బయట పడవేసిన సామాను, వెంకటేశ్వర రావు ఇంటి వద్ద కుర్చీలో కూర్చున్న రామకోటిరెడ్డి
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): సీఆర్‌డీఏ పరిధిలో కొత్త రకం దందాలకు టీడీపీ నాయకులు తెరలేపారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ఆస్తి వివాదాల్లో తలదూర్చి, చెల్లి పేరున ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టుకుని అన్న నివాసం ఉంటున్న ఇంట్లోకి ఓ టీడీపీ నాయకుడు 20 మంది అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేశాడు. ఇంట్లో, దుకాణంలో ఉన్న వారిని దౌర్జన్యంగా బయటకు నెట్టి, సామాను బయట పడవేసిన సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో చోటుచేసుకుంది. నూతక్కి గ్రామంలో చిల్లర దుకాణం పెట్టుకుని నివాసం ఉండే కొప్పురావూరి వెంకటేశ్వరరావు (శ్రీను) టి.సామ్రాజ్యం అన్నాచెల్లెళ్లు. కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి వివాదం జరుగుతోంది. స్థానిక టీడీపీ నాయకుడు రామకోటిరెడ్డి ఆస్తి వివాదం తీరుస్తానంటూ వారి మధ్య తలదూర్చాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రామకోటిరెడ్డి గ్రామంలోని తన అనుచరులతో వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి ఇంట్లో సామాను, చిల్లరకొట్టులో ఉన్న సరుకులు బయటకు విసిరివేశారు. గ్రామస్తులు కలుగుజేసుకుని అన్నాచెల్లెళ్లు వారి ఆస్తి గొడవలు వారు తేల్చుకుంటారు కదా, మధ్యలో నీ దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించగా, నూతక్కిలో కోర్టయినా, పోలీసు అయినా నేనే, ఎవరేం చేస్తారో చూస్తానంటూ కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అడ్డువచ్చిన వెంకటేశ్వరరావును, అతని సోదరుడు శోభన్‌బాబును, భార్యను ఇంట్లో నుంచి బయటకు నెట్టి, తాళాలు వేశాడు.
వెంకటేశ్వరరావు కుమార్తె కుసుమ 100కి ఫోన్ చేయడం గమనించిన రామకోటిరెడ్డి అనుచరులు సెల్‌ఫోన్ తీసుకుని నేలకి విసిరి కొట్టారు. గ్రామస్తులు కూడా రామకోటిరెడ్డి అరాచకానికి భయపడి ఎవరూ బయటకు రాలేదు. అనంతరం కుసుమ ఆ దారంట వెళ్లే ఓ వ్యక్తిని ఫోన్ అడిగి తీసుకుని మధ్యాహ్నం 1.20 గంటలకు మళ్లీ 100కి ఫోన్ చేసింది. 3 గంటల తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగింది. తీరా వచ్చిన పోలీసులు అన్నా, చెల్లెళ్లిద్దరినీ ఆస్తి గొడవలు పరిష్కరించుకోమంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. దౌర్జన్యం చేసిన రామకోటిరెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని అన్నాచెల్లెళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేత ఆగడాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment