చంద్రబాబు సభలపై టీడీపీ శ్రేణులు, నేతల్లో ఆందోళన
మరోపక్క సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు పోటెత్తుతున్న ప్రజలు
చంద్రబాబు ప్రజాగళం సభలకు రాని జనం
ఎంత ప్రయత్నించినా జనం రావడంలేదంటున్న టీడీపీ నేతలు
పవన్ కళ్యాణ్‌ని తెచ్చినా కన్నెత్తి చూడని జనం
కూటమి పేరుతో నిర్వహించే సభలూ ఫ్లాపేనని ఆవేదన
చిన్న సెంటర్లు, రోడ్లలో పెట్టి జనం వచ్చినట్లు చిత్రీకరించేందుకు ఆపసోపాలు
ప్రజాభిప్రాయానికి ఇదే నిదర్శనమంటున్న విశ్లేషకులు
సాక్షి, అమరావతి: ఓ పక్క ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర అశేష ప్రజానీకంతో సాగుతోంది. అంతకు ముందు సీఎం జగన్ పాల్గొన్న సిద్ధం సభలూ ఘన విజయం సాధించాయి. మరి మన బాబు సభలేమిటి ఇంతగా తేలిపోతున్నాయి.. టీడీపీ నేతల్లో అంతర్మథనమిది. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు కనీస స్థాయిలో జనం రావడంలేదు. బాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని పవన్ కళ్యాణ్‌ని తీసుకువచ్చినా ఫలితం సున్నా.
నాలుగు రోజులక్రితం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కూటమి సభలో చంద్రబాబు, పురందేశ్వరితోపాటు పవన్ కూడా పాల్గొన్నారు. అయినా ఈ సభకు నాలుగైదు వేల మంది కూడా రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు తణుకు సభకూ జనం ఆశించిన స్థాయిలో రాలేదు. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో జన సమీకరణ భారీగా చేయాలని ఆ జిల్లా నాయకులపై ఒత్తిడి తెచ్చారు.
జిల్లా నాయకులు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తమ పార్టీ సభలకి ప్రజల్ని తీసుకురావడం కష్టంగా మారిందని, ఎంత చెప్పినా, ప్రలోభపెట్టినా రావడంలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. బాబు ఒక్కడే విడిగా పెడుతున్న సభల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకి రెండు, మూడు సభలు పెడుతున్నా, ఒక్క చోట కూడా అనుకున్న స్థాయిలో ప్రజలు రావడంలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు.
పలుచగా ఉన్న సభల్ని చూసి మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ నీరుగారిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపించేందుకు చిన్న సెంటర్లు, చిన్న రోడ్లను ఎంచుకుని సభలు పెడుతున్నారు. అక్కడికి అతి కష్టం మీద కొద్దిపాటి జనాన్ని తీసుకువచ్చి ఫొటోలు, వీడియోలతో వాటినే గొప్పగా ఉన్నట్లు చూపిస్తున్నారు.
బాబు స్పీచ్ మొదలైతే.. జనమూ జంపే...
మరోవైపు సభలకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాబు ప్రసంగం మొదలవగానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. బాబు ప్రసంగం అంటేనే గంటా గంటన్నరపాటు ఊకదంపుడు స్పీచ్ ఉంటుంది. అందులోనూ విషయం లేకపోవడంతో వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. వైఎస్ జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతుండడంతో ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగు సభలను చూస్తే బాబు మాట్లాడుతున్నప్పుడు వింటున్నవారి సంఖ్య చాలా స్వల్పం.
ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ను తిట్టడం, ఈర‡్ష్య, ద్వేషాలను బయటపెట్టుకోవడం తప్ప బాబు ప్రసంగాల్లో కొత్తదనం కనిపించడంలేదని చెబుతున్నారు. దానివల్లే జనం ఏమీ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కడుపు మంటనంతా వెళ్లగక్కి, కళ్లు మూసుకుని గంటల తరబడి అబద్ధాలను చెబుతూ వాటినే గొప్ప ప్రసంగాలుగా ఫీల్ అవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈసారి ఎలాగైనా జనాన్ని తీసుకురండి.. నేతలకు హెచ్చరికలు
గత నెలలో చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించిన సభను కూడా టీడీపీ విజయవంతం చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో నిర్వహించిన ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, సభ కూడా అట్టర్‌ఫ్లాప్ అవడంతో బాబుకు షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాత నుంచి ‘ప్రజా గళం’ పేరుతో నిర్వహించిన సభలేవీ జనాన్ని ఆకర్షించలేదు.
అంతకుముందు ‘రా కదలిరా’ పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలూ తేలిపోయాయి. దీంతో ఏం చేయాలనే దానిపై కూటమి అగ్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సభలు విఫలమవడంపైనా చర్చించారు. ఈసారి ఎలాగైనా కొన్ని సభలకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పారు.
రాబోయే వారం రోజుల్లో వరుసగా 13 సభలకు ప్రణాళిక రూపొందించి అక్కడి నేతలకు ముందుగానే హెచ్చరికలు చేశారు. జన సమీకరణ బాగా ఉండాలని, లేకపోతే బాబు గారు తిడతారని పరిశీలకులు అక్కడి ఇన్‌ఛార్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల నేతలు మాత్రం జనం రాకపోతే తామేం చేయలేమంటూ
చేతులెత్తేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment