శ్రీనివాసరావు రెండోసారి కస్టడీపై సిట్‌ దొంగాట! | TDP Leaders Direction and SIT Action | Sakshi
Sakshi News home page

అంతా ‘సిట్‌’రైట్‌

Published Thu, Nov 15 2018 5:06 AM | Last Updated on Thu, Nov 15 2018 1:54 PM

TDP Leaders Direction and SIT Action  - Sakshi

నిందితుడిని మరోసారి విచారించేందుకు పోలీసులు సరైన కారణాలు చూపలేదని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నిందితుడు శ్రీనివాసరావు నుంచి ఇంకా ఏ వాస్తవాలు తెలుసుకోవాలని భావిస్తున్నారో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అతని నుంచి సేకరించే సమాచారంతో ఇంకా విచారించాల్సిన సాక్షులు ఎవరో కూడా వెల్లడించలేదు. అతనికి కస్టడి పొడిగించాల్సిన అవసరం ఏమిటో కూడా పోలీసులు సరైన కారణాలు చూపలేకపోయారు. దర్యాప్తు అధికారులు సరైన కారణాలు చూపితేగానీ కస్టడీ పొడిగించలేం’  
– విశాఖపట్నం న్యాయస్థానం

ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కస్టడి పొడిగించేందుకు పోలీసులు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఆ ప్రాతిపదికనే అతని కస్టడీ పొడిగింపును న్యాయస్థానం తిరస్కరించింది. కష్టడీ పిటిషన్‌ను ఏ కారణాల వల్ల నిరాకరిస్తుందో ఆ అంశాలను కోర్టు తెలిపింది. సాధారణంగా కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి పోలీసులు మరలా పిటిషన్‌ వేయాలి. కానీ ఈ కేసులో పోలీసులు ఆపని చేయలేదు. దీన్నిబట్టి చూస్తే కావాలనే పోలీసులు కష్టడీకి తిరిగి పిటిషన్‌ వేయలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  సహేతుకమైన కారణాలను పోలీసులు వివరించి ఉంటే న్యాయస్థానం కస్టడీకి సమ్మతించి ఉండేదని న్యాయ నిపుణులు చెబుతుండటం గమనార్హం. అంటే శ్రీనివాసరావును మరోసారి కస్టడీలోకి తీసుకుని ఈ కేసులో అసలు కుట్ర కోణాన్నిఛేదించే ఉద్దేశం పోలీసులకు లేదని స్పష్టమవుతోంది. ఈ కుట్రలో తెరవెనుక పెద్దలు, అసలు కుట్రదారుల పాత్ర బయటకు రాకుండా పోలీసులే విచారణను పక్కదారి పట్టించారన్నది తేటతెల్లమవుతోంది. 

పూర్తిగా విచారించే ఉద్దేశంలేని సిట్‌
ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా సిట్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిని లోతుగా, నిశితంగా విచారిస్తే అసలు కుట్ర బట్టబయలవుతుంది. అందుకే ఇలాంటి కేసుల్లో నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు రెండుమూడుసార్లు కస్టడీ కోరతారు. కస్టడీ పొడిగించేందుకు అనుమతించాల్సిందిగా  సహేతుకమైన కారణాలను కూడా కోర్టుకు వివరిస్తారు. కాని సిట్‌ పోలీసులు ఆ ప్రమాణాలను పాటించకుండా తూతూ మంత్రంగా కస్టడీ పొడిగింపు పిటిషన్‌ వేశారు. దాంతో కస్టడియే అవసరం లేదని న్యాయస్థానం భావించి ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 

ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటూ....
వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా సిట్‌ అధికారులు మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆడమన్నట్టు ఆడుతున్నారు. నిందితుని కస్టడీ పొడిగించి విచారిస్తే ఈ కుట్రలో సూత్రధారుల పాత్రలు బయటపడే అవకాశముందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే అసలు కస్టడి పొడిగింపే వద్దని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. తద్వారా ఈ కేసు విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, కొన్ని రోజులకు కేసును పూర్తిగా నీరుగార్చాలన్నది వారి వ్యూహం. అందుకే తూతూ మంత్రంగా పిటిషన్‌ వేసి చేతులు దులుపుకున్నారు. పోలీసులు అంత ఉదాసీనంగా ఉండటాన్ని న్యాయస్థానం ప్రస్తావిస్తూ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను తిరస్కరించింది. తమకు కావల్సింది కూడా అదేనని ప్రభుత్వ పెద్దలు ఇటు పోలీసులు మిన్నుకుండిపోయారు.

కస్టడీ పిటిషన్‌లోనే కాదు ఈ కేసులో మొదటి నుంచీ కూడా సిట్‌ అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే చేస్తున్నారు. హత్యాయత్నం కేసు రిమాండ్‌ రిపోర్టులో కుట్ర కోణాన్ని 120బి సెక్షన్‌ను పొందుపరచలేదు. నిందితుడు శ్రీనివాసరావుకు నిబంధనలకు విరుద్ధంగా విశాఖ విమానాశ్రయంలో ఆశ్రయం కల్పించిన టీడీపీ నేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరిను పిలిపించి తూతూ మంత్రంగా మాట్లాడి పంపించేశారు. హత్యాయత్నానికి మార్గం సుగమం చేసిన అతన్ని అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించకపోవడం విస్మయపరుస్తోంది. ఇక నిందితుడు శ్రీనివాసరావును అయినా పూర్తిస్థాయిలో విచారిస్తారా... అంటే అదీ లేదు. ఆరురోజుల కస్టడి సమయంలో పోలీసులే హైడ్రామా నడిపారు. ప్రభుత్వ పెద్దలు కోరుకున్నట్లుగా శ్రీనివాసరావును మీడియాతో మాట్లాడించేందుకు అనారోగ్యం పేరిట అతన్ని కింగ్‌జార్జ్‌ ఆసుపత్రికి తీసుకువచ్చి డ్రామా రక్తికట్టించారు. ఆ తరువాత ఇక అతన్ని సరైన రీతిలో విచారింకుండానే కస్టడీ గడువు ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement