ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చర్యలను వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు మరోసారి రోడ్డెక్కి ఆందోళనకు దిగా రు.
ఎంపీ మాగంటి బాబు మాట తప్పారని ఆందోళన
స్విచ్ ఆపరేటర్లుగా స్థానికులనే నియమించాలని డిమాండ్
ఎమ్మెల్యే శ్రీనివాస్ జోక్యంతో శాంతించిన టీడీపీ నేతలు
టి.నరసాపురం :ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చర్యలను వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు మరోసారి రోడ్డెక్కి ఆందోళనకు దిగా రు. టి.నరసాపురం మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో స్విచ్ ఆపరేటర్ల నియామకంలో స్థానికులకు అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం స్థానికేతరులు ఇద్దరు శ్రీరామవరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో స్విచ్ ఆపరేటర్లుగా జాయిన్ కావడంతో టీడీపీ నాయకులు గురువారం ఆందోళనకు దిగారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తోట వీరాస్వామినాయుడు (పెదనాయుడు), మండల టీడీపీ నాయకుడు కాల్నీడి రాంబాబుల ఆధ్వర్యంలో స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ సరఫరాను ఉదయం 11.20 గంటలకు నిలి పివేశారు. సిబ్బందిని బయటకు పిలిచి కార్యాలయానికి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎదుటే టెంట్ వేసుకుని వంటా వార్పు నిర్వహించారు.
ఈ సందర్భంగా పెదనాయుడు, రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ఎన్నికల ముందు స్థానికులను స్విచ్ ఆపరేటర్లుగా నియమిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో ఆందోళన చేస్తున్నామన్నారు. శ్రీరామవరంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 30 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన స్థానికుడు కొలగాని చినవెంకటేశ్వరరావు మనుమడిని, తిరుమలదేవిపేట వ్యక్తిని నియమించాలని గతంలో హామీ పొందామని, అది అమలు కాలేదని వివరించారు. సాయంత్రం వరకు సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఆందోళనలో కాల్నీడి వెంకటరత్నం, తోట లక్ష్మీ నారాయణలతో పాటు శ్రీరామవరం, ఏపుగుంట తిరుమలదేవిపేట, మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జోక్యంతో ఆందోళన విరమణ
ఆందోళన విషయం తెలిసిన ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ సాయంత్రం సబ్‌స్టేషన్ వద్దకు వచ్చారు. కొత్తగా జాయిన్ అయిన స్విచ్ ఆపరేటర్లను విధులకు హాజరుకాకుండా చూడాలని, ఈ సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరించాలని ఏఈ డి.శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో టీడీపీ నాయకులు శాంతించి ఆందోళన విరమించారు.