సత్తెనపల్లి: ‘‘2004 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక పదేళ్లపాటు అనేక ఇబ్బందులు పడ్డాం. 2014లో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటే చేసేందుకు వస్తున్నాడని చెప్పగానే ఎగిరి గంతేశాం. ఎక్కడెక్కడో ఉన్న మా బంధువులను పిలిపించి ఓట్లు వేయించాం. రూపాయి ఆశించకుండా ఖర్చు భరించాం. కానీ, కోడెల అధికారంలోకి వచ్చాక దూడల పెత్తనంతో ఐదేళ్లు నరకం చూశాం. మా కొద్దు ఈ కోడెల’’ అని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు. సత్తెనపల్లి టిక్కెట్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఇవ్వొద్దంటూ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు రెండో రోజు గురువారం ఆందోళన కొనసాగించారు. సీనియర్ నేతలు గోగినేని కోటేశ్వరరావు, బొర్రా అప్పారావు, పెద్దింటి వెంకటేశ్వర్లు, కోమటినేని శ్రీనివాసరావు, సంగం డెయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు, గన్నమనేని శ్రీనివాసరావు, పోట్ల అంజితోపాటు దాదాపు 1,000 మంది నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
వేధించారు.. డబ్బులు గుంజారు
పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వారికి విలువ లేకుండా స్పీకర్ కోడెల కుమారుడు శివరామ్ వ్యవహరించారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల గెలుపు కోసం కష్టపడిన సొంత పార్టీ వారిని కూడా వదలకుండా వేధింపులకు గురిచేసి, డబ్బులు గుంజుకున్నారని ఆరోపించారు. కోడెల వేధింపులను భరించలేక ఎంతోమంది నాయకులు పార్టీని వీడి ప్రతిపక్షంలో చేరారని, మరికొందరు దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారని గుర్తుచేశారు.
కోడెలకు టిక్కెట్ ఇస్తే ఓటమే..
సత్తెనపల్లిలో కోడెల అరాచకాలు, దౌర్జన్యాలు, వేధింపులు, వసూళ్ల కారణంగా ఎంతోమంది నష్టపోయారని టీడీపీ నాయకులు చెప్పారు. మళ్లీ కోడెలకు టిక్కెట్ ఇస్తే సత్తెనపల్లిలో టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందన్నారు. భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉందన్నారు. మాట వినని వారిపై అక్రమ కేసులు పెట్టడం కోడెలకు అలవాటుగా మారిపోయిందని పేర్కొన్నారు. ‘నియంత పాలన మాకొద్దు. కోడెల గోబ్యాక్. క్విట్ కోడెల.. సేవ్ కేడర్. కోడెల హఠావో.. సత్తెనపల్లి బచావో’ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు సత్తెనపల్లిలో ప్రదర్శన నిర్వహించారు. కోడెలకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
పీడ వదలాలని పసుపు నీటితో రోడ్ల శుద్ధి
స్పీకర్ కోడెల శివప్రసాదరావు పీడ వదలాలని టీడీపీ నాయకులు గురువారం రాత్రి సత్తెనపల్లిలో చీపుర్లతో రోడ్లను శుభ్రపరిచి, పసుపు నీటితో శుద్ధి చేశారు. పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వరకు చీపుర్లు పట్టుకొని శుభ్రపరిచారు. పసుపు నీళ్లు చల్లుతూ శుద్ధి కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు దుష్టశక్తుల పీడ వదలాలి.. గోబ్యాక్ కోడెల అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
నాతో, మా కుటుంబంతో సమస్యలు రావు
సత్తెనపల్లి నుంచి నేనే పోటీ చేస్తున్నా: కోడెల శివప్రసాదరావు
తనతో, తన కుటుంబంతో ఇకపై ఎలాంటి సమస్యలు రావని హామీ ఇస్తున్నానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన గురువారం సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ మళ్లీ తనకు అవకాశం ఇచ్చిందన్నారు. పార్టీలో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, అవి సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు సహకరించాలని, కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు. దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలవడం ఖాయమని కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఇకపై ఇబ్బంది పెట్టనంటూ కోడెల వ్యాఖ్యానించడంతో ఇప్పటిదాకా ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ప్రజలను ఇబ్బందిపెట్టినట్లుగా పరోక్షంగా అంగీకరించినట్లు అయిందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment