దేవగిరి నోట్లో దుమ్ము | TDP Leaders Corruption In Anantapur | Sakshi
Sakshi News home page

దేవగిరి నోట్లో దుమ్ము

Published Sun, Apr 21 2019 8:54 AM | Last Updated on Sun, Apr 21 2019 8:54 AM

TDP Leaders Corruption In Anantapur - Sakshi

దేవగిరి కొండలో బ్లాస్టింగ్‌ ఆపడంతో పాటు  క్రషర్లను మూసివేయాలని  కోరుతున్న రైతులు  

బొమ్మనహాళ్‌ మండలం దేవగిరి గ్రామం.. ఒకవైపు గలగలా పారే హెచ్చెల్సీ కాలువ.. మరోవైపు పచ్చని పంట పొలాలు.. ఎక్కడ చూసినా పనుల్లో నిమగ్నమైన రైతులు.. రైతు కూలీలు.. ఊరు బయటకు వెళ్తే స్వచ్ఛమైన పైరుగాలి.. కరువుకు నిలయమైన జిల్లాలో    నూ అక్కడక్కడా ఇలాంటి పల్లెసీమలు, పల్లె అందాలను, ప్రకృతి సోయగాలు పలకరిస్తాయి. కానీ కొందరు పచ్చనేతలు.. పల్లెపై దుమ్ము చల్లుతున్నారు. నాలుగు రాళ్లకోసం కొండలనే పిండి చేస్తున్నారు. అక్రమంగా క్రషర్లు నడుపుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెVýæబడుతున్నారు. తమ జీవనాధారం పోతోందని రైతులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. పట్టించుకునే వారే లేకుండా పోయారు. 

బొమ్మనహాళ్‌ : అక్రమ సంపాదనకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. అందివచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే సహజ వనరులన్నీ దోచుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు నాలుగు పచ్చనోట్ల కోసం కొండలను పిండిచేసి, పంటలపై దుమ్ము చల్లి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నించే రైతులను అధికారం అండతో భయపెడుతున్నారు. ఇప్పటికే నేమకల్లులో క్రషర్లు ఏర్పాటు చేసి రైతుల బతుకులతో ఆడుకున్న టీడీపీ నేతలు.. అక్కడ నిలిపివేయడంతో దేవగిరికొండపై కన్నేశారు.

లీజు పొందేందుకు ప్రయత్నాలు 
బొమ్మనహాళ్‌ మండలంలోని నేమకల్లు వద్ద ఉన్న క్వారీలు, క్రషర్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మానవహక్కుల సంఘం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రైతుల పొలాలను స్వయంగా పరిశీంచిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. క్వారీలు, క్రషర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడున్న 21, క్వారీలు, 24 క్రషర్‌ యూనిట్లు మూతపడ్డాయి. ఈ కారణంగా కొన్నేళ్ల నుంచి కొండలు పిండి రూ.కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు దేవగిరి కొండపై కన్నేశారు. కొండలీజు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవగిరి సర్వేనంబర్‌ 134లో 47.34 ఎకరాల్లో విస్తరించిన కొండను 20 ఏళ్ల లీజు పొందేందుకు టీడీపీ నేత కాంతరావు దరఖాస్తు చేశారు. బళ్లారిలో స్థిరపడిన ఆయన.. అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నారు.

అనుమతుల్లేకుండానే.. 
గనుల శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వకపోయినా కాంతారావు మాత్రం దేవగిరి కొండపై క్రషర్లు ఏర్పాటు చేసేశారు. మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని కొండల్లో బాస్లింగ్‌ చేపడుతున్నారు. దీంతో రైతులంతా కలిసి టీడీపీ నేత కాంతారావు వద్దకు వెళ్లి బ్లాస్టింగ్‌ ఆపాలని కోరగా.. సదరు నేత వారిపై దాడులు చేయించాడు. అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి క్రషర్‌ నడుపుతున్నానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని రైతులను భయపెడుతున్నాడు. పైగా తన అనుచరులను అక్కడ నిత్యం కాపలా ఉంచి స్థానికులను భయపెడుతున్నాడు. అందుకే అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు.
 
పంటలు నాశనం.. ఆరోగ్యాలపై ప్రభావం 
దేవగిరికొండ చుట్టూ కిలోమీటర్‌ దూరం వరకు సుమారు 50 మంది చిన్న, సన్నకారు రైతులు పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాగే కొండపక్కనే 50 మీటర్ల దూరంలో ఇట్టప్ప స్వామి, ఆంజనేయస్వామి దేవాయాలు ఉన్నాయి. కొండపై బ్లాస్టింగ్‌ సమయంలో ఎగిరి పడుతున్న పెద్దపెద్ద రాళ్లతో పొలాల్లో పనిచేసుకోవడం ఇబ్బందిగా మారింది. పేలుడు సమయంలో భూమి కంపిస్తుండడంతో చాలా మోటార్లు బోర్లలో ఇరుక్కుపోయాయి. సమీపంలోని దేవాలయాల నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంకోవైపు బ్లాస్టింగ్, కంక్రర క్రషింగ్‌ సమయంలో వస్తున్న దుమ్ము పంటపొలాలపై పడుతుండటంతో అవన్నీ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. క్రషర్‌ వల్ల వస్తున్న దుమ్ము, ధూళికి బండూరు, దేవగిరి గ్రామాల్లోని ఎందరో చిన్నారులు రోగాల పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
పట్టించుకోని అధికారులు 
అనుమతులు లేకుండా.. ప్రజాభిప్రాయ సేకరణే జరపకుండా... పరిసర ప్రాంత రైతులతో సంబంధం లేకుండా స్థానిక సర్వేయర్లు, వీఆర్‌ఓలు, ఆర్‌ఐలతో సాయంతో టీడీపీ నేత కాంతారావు దేవగిరికొండపై బ్లాస్టింగ్‌లు చేపట్టారు. అంతేకాకుండా దేవగిరి–బండూరు గ్రామాల మధ్య ఒక పెద్ద క్రషర్, మరొక మొబైల్‌ క్రషన్‌ను ఏర్పాటు చేసి నిరంతరాయంగా కొండలను పిండిచేస్తూ రోజుకు 100 నుంచి 150 టిప్పర్లు మేర కంకరను కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. దీంతో దేవగిరి, బండూరు గ్రామాలకు చెందిన రైతులు అనుమతుల్లేకుండా ఏర్పాటైన క్రషర్‌ను మూసివేసేలా చూడాలని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు. బొమ్మనహాళ్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాలు కూడా చేశారు. అయినా అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రోజూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ముందు నుంచే టిప్పుర్లు కంకరను వేసుకుని బళ్లారికి వెళ్తున్నా.. పోలీసులూ పట్టించుకోకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement