నెల్లూరు(పొగతోట): ప్రజాక్షేత్రంలో గెలవలేమని గుర్తించిన టీడీపీ నేతలు ఎన్నికల్లో విజయానికి తొక్కని అడ్డదారులు లేవు. ఓటర్ల ప్రలోభాలకు తెరతీసిన అధికార పక్షం తాజాగా పోస్టల్ బ్యాలెట్‌నూ వదల్లేదు. ఉద్యోగులను బెదిరించి, ప్రలోభ పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. ఉదయగిరి, ఆత్మకూరుల్లో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగులు టీడీపీకి ఓటు వేసేలా చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర నాయకుడు అశోక్‌బాబు గురువారం నెల్లూరులో మకాం వేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా వేసేలా ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆయన చర్యలను వ్యతిరేకించిన వారిపై బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. నిబంధనలకు గాలికొదిలేసి అశోక్‌బాబు వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంత్రి నా రాయణ మరో అడుగు ముందుకేశారు. నగరంలోని అంగన్‌వాడీలను, మెప్మా సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి తనకు అనుకూలంగా ఓట్లు వేసుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని బెది రింపులకు సైతం పాల్పడుతున్నట్టు సమాచారం. ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలు కోరుతున్నాయి.
ఇక రెండు రోజులే..
పోస్టల్ బ్యాలెట్ తీసుకునేందుకు రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 6వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఆర్‌ఓ కేంద్రాలు పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 24 వేల మంది ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాల్సి ఉంది. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 5,590 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారు. అందులో 3,679 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ఆర్‌ఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేశారు. ఇంకా సుమారు 18 వేల మందికిపైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది.
దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు నేరుగా కాని లేదా పోస్టల్ ద్వారా కాని బ్యాలెట్ పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు ఆర్‌ఓ కార్యాలయాలకు చేరుకోవడంతో రద్దీ పెరిగిపోయింది. ఆర్‌ఓ కార్యాలయాల వద్ద టీడీపీ అభ్యర్థుల వర్గీయులు చేరి, పోస్టల్ బ్యాలెట్‌ను రూ.2500 నుంచి రూ.4 వేలకు ఇవ్వాలని ప్రలోభాలు పెడుతున్నారు. అలా ఇవ్వమన్న వారిని సంబంధిత శాఖల అధికారుల ద్వారా బెదిరిస్తున్నారు. దీంతో కొంత మంది ఈ చిరాకులు భరించలేక బ్యాలెట్ ఇచ్చి వెళ్లిపోతున్నారు.
అందరికీ తెలిసిన ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి పోస్టల్ బ్యాలెట్ సేకరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఉండకూడదని ఎన్నికల అధికారులు ఆదేశించినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వని ఉద్యోగులపై ఒత్తిళ్లు చేయిస్తు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు రెండు రోజులే సమయం ఉండడంతో ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు.
నియోజకవర్గం | పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న ఉద్యోగులు | పోస్టల్ బ్యాలెట్ వినియోగించినఉద్యోగులు |
కావలి | 394 | 155 |
ఆత్మకూరు | 348 | 69 |
కోవూరు | 318 | 292 |
నెల్లూరు సిటీ | 793 | 787 |
నెల్లూరు రూరల్ | 970 | 715 |
సర్వేపల్లి | 821 | 659 |
గూడూరు | 703 | 0 |
సూళ్లూరుపేట | 753 | 753 |
వెంకటగిరి | 275 | 164 |
ఉదయగిరి | 215 | 85 |
మొత్తం | 5,590 | 3,679 |
Comments
Please login to add a commentAdd a comment