ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచార్యులు
ఏలూరు టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన సంఘటనలు కళ్ళముందు కదలాడుతూ ఉండగానే... ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మరో అమానుష సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహిళా విభాగంలోకిఅనుమతించలేదనే కోపంతో ప్రభుత్వాసుపత్రిలోని మహిళా సెక్యూరిటీ గార్డుపై తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు దౌర్జన్యానికి దిగారు. ఏకంగా మహిళా సెక్యూరిటీ గార్డు గుండెలపై చేయివేసి గెంటివేయటంతో ఆమె హతాశురాలయ్యింది. అంతా చూస్తుండగానే ఒక ప్రజాప్రతినిధి మహిళపై చేయి వేయటంతో అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సదరు జెడ్పీటీసీ సభ్యుడు తాను జిల్లా మంత్రి అనుంగుడనని.. నాకే చేయి అడ్డుపెడతావా అంటూ చిందులేశారు. అధికార పార్టీకి చెందిన తనకే మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా అంటూ హడావుడి చేశారు. మీ సంగతి తేలుస్తానంటూ గొడవ చేసి గందరగోళం సృష్టించారు.
ఆ మహిళా సెక్యూరిటీ గార్డు సహచర సిబ్బందికి, అధికారులకు, కార్మిక సంఘం నాయకులకు తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని రోదించింది. మెడికల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, కార్మిక సంఘం నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించినటీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు ఈప్రభుత్వంలో రక్షణ లేదంటూ నినాదాలు చేశారు.
దౌర్జన్యానికి కారణమేంటంటే
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మహిళా, శిశు విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో కేవలం మహిళలకు మాత్రమే సేవలు అందిస్తూ ఉండడంతో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించారు. మహిళా విభాగంలోకి నిర్దేశిత సమయాల్లో మినహా పురుషులను ఎవ్వరినీ అనుమతించరు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నిడమర్రు టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ లోనికి వెళుతున్నారు. ఇదే సమయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి విధులు నిర్వర్తిస్తున్నారు. లోనికి వెళ్ళబోతున్న దివాకర్‌కు ఆమె చేయి అడ్డుగా పెట్టి ఆపింది. పురుషులు లోనికి వెళ్ళకూడదని వారించింది. దీంతో ఆగ్రహానికి గురైన జెడ్పీటీసీ సభ్యుడు మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారి గుండెలపై చేయివేసి ఒక్కసారిగా వెనక్కి గెంటివేశారు. తాను ఎవరో తెలుసుకోకుండా అడ్డుపడతావా అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిడుతూ లోనికి వెళ్ళిపోయారు. ఆకస్మికంగా జెడ్పీటీసీ దాడి చేయటంతో నిశ్చేష్టురాలైన ఆమె తేరుకోలేకపోయింది. తనకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది. నాయకులే ఇలా తమపై దాడులు చేస్తే ఇక రక్షణ ఏదంటూ విలపించింది.
రాయ‘బేరాలు’ :
మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై దౌర్జన్యానికి పాల్పడిన జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ సహచర సిబ్బంది, సంఘం నేతలు వచ్చేలోగానే అక్కడి నుంచి జారుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి సంఘటనలను సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమాచార్యులు, నేతలు పరిశీలించారు. సీసీటీవీ కెమేరాల్లో నమోదైన రికార్డుల ఆధారంగా అతను ఎవరనేది గుర్తించి జెడ్పీటీసీ దివాకర్‌గా నిర్థారించుకుని ఆయనకు ఫోన్ చేశారు. కేసు పెడతామని, తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించటంతో దిగివచ్చిన దివాకర్ రాజీమార్గంలోకి వచ్చారు. ఆసుపత్రి కాంట్రాక్టర్, ఇతర ప్రజాసంఘాల నేతలతో రాజీకి రాయబారాలు నడిపారు.
క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం
ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు ప్రసన్నకుమారిపై నిడమర్రు జెడ్పీటీసీ సభ్యుడు దివాకర్ దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత హేయమైనది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. ఇప్పుడు ఏలూరులో టీడీపీ ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆమె గుండెలపై చేయివేసి గెంటివేయటం తీవ్రమైన నేరం. ఆయన వచ్చి అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం.– కే.కృష్ణమాచార్యులు, సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment