ఉట్టికెక్కలేనమ్మ..!
ఉట్టికెక్కలేనమ్మ..!
Published Sat, Feb 22 2014 1:55 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితేంటో అంతుబట్టక ఆ పార్టీ అధినేత కొట్టుమిట్టాడుతున్నారట. రాబోయే కాలంలో కాబోయే మహానాయకుడినని ప్రచారం చేసుకుంటే తప్ప తన వెంట ఎవరూ రారని గ్రహించి ఈ మధ్య కాలంలో ఏకంగా ప్రధాని పీఠం తనదేనని చెప్పడం ప్రారంభించారట. ఢిల్లీలో మనమే గద్దెనెక్కబోతున్నామని చెప్పడంతో పార్టీ నాయకుడొకరు ఒక్కసారిగా బిత్తరపోయారట. మనవద్ద సరుకు ఉందంటేనే ఎవరైనా ముందుకొస్తారు.
అసలు సరుకే లేదని తెలిస్తే మనవెంట ఎవరొస్తారని మరో సీనియర్ నేత సముదాయించారట. కొంచెం అర్థమయ్యేట్టు చెప్పమని కోరితే.. ఇప్పుడు పబ్లిక్‌లో టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప నెట్టుకురాలేం. పొత్తులు కూడా ఈజీ కాదు. మనవెంట రావడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మనతో పొత్తంటేనే బీజేపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. తానే ఎన్డీఏ కన్వీనర్‌ను అవుతానని, తర్వాత ప్రధాని నేనే అవుతానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడంలోని కిటుకు అదే మరి.
మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆ నిర్ణయం పట్ల బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని, పైగా మోడీ అంటే మిగిలిన పక్షాలు కలిసొచ్చే అవకాశాలేమాత్రం లేవని బాబు చెబుతున్నారంటే అర్థం చేసుకోవాలి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి సుమారు 200 నుంచి 220 సీట్లు వస్తే తప్ప మోడీని భాగస్వామ్య పక్షాలన్నీ ప్రధాని అభ్యర్థిగా అంగీకరించవనీ, అలాంటప్పుడు అందరూ మొదట అద్వానీ పేరు సూచిస్తారట.
అయితే అద్వానీకి వయస్సు పైబడింది. ఆయనను అంగీకరించరట. పైగా ఎన్‌డీఏకు అవసరమైన బలాన్ని సమీకరించే శక్తి ఉన్న నేత కోసం చూస్తారు. అప్పుడందరూ బాబునే ఎన్‌డీఏ కన్వీనర్‌గా.. ఆ తర్వాత ప్రధానిగా ఎన్నుకుంటారట. ఈ మధ్య కాలంలో ఓ ఆంగ్ల పత్రికలో కూడా రాయించుకున్నారు చూడలేదా...! అంటూ సీనియర్ నేత మొత్తం విడమరిచారు!
Advertisement