పిఠాపురంలో పచ్చ ముఠా | tdp leaders eye on pitapuram venugpala swamy temple assets | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో పచ్చ ముఠా

Published Mon, Feb 19 2018 2:10 PM | Last Updated on Mon, Feb 19 2018 2:10 PM

tdp leaders eye on pitapuram venugpala swamy temple assets  - Sakshi

పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం

పిఠాపురంలో ‘పచ్చ’ ముఠా తయారైంది. నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని మూలాలు ఆ ముఠా నాయకుడి వద్దే ఉంటాయి. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా... యథారాజా తథాప్రజా’ అన్నట్టుగా ఆ నేత అనుయాయులు మరింత రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో పర్సంటేజీల దందా ఎలా ఉన్నా ఆ ముఠా కన్ను తాజాగా సంస్థానంపై పడడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేత అనుయాయులు అడ్డొచ్చిన అధికారుల్ని, మాట వినని ఉద్యోగుల్ని బలి పశువులుగా చేసి వికటాట్టహాసం చేస్తున్నారు. తాజాగా చోటుచేసుకున్న సంస్థానం వివాదం చూస్తే గుడి, గుడిలోని దేవుడిని మింగేసేందుకు పథక రచన చేసినట్టు స్పష్టమవుతోంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ  : దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటైన శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థానంగా పిఠాపురం ప్రసిద్ధి. ఇక్కడి వేణుగోపాలస్వామి గుడి వీధిలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని సజ్జనగడ రామస్వామీజీ ఆధ్వర్యంలో 1998 నుంచి నిర్వహిస్తున్నారు. ఇక్కడకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తూంటారు. రాఖీ పౌర్ణమి, దత్త జయంతి రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ సంస్థానానికి సుమారు రూ.250 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇక్కడ నిత్యాన్నదానం, ఉచిత వసతి సౌకర్యాలు కల్పించారు. కొందరు ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.

సంస్థానంపై నేతల కన్ను
2015లో పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో రూ.30 లక్షలతో పిల్లల వార్డు నిర్మాణానికి ట్రస్టు ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఆ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాతే సీన్‌ మారిపోయింది. ముఠా నాయకుడు చక్రం తిప్పాడు. మందీ మార్బలంతో రంగంలోకి దిగాడు. ట్రస్టును తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, తద్వారా నిధులు దారి మళ్లించడానికి వ్యూహరచన చేశారు. నిర్మాణ పనులు తామే చేపడతామని, నిధులు తమకిచ్చేయాలని ఒత్తిళ్లకు దిగారు. వారి ఎత్తుగడలను ట్రస్టు సభ్యులు వ్యతిరేకించారు. తమ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేస్తామంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకేముంది! ముఠాకు చిర్రెత్తుకొచ్చింది. తమ గుప్పెట్లోకి రాకుండా అడ్డుకుంటారా? అంటూ కుట్రలకు తెరలేపారు.

తమ్ముళ్ల ఆధ్వర్యంలో అక్కడ పలు ఆందోళనలు చేసి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేశారు. చివరకు ముఠా నాయకుడు తెరవెనుక ఉండి మరో కమిటీ ఏర్పాటు చేసి తన అనుచరులు సంస్థానంలో పాగా వేసేలా పావులు కదిపాడు. అనంతరం లోపాయికారీగా భారీగా నిధులు పక్కదారి పట్టిస్తూ వచ్చారు. వీటిలో ఎక్కువ మొత్తంలో వాటాలు ముఠా నాయకుడికి వెళ్లేవి. జన్మభూమి గ్రామ సభలకు, ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమాలకు ఇక్కడి భోజనాలను ప్రసాదాలుగా పంపించేవారు. ఇంతలో ట్రస్టు సభ్యులకు, ముఠా నాయకుడికి  వాటాల పంపకంలో తేడాలు వచ్చాయి. దీంతోపాటు కొందరు స్థానికులు సంస్థానంలో ‘పచ్చ’ నేతల అవినీతిపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌ 26న సంస్థానాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది.

అంతటితో ఆగలేదు
సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నాక పాదగయ ఈవో చందక దారబాబుకు సంస్థానం బాధ్యతలు అప్పగించారు. ఆయన ద్వారా ఆ ముఠా నేత అక్కడి ఆస్తుల వివరాలు తెలుసుకుని, వాటిపై కన్నేసి, వెనుక నుంచి పావులు కదిపారు. అన్నీ తాను చూసుకుంటానంటూ కొత్తగా కొందరికి ఉద్యోగాలు వేయించారు. కావాల్సిన వారికి జీతాలు పెంచారు. వాటాల్లో తేడాలు వచ్చిన నేపథ్యంలో తనకు ఎదురు తిరిగినవారిని లొంగదీసుకొనేందుకు.. సంస్థానంలో అవినీతి బయటకు వచ్చేలా చేశారు. ఇందులో భాగంగా అప్పటి ఈవో దారబాబుతో సంస్థానంలోని అవినీతిని బయటపెట్టించారు. సజ్జనగడ స్వామికి తెలియకుండా తెలుగుదేశం నేతలు రాయించుకున్న వీలునామాపై తహసీల్దారు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ చేయించారు. దొంగ వీలునామా రాయించుకున్న వారిపై పోలీసులకు సహితం ఫిర్యాదు చేశారు. సంస్థానానికి సంబంధించిన ఆస్తుల వివరాలు, ఇతర రికార్డులు తన దగ్గర పెట్టుకుని మాట వినని సభ్యులకు ‘చెక్‌’ పెడుతూ, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించారు.

తొమ్మిది నెలల్లో రూ.9 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, దొంగ వీలునామా రాయించుకున్నారని ఆధారాలతో సహా చెబుతూ, అవినీతి చేసినవారిని వదిలిపెట్టేది లేదని ఆ ముఠా నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్టు సభ్యులు దిగివచ్చారు. ఆయనతో మంతనాలు సాగించారు. రూ.కోట్లలో ఒప్పందం కుదుర్చుకుని విచారణ లేకుండా చేయడానికి, సంస్థానం బాధ్యతలను పాదగయ ఈవో నుంచి అన్నవరం ఈవోకు అప్పగించేలా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అనంతరం విచారణను పక్కదోవ పట్టిస్తూ, సంస్థానంలో సిబ్బంది వివరాల సేకరణ, ఇతర కార్యక్రమాలంటూ కాలయాపన చేస్తూనే, అడ్డొచ్చిన అధికారులను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆధారాలతో సహా దొంగ వీలునామా రాయించుకున్నట్లు దొరికినా, ఏవిధమైన విచారణా లేకపోగా, కనీసం ఆ నేతపై కేసులు కూడా నమోదు చేయకుండా, ఉద్యోగుల్ని బలి పశువుల్ని చేస్తూ, ఉన్నత స్థాయి వర్గాలు పబ్బం గడుపుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement