ప్రజలు మట్టి కరిపిస్తారు..!
► వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంట్ ఇన్‌చార్జి అయోధ్య రామిరెడ్డి హెచ్చరిక
► టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు
► రాక్షసపాలన గుర్తుకు తెస్తున్నారు
వినుకొండ టౌన్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నీతిబాహ్యంగా వ్యవహరిస్తోందని, ప్రజలు సరైన సమయం చూసి తమ సత్తా చూపి మట్టి కరిపిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, ఎన్నికలు ముగిసిన తరువాత ప్రజాప్రతినిధిగా నిష్పక్షపాతంగా పాలన సాగించిన వారే నిజమైన నాయకులన్నారు.
నిస్వార్ధంగా పాలించాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో దొంగల పాలనలా దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తమ వారిని రక్షించుకోవడానికి ఎంతటికైనా తెగించడం రాక్షసపాలనను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. కార్యకర్తలు స్వార్ధం వీడి సమన్వయంతో జగనన్న సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి పూర్తి భరోసా కల్పిస్తానని చెప్పారు.
తప్పుడు కేసులు పెడుతున్నారు
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, సర్పంచ్‌ల చెక్ పవర్‌లు రద్దు చేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం, బొల్లా ఎమ్మెల్యే కావడం ఖాయమన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టిడీపీ నాయకుల అకృత్యాలను ఎండగట్టి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. పెదకూరపాడు ఇన్‌చార్జి పాణెం హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.