* పేదల భూమి స్వాధీనానికి టీడీపీ నేతల కుట్ర
* వారికి వంతపాడుతున్న రెవెన్యూ అధికారులు
* కలెక్టర్‌ను ఆశ్రయించిన తేటుపురం రైతులు
* బాధితులకు అండగా ఎమ్మెల్యే పోతుల, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని
ఒంగోలు టౌన్ : టంగుటూరు మండలం అనంతవరం పంచాయతీ తేటుపురం గ్రామానికి చెందిన 15 మంది రైతులపై అధికారపార్టీ నాయకులు కన్నెర్రజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 248/ఏ2లో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న 18 ఎకరాల ప్రభుత్వ భూమిని బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో పోలీసుల సహకారంతో అక్కడ సాగు చేసుకుంటున్న రొయ్యల చెరువులను ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ భూమి..అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
అదికూడా ఫలించకపోవడంతో ఆ 15 మందిని భూముల నుంచి బయటకు పంపించాలని పథకం పన్నారు. బాధితులకు తేటుపురం, అనంతవరం గ్రామాల ప్రజలు బాసటగా నిలిచారు. శుక్రవారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో ఒంగోలు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తేటుపురంలోని సర్వే నంబర్ 248/ఏ2లో 98ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 28 ఎకరాలను తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామంటూ తమను ఆ భూముల్లో నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమతో పాటు ఉన్న మిగిలిన వారి చెరువుల జోలికి వెళ్లకుండా కేవలం తమకు జీవనోపాధి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ముందుగా టంగుటూరు తహశీల్దార్‌తో నోటీసులు పంపించడం, ఆ తర్వాత ప్రభుత్వ భూములంటూ హెచ్చరిక బోర్డులు పెట్టించేందుకు ప్రయత్నించారన్నారు. చివరకు చెరువులను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశారని విచారం వ్యక్తం చేశారు. మూడు వేల ఎకరాల్లోని ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువులు సాగవుతుంటే వాటిని వదిలేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామంటూ తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీలు కూడా ఇదే విషయమై కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి బాధితులకు అన్యాయం చేయవద్దని కోరారు. కార్యక్రమంలో అనంతవరం సర్పంచ్ కసుకుర్తి సుందరరావు, వైఎస్సార్ సీపీ నేతలు ఉప్పలపాటి నర్సరాజు, శారీమందిర్ వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీకి ఓటేయడమే నేరమా?
Published Sat, Nov 1 2014 5:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement