►ప్రలోభాలతో గెలుపు బలుపు కాదు!
►‘ఓటుకు కోట్లు’ అక్రమాల్లో ఆరితేరారు
►టీడీపీ నేతలను ప్రజలు తరిమికొడతారు
►ప్రత్యక్ష ఎన్నికలంటే చంద్రబాబుకు భయం
►వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: డబ్బును వెదజల్లి ప్రలోభాలతో ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చిన గెలుపు టీడీపీకి బలుపు కాదని, అది వాపు మాత్రమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం కొత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా ధనాన్ని వెదజల్లి గట్టెక్కడం విజయం కానేకాదని, అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఇవేనా చంద్రబాబు వల్లించే ప్రజాస్వామ్య విలువలు? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడే చంద్రబాబు చెప్పే నైతిక విలువలేమిటో తేటతెల్లమైందని గుర్తు చేశారు. అలా ఓట్ల కొనుగోళ్ల అక్రమాల్లో ఆరితేరిన టీడీపీ నాయకులు తమ అనుభవాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఉపయోగించారని చెప్పారు.
కాదు తాము ప్రజాస్వామ్యయుతంగా గెలిచామనే భావిస్తే 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రత్యక్ష ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. కానీ ప్రత్యక్ష ఎన్నికలంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సహా టీడీపీ నేతలందరికీ భయమేనని వ్యాఖ్యానించారు. అందుకే లోకేష్‌ను దొడ్డిదారిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంపించారని చెప్పారు. సాధారణ ఎన్నికలొస్తే ప్రజలు టీడీపీ నాయకులను తరిమికొట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫలితాలే వచ్చే సాధారణ ఎన్నికలలో పునరావృతమవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచి చెడు సంప్రదాయానికి చంద్రబాబు తెరతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రాజకీయాలు, అక్రమ విధానాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఆమె హితవుపలికారు.
ఇవేనా మీ ప్రజాస్వామ్య విలువలు ?
Published Tue, Mar 21 2017 2:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
Advertisement
Advertisement