సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోస్టల్ బ్యాలెట్ అధికార పార్టీలో ప్రకంపనలు రేపింది. ఉద్యోగులకు ఓటుకు రెండు వేల రూపాయల వరకూ ఆశ చూపినా వారు తోసిరాజని వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓట్లు వేయడం అధికారపార్టీని కలవరపెడుతోంది. జిల్లాలో పోలైన ఓట్లలో 70 నుంచి 80 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీకి పడ్డాయని అంచనా. పోస్టల్ బ్యాలెట్‌లో ట్రెండ్ చూసిన తర్వాత డబ్బుతోనైనా గెలవాలనే అభిప్రాయానికి పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వచ్చేశారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్ల కొనుగోలుకు సిద్ధ పడుతున్నారు. ఒక్క ఓటు ఉన్నా వారిని వెతికిపట్టుకుని ప్రలోభ పెట్టే పనిలో పడిపోయారు.
డబ్బుతో కొనడం.. వినకపోతే బెదిరింపులకు దిగడం వారి వ్యూహంగా మారింది. కొన్నిచోట్ల అధికారులు, ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు మద్దతు పలుకుతుండటంతో వారి అండతో గెలుపొందాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వారి వాహనాలను చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు చేయడం లేదు. మరోవైపు గత నెల 24న సమావేశం పేరుతో చెక్‌పోస్టులలో తనిఖీ చేసే సిబ్బందిని నియోజకవర్గ కేంద్రాలకు రప్పించి ఆ సమయంలో డబ్బులు అన్ని ప్రాంతాలకు చేరేలా తెలుగుదేశం నాయకులకు సహకరించినట్లు సమాచారం. అదే విధంగా మద్యం తరలించేందుకు కూడా పోలీసు అధికారులు సాయం అందించినట్లు వార్తలు వస్తున్నాయి.
హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఒక కీలక విభాగం అధికారి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఎక్కడైనా తెలుగుదేశం నాయకులు డబ్బులు పంచుతూ పట్టుబడినా వారిపై కేసులు లేకుండా పంపించేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అధికారిపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు అక్రమ సంపాదనతో కూడబెట్టిన డబ్బులతో పాటు తెలుగుదేశం అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుండటంతో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అయినా ఖర్చు చేసేందుకు తెలుగుదేశం అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇంటిలోని అన్ని ఓట్లకు ఇంత మొత్తం అంటూ బేరాలకు దిగుతున్నారు. కాదు కూడదు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపులు వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదును బదిలీ చేస్తున్నారు. సమావేశాలు పెట్టి మరీ మహిళలకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. మొత్తంగా ఓట్లు పొందేందుకు అధికార పార్టీ నేతలు అన్ని రకాల ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇంటింటి ప్రచారం కన్నా... అధికార పార్టీ నేతలు ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికార యంత్రాంగం అండతో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాల రాజకీయం మితిమీరింది.
గ్రామాల్లో డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లను టార్గెట్ చేశారు. నగదు అందచేసి వారి ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగా డ్వాక్రా మహిళల అకౌంట్ల నంబర్లు తీసుకుని టీడీపీ నాయకులు గ్రూపుకు రూ.10 వేల చొప్పున పలు అకౌంట్లకు జమ చేశారు. పలు మండలాల్లో మహిళలకు మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి వెయ్యి రూపాయల నగదు అందచేశారు. ప్రధానంగా మహిళల ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇవికాక మత్స్యకార గ్రామాలు, కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలంటూ పైరవీలు చేస్తున్నారు. ఆయా కుల పెద్దలకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామ కాపులతో బేరం పెడుతున్నారు.
మత్స్యకార గ్రామాలను కొంటున్న పరిస్థితులు దెందులూరు, నర్సాపురం నియోజకవర్గాల్లో ఉన్నాయి. నిడదవోలులో తెలుగుదేశం అభ్యర్థ్ధి శేషారావు ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి వారికి ఒక్కొక్కరికి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఎవరైనా పది ఓట్లు వేయించగలరని తెలిస్తే వారి ఇంటివద్ద వాలిపోతున్నారు. వారికి ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు డబ్బులు ఎరచూపి వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా భీమవరంలో జనసేన కూడా డబ్బులు వెదజల్లి గెలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్‌కు రెండు వేల రూపాయల వరకూ జనసేన నాయకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని కూడా కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment