
విశాఖ పెను భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు కాదు.. ఆ ప్రకృతిలో భాగమైన భూమాతను చెరబట్టేందుకు రాజకీయ బేహారాలు సృష్టించిన భూదందాల విలయం. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన, దేవాదాయ భూములు, మాజీ సైనికులకు ఇచ్చే స్థలాలు.. ఇలా దేన్నీ వదల్లేదు. వాటి అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. అధికారులనూ పావులను చేసేశారు. అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. గ్రామ సచివాలయం మొదలుకొని తహసీల్దార్ కార్యాలయం వరకు అంతా కుమ్మకై కబ్జాకాండ కొనసాగించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భూదోపిడీకి పాల్పడ్డారు. ఈ దారుణాలతో మహా విశాఖ ప్రతిష్ట మసకబారింది. టీడీపీ అధికారంలోకొచ్చిన దరిమిలా భూదోపిడీకి బీజం పడింది.
విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని బీరాలు పలికిన అధికార పార్టీ ప్రముఖులు.. భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు.
ముఖ్యనేత సహకారం.. చినబాబు ప్రత్యక్ష ప్రమేయంతో నగరానికి ఈ చివర.. ఆ చివరే కాదు.. జిల్లాలో ఖాళీ భూములున్న చోటల్లా పాగా వేశారు. రికార్డులు తారుమారు చేయడం.. సాధ్యం కాకపోతే బలవంతంగా లాక్కోవడం.. ఇదీ వారి దందా.. ల్యాండ్ పూలింగ్ ముసుగు కూడా ఈ మాఫియా ఆగడాలను బాగా కవర్ చేసింది.
పూలింగ్ భూములు పోతాయని బడుగు జనాలను బెదిరించడం.. కారుచౌకగా వారి భూములను లాక్కోవడం.. తిరిగి వాటినే ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దండుకున్నారు.
ప్రధానంగా భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పెందుర్తి మండలాల్లో ఇలాంటి భూ మాఫియా అక్రమాలు కోకొల్లలు.. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బు బదిలీ అయినంత ఈజీగా భూ రికార్డులు మారిపోయాయి. పచ్చిగా చెప్పాలంటే..రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే..అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి.. ఇది నాది అని దబాయించే దారుణ పరిస్థితులు నగర శివార్లలో రాజ్యమేలుతున్నాయి.
సాక్షి వరుస కధనాలతో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం భూకుంభకోణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో భూ బకాసురులందరూ టీడీపీనేతలేనని తేలింది. వేల కోట్ల విలువైన భూములను బొక్కేశారని నిర్థారణైంది.. అందుకే ఆ నివేదిక వెలుగు చూడలేదు. ప్రభుత్వం సిట్ నివేదికను తొక్కిపెట్టేయొచ్చు.. కబ్జారాయుళ్ళను కాపాడేయొచ్చు.. కానీ సాక్షి పట్టువీడకుండా జిల్లావ్యాప్తంగా భూమాఫియా దందాలపై మరింత లోతుగా పరిశీలించి.. అందిస్తున్న సమగ్ర కథనాలు..
సాక్షి, విశాఖపట్నం :రాష్ట్రవిభజన తర్వాత నవ్యాంధ్రకు రెండోరాజధానిగా విశాఖ నగరం గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న మహానగరం. సువిశాలమైన సాగరతీరం..ఎటు చూసినా కొండలు..లోయలు..పర్యాటక ప్రాంతాలతో విరాజిల్లుతున్న ఉత్తరాంధ్ర ముఖ ద్వారం. అలాంటి ఈ జిల్లా భూకబ్జా రాయుళ్లకు అడ్డాగా మారిపోయింది. పచ్చతోలు కప్పుకున్న అధికార పార్టీ నేతలు..గత నాలుగేళ్లుగా మేకవన్నె పులుల్లా.. తెగబడి పోయారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తూ.. వేల ఎకరాలను స్వాహా చేశారు. ఓటేసిన వారికి వెన్నుపోటు పొడిచి వారి ఆస్తులను లాక్కొన్నారు..అందిన కాడకు దోచుకున్నారు.
ముదపాక రైతును మభ్యపెట్టి...
‘త్వరలో ప్రభుత్వం మీ భూములను లాక్కుంటుంది. అప్పుడు ఎకరాకు రూ.2 లక్షలకు మించి ఇవ్వరు. అదే మా సార్‌కి ఆ భూములు ఇచ్చేస్తే రూ.10లక్షలు ఇస్తారని’ పెందుర్తి మండలం ముదపాక రైతులను మభ్యపెట్టారు. దీంతో అయోమయానికి గురైన రైతులు బినామీలు చెప్పినట్లే అడ్వాన్స్ కింద రూ.లక్ష, రెండు లక్షల చొప్పున తీసుకుని వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేశారు. దాదాపు 320 పట్టాలను ఇలా తెగనమ్ముకున్నారు. ఇంకా రైతుల వద్ద మిగిలిపోయిన పట్టాలను చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉండగా కుట్రను పసిగట్టిన గోవిందపురం రైతులు ఒక్కసారిగా తిరగబడడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఇందులో రాష్ట్రస్థాయి ప్రభుత్వ పెద్దలతో పాటు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు బడాబాబులకు సాయం చేసినట్టు నేటికీ బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. బండారు వారిపైనే కేసులు పెట్టించడంతో రైతులు చేస్తున్న ఆరోపణలు నిజమే అని స్పష్టం అవుతుంది.
మాజీ సైనికుల పేరిటదోచేశారు
మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు,రాజకీయ బాధితుల పేరిట జిల్లాలో గతపదిహేనేళ్లలో పంపిణీ చేసిన 312 ఎకరాల్లో సుమారు 250 ఎకరాలు నకిలీ ఎన్‌వోసీలను అడ్డంపెట్టుకుని అనర్హులకు కేటాయింపులు జరిపినట్టు అంచనా వేస్తున్నారు. జారీ చేసిన 69 ఎన్‌వోసీల్లో 75 శాతం నకిలీవేనని తేలింది. సుమారు 50కు పైగా అనర్హులకే భూ కేటాయింపులు జరిపినట్టుగా సిట్ దర్యాప్తులో సైతం గుర్తించింది. మధురవాడ సర్వే నెం.331/3లో 5ఎకరాల భూమిని నగరానికి చెందిన ఓరుగంటి సీతారత్నం 2001లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా రికార్డుల్లో చూపించి పట్టాదారు పాస్ పుస్తకాలను, టైటిల్ డీడ్‌ను పొందారు. సర్వే నెం.331/4 లో ఓరుగంటి నరేష్ కూడా 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా రెవెన్యూనుంచి హక్కు పత్రాలు పొందారు. కానీ 2004లో జారీ చేసిన ఎసైన్‌మెంట్‌లో సర్వే నెం. 331/3, 331/4లో ఒక్క సెంటు కూడా స్వాతంత్య్ర సమర యోధులకు కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ జారీ చేసినట్టుగా పేర్కొనలేదు. దిగుమర్తి కుటుంబీకుల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుని హక్కులు పొందినట్టుగా పేర్కొన్న డాక్యుమెంట్లు సరైనవి కావనీ అప్పటి కలెక్టర్ సంజయ్ కుమార్ ప్రాథమికంగా గుర్తించారు. కానీ రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని తమపై జరిపిన దర్యాప్తు నివేదికను బయటకు రానీయకుండా ఓరుగంటి కుటుంబీకులు జాగ్రత్త పడ్డారని విమర్శలు విన్పించాయి.
సంస్థాన భూములనూ వదల్లేదు
గోడే సంస్థాన భూములను చుక్కల భూముల పేరిట స్వాహా చేస్తున్నారు. గాజువాక, అనకాపల్లి, మునగపాక, భరణికం, కారుప్రోలు, గోడిచెర్ల, నక్కపల్లి, శ్రీరాంపురం, చీపురుపల్లి, షేర్ మహ్మద్‌పురం ప్రాంతాలు ప్రొప్రైటరీ ఏస్టేట్లుగా గుర్తింపుపొందాయి. చుక్కల భూములుగా నమోదైన గోడేవారి సంస్థాన భూములను ప్రభుత్వం తమవిగా రికార్డుల్లో నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ భూములపై జిల్లాకు చెందిన ఓ మంత్రి, కర్నూలుకు చెందిన మరో మంత్రి కన్నేశారు.
వక్ఫ్ భూములూ కాజేశారు
జిల్లాలో 7,860 ఎకరాల్లో 2,558.20 ఎకరాల భూములను ఎన్టీపీసీ కోసం ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నుంచి సేకరించింది. మరో 40.05 ఎకరాలను ఏలేరు లె‹ఫ్ట్ కెనాల్ విస్తరణ కోసం తీసుకున్నారు. 5,261.75 ఎకరాల్లో 2072 ఎకరాల భూములు ప్రభుత్వం వివిధ అవసరాల కోసం కాజేయగా, 2,226 ఎకరాల భూములు భూబకాసురులు కబ్జా చేశారు. ఆక్రమణకు గురైన భూముల విలువ రూ.2వేల కోట్లకు పైమాటే. వీటిలో సగానికి పైగా భూములు టీడీపీ నాయకులు కబ్జా చేసినవే. ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు అధీనంలో కేవలం 802.54ఎకరాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా భీమిలి మండలం టి.నగరపాలెంలో 6.50 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. 2.36 ఎకరాల రికార్డులు టాంపరింగ్‌కు గురికాగా, 4 ఎకరాలకు çసస్పెండ్‌కు గురైన తహశీల్దార్ రామారావు స్థానిక టీడీపీ నేతల ప్రోద్భలంతో కొంతమంది పేరిట పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేశారు. కశింకోట, పెదగంట్యాడ ప్రాంతాల్లో కూడా మరో 15 ఎకరాల వరకు రికార్డులు టాంపర్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ భూముల విలువ రూ.125 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఎసైన్డ్ భూములకు ఎసరు
ఎన్‌ఏవోబీ, ఐఐఎం, పెట్రో,మెరైన్ యూనివర్సిటీలు, పీసీపీఐఆర్, ఇండస్ట్రియల్ పార్కులు, పరిశ్రమలు ఇతర అవసరాల కోసం గడిచిన పదేళ్లలో 10వేల ఎకరాలకు పైగా ప్రభుత్వమే సేకరించగా.. ఐదు వేల ఎకరాల ఎసైన్డ్ భూములు గడిచిన నాలుగేళ్లలో కబ్జా చేశారని తెలుస్తోంది. పెందుర్తి మండలం ముదుపాక,నక్కపల్లి మండలం పెదగొడ్డుపల్లిలో 700ఎకరాలకుపైగా ఎసైన్డ్ భూములను చంద్రబాబు తనయుడు లోకేష్ జిల్లా మంత్రి తనయుడు, ఓ ఎమ్మెల్యేతో కలిసి కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసి సర్వే చేయిస్తున్నారు.
భూదాన భూములు చాపచుట్టేశారు
జిల్లావ్యాప్తంగా రికార్డుల ప్రకారం 264.90 ఎకరాల భూదాన భూముల్లో 20.91 ఎకరాలు వెట్, 243.99 ఎకరాలు డ్రై ల్యాండ్స్‌గా రికార్డుల్లో ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 65ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. సబ్బవరం మండలం దొంగలమర్రి సీతారాంపురంలో సర్వే నెంబర్ 1549లో 52.38 ఎకరాలు వివాదంలో కోర్టులో నలుగుతోంది. ఇక మిగిలిన భూముల్లో విశాఖ రూరల్ మండలం పరదేశిపాలెంలో సర్వే నెంబర్ 132లో 50.56 ఎకరాలతో పాటు విశాఖపట్నం అర్బన్ మండల పరిధిలోని మాధవదారలో సర్వేనెం: 66/1లో ఉన్న 15.45 ఎకరాల్లో 10 ఎకరాలు, గాజువాక మండలం అగనంపూడిలో సర్వే నెం:56/ఏ, బిలలో ఉన్న 20 ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. మిగిలిన భూములన్నీ టీడీపీ నేతల ప్రోద్భలంతో కబ్జాకు గురైనవే.
ఇనాం భూములను మడతెట్టేశారు
ఇనాం భూములను మడతెట్టేశారు. ఈ భూములన్నీ విజయనగరం సంస్థానం రైతులు, వివిధ వర్గాలకు నజరానాగా రాసిచ్చినవే. సింహాచలం దేవస్థానం పరిధిలోనివి మినహాయిస్తే విశాఖ పరిసర మండలాల్లో సుమారు 1500 ఎకరాలకు పైగా ఇనాం భూములు ఉన్నట్టు అంచనా. రైతుల చేతుల్లో ఉన్న ఈ భూములు గడిచిన పదేళ్లలో చేతులు మారిపోయాయి. వివాదం ఆర్డీవో కోర్టులో ఉండగానే 2015లో వెబ్‌ల్యాండ్‌లో పేర్లు సైతం మార్చేశారు. ఇనాం వారసులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఆర్డీవో వెంకటేశ్వర్లు ఆర్నెళ్లు తిరక్కుండానే వారి అప్పీల్‌ను తిరస్కరించినట్టుగా ఆదేశాలు ఇచ్చారు.
దేవుళ్లకు శఠగోపం
దేవదాయ, ధర్మాదాయ శాఖ భూములను కూడా వదల్లేదు. జిల్లాలో 6ఏ పరిధిలోకి వచ్చే ఆలయాలు 976 ఉన్నాయి. దాతల ఉదారత కారణంగా 23,920.77 ఎకరాలుంటే.. వాటిలో 5350.24 ఎకరాలు పల్లం, 18,570.53 ఎకరాల మెట్ట భూములున్నాయి. వీటిలో అర్చక, సర్వీసుదారుల అధీనంలో 702.21 కోట్లుండగా, కొండ, అటవీ ప్రాంతాల్లో 5996.70 ఎకరాలున్నాయి. లీజులో 5179.37 ఎకరాలుంటే..ఆక్రమణల్లో 8041.58 ఎకరాలున్నాయి. వీటిలో టీడీపీ నేతల కబందహస్తాల్లో ఉన్నవే అత్యధికం. సింహాచలంతో పాటు ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దేవాదాయ శాఖ భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతమమైపోయాయి.
మంత్రులు, వారి అనుచరులభూ దందాలు
మంత్రిగంటా శ్రీనివాసరావు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా భీమిలి సాగరతీరంలో ప్యాలస్ నిర్మించుకున్నాడు. గంటా సమీప బంధువైన పరుచూరి భాస్కరరావు పద్మనాభం మండలం కృష్ణాపురంలో 20 ఎకరాల డీ పట్టా భూములతో పాటు ఆనందపురంలో 11.34 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశారు. గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ భీమిలిలో ఎస్సీలకు ఇచ్చిన 50 ఎకరాల ఎసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేశాడు. మరో అనుచరుడు ఎన్.స్వామి సర్వే నెం.294లో 3.76 ఎకరాలు, సర్వే నెం.294/2లో 4.40 ఎకరాలు ఆక్రమించుకుని షెడ్లు వేయిస్తున్నాడు. మరో అనుచరుడు పద్మనాభం మండల టీడీపీ అధ్యక్షుడు సూరిశెట్టి అప్పారావు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి 130 ఎకరాల ఇనాం భూములను చక్కబెట్టేశాడు. అరకులోయ పోలీస్ స్టేషన్ ఎదురుగా బ్లాక్ డిలో ప్లాట్ నెంబర్ 38లో 1.86 ఎకరాల ఆర్‌అండ్‌బీ విశాఖకు చెందిన భూమిలో 30 సెంట్ల స్థలాన్ని రాజులమ్మ అనే బినామీ పేరిట రాష్ట్ర ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తి చేజిక్కించుకున్నారు.
ఎమ్మెల్యేల భూకబ్జాలు
అనకాపల్లి ఆవకండంలో 55 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీని వెనుక అనకాపల్లి పీలా గోవింద్ ఉన్నారని చెబుతున్నారు. అనకాపల్లి మండలం శారదా కాలనీలో చిన్నంనాయుడు అనే దివ్యాంగుడికి చెందిన 1.12 ఎకరాల స్థలాన్ని వివాదంలో పడేశారు. న్యాయం చేయమని కోరితే..రూ.8కోట్ల విలువైన ఆ భూమిని కేవలం రూ.1.50కోట్ల ఒప్పందంతో సొంతం చేసుకున్నారు. కనీసం ఆ మొత్తం కూడా ఇవ్వకుండా బా«ధితుడ్ని మూడేళ్లుగా తిప్పించుకోవడమే కాదు.. బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. భీమిలి బీచ్‌రోడ్‌లో రామానాయుడు స్టూడియో దిగువన మాజీ సైనికులకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీత భర్త శ్రీనివాసరావు, మంత్రిగంటా అల్లుడి పేర్లతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సర్వే నెం.9లో 15 ఎకరాల సింగరాయమెట్ట చెరువు పూర్తిగా ఆక్రమించేశారు. విశాఖ తూర్పు పరిధిలో ఉన్న సర్వే నెం.19/2లో ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న సాధుమఠంపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుల ద్వారా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ భూముల విలువ రూ.100కోట్ల పైమాటే. గాజువాకలో రికార్డుల టాంపరింగ్ పేరుతో 42 సెంట్ల భూమిని 1బీలో జిరాయితీగా మార్చి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు అనుచరులు సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు అరుకులోయలోని ఐటీడీఏ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న 10 సెంట్ల భూమి ప్రభుత్వ భూమని కాజేశారు. ఇక నిన్నగాక మొన్న పాడేరు ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న 4 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని కూడా లీజుపద్ధతిన చేజిక్కించుకున్నారు.
పేదలను తొలగించి 30 సెంట్ల ఆక్రమణ
పేదలకు పక్కా ఇళ్ల కేటాయింపు పేరుతో ఖాళీ చేయించిన టీడీపీ నాయకులు ఆ భూమిని కబ్జా చేసేశారు. సుమారు రూ.4.50 కోట్ల విలువైన 30 సెంట్ల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే తన స్నేహితులకు అప్పగించారు. గాజువాక భానోజీతోట సర్వే నంబర్ 86లో నివాసముంటున్న 38 కుటుంబాలకు చెందిన షెడ్‌లను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. షెడ్లు కూల్చేసిన అనంతరం ఖాళీ జాగాను గృహ నిర్మాణ సంస్థ (టిడ్కో)కు అప్పగించారు. అందులో గృహాల నిర్మాణాలకు అధికారులు ప్రణాళిక వేసినప్పటికీ పేదలు అక్కడ్నుంచి కదలకపోవడంతో వారిలో 80 గజాల చొప్పున మళ్లీ స్థలాలను అప్పగించారు. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన మిత్రుల్లో ఇద్దరికి వాటా కల్పించారు. అందరిలాగా కాకుండా శ్రీను అనే వ్యక్తికి 20 సెంట్లు, మరో వ్యక్తికి 10 సెంట్లు కట్టబెట్టారు.
అంతస్తులుగా అక్రమాలు
ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించి అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తుంటే జీవీఎంసీ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నది కూడా జీవీఎంసీ జోన్–2 కార్యాలయానికి వెనుక రోడ్డులోనే. దాని నిర్మాత టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్. అధికార దర్పంతో దాన్ని నిర్మించుకున్నారు. ఆశీలమెట్టలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం వెనుక నిర్మాణం పూర్తి చేసుకున్న జీప్లస్–4 బిల్డింగ్ తీరును చూస్తే.. అన్నీ అతిక్రమణలే కనిపిస్తాయి. జీ ప్లస్ 4 బిల్డింగ్ నిర్మించాలంటే కనీసం 400 చదరపు మీటర్ల స్థలం కావాలి. కానీ వాసుపల్లివారు 222.83 చదరపు మీటర్ల స్థలంలోనే జీప్లస్ 4 బిల్డింగ్ కట్టేశారు. ఆ భవనం కూడా 20 అడుగులకు మించని చిన్నపాటి రోడ్డులో ఉంది. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి జీప్లస్ 2 నిర్మాణానికే అనుమతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment