
అన్న క్యాంటీన్ నిర్మాణానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం
తూర్పుగోదావరి, కొత్తపల్లి (పిఠాపురం): ఉప్పాడలోని ప్రయివేటు స్ధలంలో అన్న క్యాంటీన్ నిర్మించేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించడంతో వారం రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ సోమవారం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ దౌర్జన్యంగా శంకుస్ధాపనకు దిగడంతో ఆ స్థల పట్టాదారులు ఎరిపల్లి రాంబాబు, ఎరిపల్లి లక్ష్మణరావు, ఎరిపల్లి తాతారావు, ఎరిపల్లి బాబురావు, ఎరిపల్లి శ్రీనులు ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డులో బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకోవడంతో రాంబాబు స్థానికంగా వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబుతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో అరాచక పాలన సాగుతుందనడానికి ఇదో నిదర్శనమన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటంబ సభ్యులు దోచుకుంటున్నారని, ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఉప్పాడలో ప్రభుత్వ స్థలాలు ఉండగా పట్టాలున్న స్థలంలో అన్న కేంటీన్ కోసం శంకుస్థాపనను పోలీసుల పహారాలో చేయడమేమిటని ప్రశ్నించారు. పట్టాలున్న వ్యక్తులపై నకిలీ పట్టాలని అభియోగం మోపి వారిపై అక్రమంగా కేసులు బనాయించారని విమర్శించారు. దీనిపై బాధితులు కోర్టును కూడా ఆశ్రయించారని, స్టే వస్తుందని చెప్పినా లెక్క చేయకుండా సుమారు 200 మంది పోలీసు బలగాల నడుమ శంకుస్థాçపన చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రౌడీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, శంకుస్థాపన చేసినంత మాత్రాన ఏవిధంగా నిర్మాణం జరుగుతుందో చూస్తామన్నారు. నిర్మాణం జరగకుండా అడ్డకుంటామని, çస్థలం కబ్జా కాకుండా వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, విద్యావేత్త వడిశెట్టి నారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టాలు ఇచ్చిన వారిపై పోలీసు బలగాలను పంపించి భయబ్రాంతులకు గురి చేయడం నిరంకుశ చర్యగా అభివర్ణించారు. మద్దతు పలికిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మైనార్టీ సెల్ నాయకుడు మొహియుద్దీన్, జనసేన పార్టీ నాయకురాలు చల్లా లక్ష్మి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment