పంట చేలపై పడ్డ ఆబోతులా అడ్డూ అదుపూ లేకుండా పచ్చదండు రెచ్చిపోతోంది. అధికారంఅండతో చట్టాలను చట్టుబండలుగా చేసి భూకబ్జాలతో జిల్లావాసులను భయకంపితులను చేస్తోంది. నాలుగేళ్ల తమ అధినేత చంద్రబాబు పాలనా నిర్వాకంతో మళ్లీ అధికారంలోకొచ్చే అవకాశం లేదని అర్థం కావడంతో తమ్ముళ్లు విచక్షణ కోల్పోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అక్రమార్జనలో వేగాన్ని పెంచేశారు. దొరికింది దొరికినట్టుదోచేస్తున్నారు. అడ్డొచ్చేవాళ్లపై ఎదురుదాడులుచేస్తూ, కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా చెలరేగిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. అవి పర్ర భూములా..తీర ప్రాంత భూములా..చెరువులా..గుట్టలా..దేవదాయ భూములా..మఠం భూములా..అసైన్డ్ భూములా.. రోడ్లా.. ప్రైవేటు భూములా.. అని చూడటం లేదు. దొరికితే చాలు చదును చేసేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించేస్తున్నారు. అడ్డొచ్చినోళ్లపై దౌర్జన్యం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు కబ్జాలకు అండగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువైన సుమారు 200 ఎకరాల వరకు ఈ విధంగా ఆక్రమించారు. కళ్ల ముందు ఆక్రమణలు కన్పిస్తున్నా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నమో...రాజీ చేయించడమో తప్ప అధికారులు చేసిందేమీ కన్పించడం లేదు. ఆక్రమణలపై కేసులు కూడా నమోదవుతున్నాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో మచ్చుకు కొన్ని ఆక్రమణలివీ..
∙కాకినాడలోని తూరంగి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 20 ఎకరాలు, కొవ్వూరు రోడ్డులో 1.5 ఎకరాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన స్థలమే అంటూ చివరికి ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును కూడా ధ్వంసం చేశారు. ఆయన అనుచరులు అదే తీరులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గతంలో కాకినాడ మెయిన్‌రోడ్డులో గల జగన్నాథపురం వంతెన సమీపంలోని విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రిరాత్రికి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నించడంతో పాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లెయిన్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు.
తునిలో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. నియోజకవర్గ పరిధిలో 84 ఎకరాల వరకు కబ్జా చేసేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు అండ, ప్రోద్బలంతో ఆక్రమణలకు పాల్పడ్డారు. పోలీసు క్వార్టర్స్ భూమిని సైతం ఆక్రమించారు. దీని ఒక్కదాని విలువే రూ.10 కోట్ల వరకు ఉంటుంది. తొండంగిలోని మఠం భూములను సైతం కబ్జా చేశారు. 80 ఎకరాల మేర ఆన్‌లైన్‌లో రికార్డులు మార్చేసి పాగా వేశారు. వీటి విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
సీఆర్‌జెడ్ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో వందల ఎకరాల పర్రభూమిని అమలాపురం టీడీపీ నేతలు ఆక్రమించేశారు. మడ అడవులను, సహజ సిద్ధంగా ఏర్పడిన భూములను ధ్వంసం చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఆక్వా చెరువుల కోసం కబ్జా చేసి తవ్వేశారు. అమలాపురం మున్సిపాల్టీలోనైతే ఖాళీ స్థలం కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. చెరువులు, డ్రెయిన్ల మురుగునీటి కోసం ఉన్న స్థలాలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా బంగారక్క, తామరచెరువు, గరిగుంట చెరువు స్థలాలను ఆక్రమించి, దర్జాగా కట్టడాలు చేపట్టారు.
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని అమీనాబాద్ శివారు ఉప్పుటేరు స్థలాన్ని టీడీపీ నేత బందన రాంబాబు ఆక్రమించారు. హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత ఆక్రమణలు తొలగించారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అండదండలతో టీడీపీ నాయకులు భూకబ్జాలు యథేచ్ఛగా చేస్తున్నారు. రమణయ్యపేట, రాయుడుపాలెం, తూరంగి, సర్పవరం, సూర్యారావుపేట, కొవ్వాడ, తిమ్మాపురం, చీడిగ, ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, కొవ్వూరు. కరప తదితర ప్రాంతాల్లో పంచాయతీలకు చెందిన స్థలాలను కబ్జా చేసేసి ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు. సర్పవరంలో దేవాదాయశాఖకు చెందిన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించారు. తూరంగిలో ప్రభుత్వ పాఠశాలను ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
∙అధికార పార్టీ నేతల అండతో మండపేట ప్రధాన రహదారిలోని ఏడిద రోడ్డు జంక్షన్ వద్ద కోటి రూపాయల విలువైన భూమి ఆక్రమణకు గురైంది. మండపేటలోని కేశవరంలోని రాతేలుగుంట చెరువును టీడీపీ నేత కబ్జా చేశాడు. 2.38 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో సగానికి పైగా భాగాన్ని చదును చేసి సాగు భూమిగా మార్చేశాడు. పాడే చెరువు గుంట కూడా ఆక్రమణకు గురైంది. స్థానిక టీడీపీ నేత 42 సెంట్లు మేర కబ్జా చేసి స్వరూపాన్ని మార్చేశాడు. ద్వారపూడిలోని సతివాని చెరువులో 1.5 ఎకరాలకు పైగా చెరువు గర్బాన్ని అధికార పార్టీ నేత బంధువు ఆక్రమించి, తన భూముల్లో కలిపేసుకున్నాడు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని వేమగిరిలో టీడీపీ నేత వెలుగుబంటి వెంకటాచలం కంకరగుట్టను, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దర్జాగా గ్రావెల్ తవ్వకాలు జరిపారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో బా«ధ్యుడిపై నాలుగు కేసులు పెట్టడమే కాకుండా రూ. 8.61 కోట్లు రికవరీకి అధికారులు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment