పిఠాపురం శ్రీసంస్థాన సత్రానికి చెందిన భూములలో తవ్వకానికి గురైన గట్లు
గత సర్కార్ అవినీతి వాసనల నుంచి ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు బయట పడలేకపోతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా కోట్లాది రూపాయలు దోచుకున్న‘పచ్చ’నేతలను కాపాడటానికి వీరు వెనుకాడటం లేదు. పారదర్శకత, అవినీతి రహితపాలనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గాలికొదిలేసి కబ్జాదారుల కనుసన్నల్లో కొందరు పనిచేస్తున్నారు. పిఠాపురం శ్రీ సంస్థానం భూములు ఆక్రమణలకు గురైనా దందాదారుల పట్ల వల్లమాలినప్రేమ ఒలకబోస్తున్నారు. ఏకంగా 222 ఎకరాలు టీడీపీ నేతల కబంధహస్తాల్లో చిక్కుకున్నా దేవదాయ శాఖ కుంభకర్ణ నిద్రలో జోగుతోంది.
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: తొండంగి మండలంలో వివిధ దేవస్థానాలు, మఠాలు, సత్రాలకు 2000 ఎకరాలకు పైగా భూములున్నాయి. బాటసారులకు అన్నార్తులకు పట్టెడు అన్నం పెట్టే ఆశయంతో తొండంగిలో 511 ఎకరాలను పిఠాపురం మహారాజా రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పిఠాపురం శ్రీసంస్థానం సత్రానికి ఇచ్చారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో నిత్యాన్నదాన, విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో ఈ భూములు దేవదాయ శాఖకు దఖలుపడ్డాయి. అప్పటి నుంచి ఈ భూముల వేలం దేవదాయ శాఖే నిర్వహిస్తోంది.
మండల కేంద్రం తొండంగిలో 538, 545, 553, 535, 623, 565, 690 తదితరసర్వే నంబర్లలో ఉన్నాయి. 478 ఎకరాలను కౌలుకు ఇస్తున్నారు. ఈ భూముల ద్వారా దేవదాయశాఖకు ఏటా రూ.40 లక్షలు పైనే ఆదాయం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం శ్రీసంస్థానం సత్రానికి 511 ఎకరాలున్నాయి. అధికారులు 469 ఎకరాలకు మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. అంటే శ్రీ సంస్థానానికి చెందిన 42 ఎకరాల ఆచూకీ లభించడం లేదు. 511 ఎకరాల సత్రం భూములకు ఏటా పన్నులు చెల్లిస్తున్న దేవదాయశాఖ వేలం నిర్వహిస్తున్నది. 469 ఎకరాలకే కావడం గమనార్హం.
తొండంగి శ్రీసంస్థానసత్రానికి చెందిన భూములు
ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులే ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అదేమంటే భూములు సమగ్ర సర్వే జరగకపోవడమే కారణమంటూ తప్పించుకుంటున్నారు. పిఠాపురం శ్రీసంస్థానం సత్రానికి ఉన్న తొండంగి మండల పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరా రూ.20 లక్షలు పలుకుతుండేది. గతంలో ఇక్కడ భూములలో ఒక పంట పండేది. పిఠాపురం బ్రాంచి కెనాల్ అందుబాటులోకి రావడంతో చాలా ఏళ్లుగా రెండు పంటలు పండుతున్నాయి. ఇందుకు తోడుగా తొండంగి పరిసర ప్రాంతాల్లో జీఎమ్‌ఆర్ పోర్టు బేస్డ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ రానుండటంతో భూముల విలువ పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.40 లక్షలు పలుకుతోంది. పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూముల్లో కనిపించకుండా పోయిన 42 ఎకరాలను లెక్కలేస్తే రూ.16.80 కోట్లుగా ఉంది.
ఇన్ని కోట్ల విలువైన భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయంటే దేవదాయశాఖ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహించిన తునికి చెందిన యనమల రామకృష్ణుడు అనుచరులు గుప్పెట్లోనే ఉన్నాయి. అప్పట్లో మంత్రి అండదండలుండటంతో తొండంగి మండల టీడీపీ నేతల స్వాధీనంలో ఉన్న ఈ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి వెనుకంజ వేశారు. అంతెందుకు ఈ భూముల్లో మంత్రి యనమల అనుచరులు నాలుగైదేళ్లపాటు విచ్చలవిడిగా జాగీరుగా మట్టి తవ్వేసి లక్షల్లో సొమ్ము చేసుకున్నా నాడు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. కానీ ప్రభుత్వం మారి ఏడు నెలలయింది. అయినా దేవదాయశాఖ ఆ భూముల స్వాధీనానికి చొరవ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఆర్థికపరమైన లావాదేవీలు ఉండటమే కారణమంటున్నారు.
నిర్లక్ష్యంతో మరిన్ని ఎకరాలు కబ్జా
శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈ 42 ఎకరాలకే పరిమితం కాలేదు. గత మార్చి నెలతో గడువు ముగిసినా దేవదాయశాఖ అధికారులు వేలం నిర్వహించకపోవడంతో మరో 180 ఎకరాలు లీజుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేవదాయ భూములకు ప్రతి మూడేళ్లకు వేలం నిర్వహించాలి. కానీ ఆమ్యామ్యాలకు కక్కుర్తిపడ్డ కొందరు అధికారులు కావాలనే వేలం నిర్వహించకపోవడంతో ఆ భూములు కూడా లీజుదారుల స్వాధీనంలో ఉన్నాయి. ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే దేవదాయ చట్టం 78, 79 ప్రకారం నోటీసులు ఇవ్వడం న్యాయపరంగా వెళ్లడం వంటి పెద్ద ప్రహసనమే ఉంది. ఇంతటి అవకాశం ఇవ్వడం వెనుక కొందరి స్వార్థం దాగి ఉందంటున్నారు. ఇలా కబ్జాల్లో ఉన్న పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూములు విలువ లెక్కతీస్తే రూ.66 కోట్లు పైమాటగానే కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులకు చీమకుట్టినట్టయినా లేకపోవడమే విస్మయానికి గురిచేస్తోంది. ఆక్రమణలకు గురైన భూములు, సత్రం పేరుతో సొమ్ములు తినేస్తున్నారంటూ ఇటీవల పిఠాపురం మహరాజా వారసుడు చిన్నరాజా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. కుంభకర్ణ నిద్రలో జోగుతున్న ఆ శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.
‘ఈఓతో మాట్లాడి కార్యాచరణ చూస్తా’
పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూముల కబ్జా విషయం నా దృష్టికి రాలేదు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత శాఖలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. శ్రీ సంస్థానం కార్యనిర్వాహణాధికారితో సంప్రదించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటా. దేవదాయశాఖకు చెందిన సెంటు భూమి కూడా వదిలిపెట్టేది లేదు విచారిస్తాను. దర్భముళ్ల భ్రమరాంబ, రీజనల్ జాయింట్ కమిషనర్, దేవదాయశాఖ.
Comments
Please login to add a commentAdd a comment