ్వలేమంటే  ఆగని కన్నీళ్లతో వారు మూగగా రోదిస్తున్నారు.  అడుగు కదపాలంటే వీలు కాని వికలాంగులకు నీ పేరు తప్పు పడిందని, వైకల్యం సరిగా లేదని, కుటుంబంలో ఒకరికే పింఛను అని   మొ హం మీదే నిర్మొహమాటంగా చెబుతుండటంతో బతుకుబండి ఎలా సాగుతుందో తెలియక భవిష్యత్‌పై బెంగతో అలమటిస్తున్నారు.  పండుటాకులు, వికలాంగులు, వితంతువులు  మరొకరిపై ఆధారపడకుండా, చిన్నిచిన్ని ఖర్చులకు చేతిలో  సొమ్ముండాలనే ఉద్దేశంతో  అందజేస్తున్న పింఛన్‌ను నిబంధనల పేరుతో నిర్దాక్షిణ్యంగా ఇప్పటి నేతలు తొలగిస్తున్నారు. దీంతో పల్లెలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. జన్మభూమిలో తమ వద్దకొచ్చే అధికారులను నిలదీస్తున్నారు. బావురమంటూ తమ గోడును చెప్పుకుంటున్నారు. కానీ   నేతలు చెప్పినట్టు నడుచుకోవల్సి రావడంతో అధికారులు చేతులేత్తేస్తున్నారు. పింఛను బాధితుల మాదిరిగానే అధికారులు నిస్సహాయులగా మిగిలిపోతున్నారు.

 ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ధీన గాధ. కానీ, వీరి గోడును పట్టించుకున్న వారే కరువయ్యారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అధికారులు వినిపించుకోవడం లేదు. చివరకీ వీరి గాధను చూడలేక, వీరి గోడును మరిచిపోలేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఒక అడుగు ముందుకేసి   మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీన్నిబట్టి పింఛను లబ్ధిదారులకు జరిగిన నష్టమెంతో అర్థం చేసుకోవచ్చు.
 
 80 ఏళ్ల అవ్వకు పింఛను నిలిపివేత  
 అలజంగి(బొబ్బిలి రూరల్): ఆ అవ్వకు 80ఏళ్లు. నిబంధనల ప్రకారం ఆమెకు పింఛను ఇవ్వాలి. అయితే ఏడేళ్ల క్రితం ఇచ్చినరేషన్‌కార్డులో ఆ అవ్వకు 5ఏళ్లుగా వయసు నమోదయింది. దీంతో పింఛనుదారుల ఎంపిక కమిటీ సభ్యులు ఏడేళ్లక్రితంఇచ్చిన కార్డు ప్రకారం లెక్కకట్టి 2014నాటికి ఆమె వయసు 12సంవత్సరాలని నిర్ధారించారు. పింఛను లేదు పొమ్మన్నారు. దీంతో ఆమె విలపిస్తోంది. వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలంలో అలజంగి గ్రామానికి చెందిన రథాల సీతమ్మకు ఏడేళ్ల క్రితం కుటుంబసభ్యులతో డబ్ల్యుఏపీ 021000300243 నంబరు తో రేషన్‌కార్డు మంజూరు చేశారు. ఆ కార్డులో  ఆమెకు 5 సంవత్సరాల వయసుగా నమోదు చేశా రు. అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆమెకు సక్రమంగా నెలనెలావృద్ధాప్య పింఛన్ వస్తోంది. అయితే బొబ్బిలి ఎంపీడీఓ అరుంధతీదేవి పింఛన్ అర్హతకు  కేవలం రేషన్‌కార్డే ప్రాతిపదిక అని ప్రకటించడంతో రథాల సీతమ్మ వయసు రేషన్‌కార్డులో 5 ఏళ్లు అని, ఏడేళ్ల క్రితం ఇచ్చిన కార్డు కాబట్టి ప్రస్తుతం 12ఏళ్ల వయసని తేల్చి ఆమె పింఛను రద్దుచేశారు. ఈనెల 7న గ్రామంలో జన్మభూమి జరిగినా పింఛను తీసేసిన విషయం ఆమెకు తెలీదు. ఈనెల గురువారం గ్రామ సర్పంచ్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు డాక్టర్ బెవర సూర్యనారాయణ పింఛన్ల జాబితా చూసి అవాక్కయ్యారు. కమిటీలో టీడీపీ నాయకులు వెనుకనుండి నడిపించారని, కమిటీలో తాను ఉన్నప్పటికీ జాబితాలు చూపలేదని సర్పంచ్ బెవర సూర్యనారాయణ సాక్షికి తెలిపారు. కాగా తనకు 12ఏళ్లు వయసేంటని రథాల సీతమ్మ ఆవేదన చెందుతూ తనకు అన్ని అర్హతలు ఉన్నాయని పింఛను ఇప్పించాలని కోరుతోంది.  
 
 చావే గతి....          
 నా పేరు చింతాడ పోలమ్మ, మాది మక్కువ మండలం చెముడు గ్రామం.  నావయస్సు రేషన్‌కార్డులో 70 సంవత్సరాలు ఉంది. వాస్తవానికైతే  77సంవత్సరాలు.  కాని ఆధార్‌కార్డులో 19 సంవత్సరాలుగా నమోదైంది. దీంతో   పింఛను తొలగించారు. నాకు సెంటు భూమి లేదు. నా అన్నవారే లేరు.   పింఛను డబ్బులతో బతుకుతున్నాను.  నాకు రెండు కళ్లూ సక్రమంగా కనిపించవు. పింఛను తొలగిస్తే బతికే ఆధారం లేదు.   చచ్చిపోవడం తప్పా నాకు వేరే మార్గంలేదు.
 
 మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఎక్కడ తెచ్చేది
 ఈమె పేరు పాండ్రంకి సింహాచలం. మెంటాడకు చెందిన  ఈమె భర్త అచ్చింనాయుడు 15 ఏళ్ల క్రితం మృతి చెందారు. దీంతో వితంతువు పింఛను  మంజూరు చేశారు. భర్త అచ్చింనాయుడు  మరణ ధ్రువీకరణ పత్రం లేదన్న  నెపంతో పింఛన్‌ను రద్దు చేశారని, ఇప్పుడు ఆ పత్రాన్ని ఎక్కడ తేవాలని ఆమె ఆవేదన చెందుతోంది.  
 
 ఇద్దరికీ తొలగింపు
 సాలూరు మున్సిపాలిటీలో 8వవార్డుకు చెందిన పాలేపు అప్పారావు, పెంటమ్మ అనే ఈ వృద్ధ దంపతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఇన్నాళ్లూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఇద్దరికీ అందుతున్న  వృద్ధాప్య పింఛన్లను ఇప్పుడు నిలిపివేశారు. ఒకే ఇంటిలో ఇద్దరికి పించన్లు ఇవ్వకూడదని పెంటమ్మ పింఛన్‌ను వార్డు కమిటీ తొలగించగా, భర్త అప్పారావుకు రేషన్ కార్డులో వయసు తక్కువగా ఉందన్న కారణంగా అతని పేరును అధికారులు తీసివేశారు. దీంతో ఏ ఒక్కరికీ పింఛన్ అందకపోవడంతో ఆ వృద్ధ దంపతులు  తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. అప్పారావుకు 66సంవత్సరాలుగా గతంలో పింఛన్ కార్డులో నమోదు చేసివుండడం గమనార్హం. అయితే రేషన్ కార్డు జారీనాటికి 51 సంవత్సరాలుగా నమోదైందన్న సాకుతో అధికారులు పింఛన్‌ను నిలిపివేశారు. పెంటమ్మ పిం ఛన్ తొలగింపునకు ఎలాంటి కారణాన్ని  చూపడంలేదు.  దీంతో ఆ వృద్ధదంపతులు   తమకు పింఛన్ ఇప్పించాలని అధికారులు, నాయకులను కలుస్తూ  వేడుకుంటున్నారు.
 
 సెంటు భూమి లేకున్నా...
 ఈయన పేరు బగ్గాం జగన్నాథరావు(70). మెంటాడకు చెందిన  ఈయనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వృద్ధ్యాప్యం పింఛను  మంజూ రు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సర్వే సాకు తో పింఛను రద్దు చేసింది. ఐదు ఎకరాల భూమి ఉందని చెప్పి రద్దు చేశారు. ఎప్పుడో ఉమ్మడి కుటుంబంలో ఆయన  పేరున ఐదు ఎకరాల భూమి ఉండేదని, ఆ భూమిని ఎప్పుడో అమ్మేశామని, ప్రస్తుతం సెంటు భూమి కూడా లేదని జగన్నాథరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తనకు పింఛన్‌ను పునరుద్ధరించాలని వేడుకుంటున్నాడు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement