
ప్చ్..!
నగరపాలక సంస్థలో అసంతృప్తి సెగలు బుసలు కొడుతున్నాయి. ‘మీరు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు.
టీడీపీ గ్రూపు రాజకీయాలతో తలనొప్పి
సీఎం క్లాస్‌తో మున్సిపల్ కమిషనర్ మనస్తాపం
బదిలీపై వెళ్లే యోచన
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అసంతృప్తి సెగలు బుసలు కొడుతున్నాయి. ‘మీరు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. హుషారుగా పనిచేయించాలి, అభివృద్ధి పరవళ్లు తొక్కాలి. ఇక్కడ అలాంటి వాతావరణం కనిపించడం లేదు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు క్లాస్ తీశారు. కమిషనర్ పనితీరు బాగోలేదని టీడీపీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదుచేసిన మేరకే సీఎం ఇలా మాట్లాడారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో కమిషనర్ వీరపాండియన్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నారనిప్రచారం సాగుతోంది.
బలవుతున్న అధికారులు
టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటతో అధికారులు నలిగి పోతున్నారు. మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థపై పట్టుకోసం పంతాలకు పోతున్నారు. దీంతో ఎవరు చెబితే పనిచేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. చందంగా పరిస్థితి తయారవ్వడంతో కమిషనర్ ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ-ఆఫీస్‌పై ఉద్యోగుల్లో పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో కొంత ఇబ్బందిగా మారింది. సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీల సమీక్షలు, రాజధాని నేపథ్యంలో విదేశీ పర్యటనలతో కాలం గిర్రున తిరుగుతోంది. కమిషనర్ కుర్చీలో కూర్చుని పనిచేసేందుకు తీరిక దొరకని పరిస్థితి ఏర్పడింది.
సి‘ఫార్సులు’
ఎన్టీఆర్ పార్కింగ్ సెల్లార్ లీజు బకాయిల విషయంలో కమిషనర్ తీవ్రంగా స్పందించారు. రూ.45 లక్షలకు గానూ రూ.16 లక్షలు మాత్రమే చెల్లించిన ఓ టీడీపీ నేత బినామీ పేరుతో సెల్లార్‌ను లీజుకు తీసుకున్నారు. ఇచ్చిన ఏడు చెక్కులు బౌన్స్ కావడంతో పార్కింగ్ సెల్లార్‌ను స్వాధీనం చేసుకుని ఎస్టేట్స్ అధికారులు క్రిమినల్ కేసు పెట్టారు. తిరిగి సెల్లార్‌ను అప్పగించాల్సిందిగా ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన సిఫార్సుల్ని కమిషనర్ పక్కన పడేశారు. దీంతో అలిగిన ఎమ్మెల్యే జిల్లా ఇన్‌చార్జి మంత్రికి కమిషనర్ బాగా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
నగరంలోని 17 పుష్కర మరుగుదొడ్లను రూ.10.33 లక్షలకు లీజుకు ఇచ్చేందుకు స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. నగరంలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే స్టాండింగ్ కమిటీ అంత తక్కువ మొత్తానికి లీజు ఖరారు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫైల్‌పై కమిషనర్ సంతకం చేయకుండా పక్కన పెట్టారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినా లీజును ఎందుకు ఆమోదించ లేదంటూ టీడీపీ పాలకులు ఒత్తిళ్లకు దిగుతున్నట్లు భోగట్టా.
టీడీపీలోని అంతర్గత కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మేయర్ ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్‌కు ఫోన్‌చేసి ఫలానా పనులు చేయాలంటూ సూచిస్తున్నారు. మేయర్ ప్రతిపాదనలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయాల్సి రావడంతో కమిషనర్ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.