నంద్యాలలో ‘దేశం’ దౌర్జన్యకాండ
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కౌన్సిలర్ హనీఫ్ కిడ్నాప్
నంద్యాల: ఓటమి భయంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు నంద్యాలలో దౌర్జన్యకాండకు దిగుతున్నారు. కిడ్నాప్‌లకు సైతం తెగపడుతున్నారు. నంద్యాల 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఎస్‌కే హనీఫ్ ఆదివారం టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే కౌన్సిలర్‌ను టీడీపీకి చెందినవారు బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్‌కు పాల్పడ్డారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. హనీఫ్ కిడ్నాప్ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం రాత్రి కౌన్సిలర్ ఇంటివద్ద ధర్నాకు దిగారు. కిడ్నాప్‌నకు గురైన హనీఫ్‌ను చూపించాలంటూ నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, కమలాపురం, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు కౌన్సిలర్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ తిరిగి వచ్చేంతవరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చివరకు డీఎస్పీ గోపాలకృష్ణ ఫోన్ చేసి.. తానొచ్చి మాట్లాడతానని చెప్పడంతో ఆందోళన విరమించారు.