సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవళాపురం తీర ప్రాంతం నుంచి తరలుతున్న ఇసుక
నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా... నది ఏదైనా మాఫియా దోపిడీ ఇసుకే! టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక విధానం’ సామాన్యుల కంటే పచ్చ తమ్ముళ్లకే ఎక్కువ ఉపయోగపడింది. ఇదే ముసుగులో ఎక్కడికక్కడ ఇసుక ర్యాంపులను తెరిచి మాఫియా ఇసుకను అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటించేసింది. రూ.కోట్లలో కాసులను కళ్ల చూసిన అనుభవంతో ఇప్పుడు ఎంతకైనా తెగిస్తోంది. ఒకవైపు వారం రోజులుగా అధికార యంత్రాంగం దాడులు చేస్తున్నా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడట్లేదు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదుల జిల్లాగా పేరొందిన సిక్కోలు ఇసుకకు విశాఖపట్నం, విజయనగరం మా ర్కెట్లలో మంచి డిమాండు ఉంది. కానీ ఇప్పుడు జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక ర్యాంపులకు అనుమతులు లేవు. విశాఖలో గృహనిర్మాణ అవసరాలతోపాటు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం కొన్ని ఇసుక ర్యాంపులకు జిల్లా కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్ కమిటీ నుంచి అనుమతులు ఇచ్చేవారు. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయిన్లతో ఛిద్రం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందులో లొసుగులను ఆసరాగా చేసుకొని స్థానికంగా కొంతమంది టీడీపీ నాయకుల అండదండలతో మాఫియా నదులను చెరబట్టింది.
నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఇసుక డిమాండును బట్టి రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది. విశాఖ, విజయనగరం మార్కెట్లకు పెద్ద పెద్ద లారీల్లో తరలించి రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకూ విక్రయిస్తోంది. రూ.కోట్లకు పడగలెత్తిన ఇసుకాసురులు ఈ అక్రమ రవాణాను వదులుకోలేకపోతున్నారు. అధికార యంత్రాంగం దాడులు చేస్తున్నా ఆగట్లేదు. నదుల వెంబడి పగలంతా పోగులు వేయించి, రాత్రి అయ్యేసరికి పొక్లెయిన్లతో లారీలకు లోడు చేయిస్తున్నారు. ఏదెలా ఉన్నా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ఇసుక అక్రమ వ్యాపారంపై జిల్లా ఉన్నతాధికారులు కన్నేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇసుకాసురుల ఆగడాలకు ఆనవాళ్లు...
అక్రమ ఇసుక వ్యాపారానికి ఆమదాలవలస మండలం ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. నాగావళి పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసినా అక్రమ ఇసుక ర్యాంపులే దర్శనమిస్తున్నాయి. మండలంలో ఇసుక ర్యాంపులు గుర్తించటంలో అ«ధికారుల కంటే అక్రమ ఇసుక వ్యాపారులు ఒకడుగు ముందున్నారనే చెప్పాలి. మండలం పరిధిలో దూసిపేట, కొత్తవలస, గోపీనగర్, నిమ్మతొర్లాడ, తొగరాం, జీకేవలస, కొరపాం, ముద్దాడపేట, చెవ్వాకులపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం ట్రాక్టర్లు ద్వారా అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతోంది.
ప్రధానంగా మండలంలోని గోపీనగర్, కొత్తవలస, పాతూరు, నిమ్మతొర్లాడ, చిట్టివలస తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటుచేసి కొందరు ఇసుక వ్యాపారులు లారీలు ద్వారా విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పొందూరు మండలంలో టీడీపీ నాయకుల ఇసుక దందా కొనసాగుతోంది. వందల కొద్దీ ట్రాక్టర్లలో నది నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. గండ్రేడు, బెలమాం గ్రామాల గుండా ప్రవహిస్తున్న నాగావళి నదిలో ఇసుకను పొందూరు మీదుగా రాజాం, చిలకపాలెం వైపు రవాణా చేస్తున్నారు. కింతలి మీదుగా శ్రీకాకుళం, నరసన్నపేట వైపు తరలిస్తున్నారు. అధికారులకు మాత్రం పట్టనట్టే ఉన్నారు. తుంగపేట, నర్సాపురం సమీపంలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇసుకను అధిక ధరకు విక్రయిస్తున్నారు. సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవలాపురం, యరగాం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నది.
- ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బాహుదా నదీ పరివాహక ప్రాంతమైన బొడ్డబడ, కొళిగాం, పాయితారీ, అరకబద్ర, హరిపురం, బిర్లంగి, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం, ఈదుపురం, కేశుపురం, డొంకూరు, లక్ష్మీపురం ప్రాంతాల్లో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఇసుకాసురులు యధేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
- పాలకొండ నియోజకవర్గం పరిధిలో నాగావళి నది నుంచి ఇసుక తరలింపు యధేచ్చగా కొనసాగుతోంది. పాలకొండ మండల పరిధిలో అన్నవరం, అంపిలి, గోపాలపురం, మంగళాపురం గ్రామాల మీదుగా, వీరఘట్టం మండలం తలవరం, పనసనందివాడ, ఎంవీ పురం, బిటివాడ, పాలమెట్ట, విక్రామ్‌పురం, కడకెల్ల గ్రామాలు నాగావళి నదిని ఆనుకుని ఉండటంతో ఈ ప్రాంతాల మీదుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లు అడ్డూఅదుపు లేకుండా సంచరిస్తున్నాయి. ఇటీవల వీరఘట్టం మండలంలోని తలవరం సమీపంలో ఓ యువకుడు ఇసుక ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలయ్యాడు. మరో యువతి తీవ్ర గాయాలపాలైయ్యింది. అలాగే బిటివాడ అక్రమ ర్యాంపులో ఇసుక ఎత్తుతున్న కూలీ ప్రమాదవశాత్తూ మరణించాడు.
- ఇసుక అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం తయారైంది. రేగిడి, తునివాడ, బొడ్డవలస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుకపోగులు వేస్తున్నారు. లారీలకు ఎత్తి రాజాం మీదుగా ఇతర ప్రాంతాలకు పట్టపగలే తరలిస్తున్నారు. వంగర మండలంలో సువర్ణముఖి, వేగావతి నదులతో పాటు నాగావళి నదీతీర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా ఇప్పుడూ జరుగుతోంది. సంతకవిటి మండలం మేడమర్తి, తమరాం, పోడలి సమీప ప్రాంతాల వద్ద నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ నదిలో ట్రాక్టర్లతో ఇసుకను తవ్వి పలు గ్రామాల వద్ద ప్రధాన రహదారి పక్కనే నిల్వగా ఉంచుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ ఇసుకను విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు పంచాయతీల పరిధిలో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, బింగిపేట పాతపొన్నాడ వంటి రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ బృందాల నిఘా ఉంది. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగటం లేదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి ఆనుకొని చిలకపాలెం, అల్లినగరం, ఎస్‌ఎస్‌ఆర్ పురం వంటి ప్రాంతాల్లో పోగులు వేస్తున్నారు. పోగులు వేసి రాత్రి వేళల్లో లారీల్లో విశాఖపట్నం ఇసుక తరలిస్తున్నారు. సజావుగా ఇసుక తరలిపోతోంది. నిఘా బృందాలు సైతం మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
- నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని జలుమూరు, పోలాకి, నరసన్నపేట నదీతీర గ్రామాల్లో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోంది. ప్రధానంగా నరసన్నపేట రూరల్ మండలం కోమర్తి, లుకలాం, ముద్దాడపేట, గెడ్డవానిపేట రేవుల నుంచి ట్రాక్టర్లతో రోడ్డు పక్కన పోగులు వేసి రాత్రి వేళల్లో విశాఖపట్నం తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మండపాం, బుచ్చిపేట, చేనులవలస రేవుల నుంచి లారీలతో తరలిస్తున్నారు. అలాగే జలుమూరు మండలం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనుమతులు పేరిట కొంత ఇసుక రోడ్డుకు వెళ్లగా రాత్రివేళల్లో మాత్రం విశాఖకు టీడీపీ నాయకులు తరలిస్తున్నారు. పోలాకి మండలంలోని మబగాం, వనిత మండలం గ్రామాల్లో అధికార టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందిస్తున్నారు.
- శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని భైరి, కరజాడ, రోణంకి పరిసర ప్రాంతాల్లో ఇటీవల సీజ్‌చేసిన ఇసుకను స్వా«ధీనం చేసుకునేందుకు బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్ లిమిటెక్ సంస్థ ముందుకొచ్చింది. ఇటీవలే పొన్నాంలో అధికారిక ర్యాంపు ప్రారంభించినప్పటికీ దాని అనుమతులు మించి భారీ యంత్రాలతో ఇసుకను తోడెయ్యడంతో ఆయా గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు వెంటనే ఆ ర్యాంప్‌ను బంద్ చేయించారు. సీజ్ చేసిన ఇసుకను కేవలం ప్రభుత్వ పనులకంటూ జిల్లా యంత్రాంగానికి లేఖలు రాసినప్పటికీ తరువాత విశాఖ అవసరాలు పేరిట ఒక్కో లోడు రూ.12 వేలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
- పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో వంశధార నది టీడీపీ నేతలకు కామధేనువుగా మారింది. కుంటిభద్రలో రైతులు పంట పొలాల్లో వేసిన ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకువచ్చిన ఓ టీడీపీ నేత పొలాల్లో ఇసుక తవ్వకాలు చేయకుండా వంశధార నదిలో అక్రమంగా తవ్వకాలు చేస్తూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నాడు. పొన్నుటూరులో ఆలయం నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహించి లబ్దిపొందుతున్నారు. పెనుగోటివాడ, వీరనారాయణపురం, మాతల, కుద్దిగాం, నివగాంతో పాటు పలు గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment