ఎవరి అనుమతితో తాళం వేశారు?
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్
చిలకలూరిపేటరూరల్ : గంగన్నపాలెంలోని ఎత్తిపోతల పథకానికి టీడీపీ నాయకులు తాళం వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించకుండా నిలిపివేసేందుకు టీడీపీ నేతలు ఆదివారం రాత్రి తాళాలు వేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించి, అదే రోజు సాయంత్రం టీడీపీ నేతలు వేసిన తాళం పగులకొట్టి కొత్త తాళం వేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ‘మేడమ్’కు తెలియజేయడంతో ఆమె ఆదేశాలతో మంగళవారం పోలీసులు ఎత్తిపోతల పథకం భవనానికి మరో తాళం వేశారు.
దీనిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. గంగన్నపాలెంలోని నరసరావుపేట - చిలకలూరిపేట రాష్ర్ట రహదారిపై వేలాది మంది రైతులతో ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనను విఫలం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. దీంతో రైతులు పోలీసుల తీరును నిరసిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి రైతుల వ్యతిరేకిని విమర్శించారు. రూరల్ సీఐ టి.దిలీప్‌కుమార్ ఘటన ప్రాంతానికి చేరుకుని ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించరాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్‌కు సూచించారు.
రాజశేఖర్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకానికి ఎవరి అనుమతి తీసుకుని తాళం వేశారని సీఐని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రోడ్డుపైనే భీష్మించు కూర్చున్నారు. పోలీసులు మర్రి రాజశేఖర్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు తెలియజేసి, కొంతదూరం రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి పోలీస్ జీపులోకి ఎక్కించారు. ఆగ్రహించిన రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కోమటినేనివారిపాలెం - గోవిందపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసు జీపునకు ఎదురుగా బైఠాయించారు. తామంతా పాదయాత్ర ద్వారా చిలకలూరిపేట స్టేషన్ వరకు వస్తామంటూ నినాదాలు చేశారు.
అనంతరం పోలీసులు అందరితో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో తాళాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చాపలమడుగు గోవర్ధన్, మురికిపూడి సొసైటీ అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష కార్యదర్శులు సామినేని బాబూరావు, మన్నవ మాణిక్యాలరావు, గ్రామ సర్పంచి మన్నవ నళినీ, మహిళా విభాగం నాయకులు నల్లమాల సౌజన్య, పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవీఎం.సుభానీ, ఎస్సీసెల్ అధ్యక్షులు కుల్లి సూర్యవర్ధనరావు, పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌లు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.