అయ్యో తమ్ముడా!
టీడీపీలో టిక్కెట్ల లొల్లి
ఇప్పటికే నియోజకవర్గాల్లో పలువురి పర్యటనలు
తాజాగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్‌ల వలసలు
తొమ్మిదేళ్లు జెండా మోసినా దక్కని ఫలితం
జిల్లాలో తెలుగుతమ్ముళ్ల రె‘బెల్స్’
సాక్షి ప్రతినిధి, కర్నూలు: విభజన పాపం మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ అధినేత రెండుకళ్ల సిద్ధాంతం నాయకులను ప్రజల్లోకి వెళ్లకుండా చేసింది. తెలుగు ప్రజలను చీల్చిన కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని భావించిన కాంగ్రెస్ నాయకులు కొందరు వైఎస్‌ఆర్‌సీపీలో చోటు దక్కకపోవడంతో టీడీపీ వైపు అడుగులేస్తున్నారు. ఈ విషయంలో తాజా మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి ముందు వరుసలో ఉండగా.. పాణ్యం, ఆలూరు, నందికొట్కూరు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నీరజారెడ్డి, లబ్బి వెంకటస్వామి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినాన వీరు ఆ పార్టీలో చేరడం ఖాయమనే చర్చ జరుగుతోంది. వీరి రాక తెలుగుతమ్ముళ్లను గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు వీరి చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు.
తొమ్మిదేళ్లుగా టీడీపీ అధికారంలో లేకపోయినా పలువురు నాయకులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నియోజకవర్గాల్లో పార్టీ పరువు కాపాడుకొస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన తమకు రానున్న ఎన్నికల్లో సీటు దక్కుతుందనుకున్న నాయకుల ఆశలు కరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. కర్నూలు అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశిస్తున్న మాజీ మంత్రి రాంభూపాల్‌చౌదరికి ఈ సారి భంగపాటు తప్పేట్లు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ టీడీపీలో చేరుతున్నారనే ప్రచారంతో ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. అదేవిధంగా ప్రముఖ రియల్టర్ కేజే రెడ్డి ఎమ్మెల్యే కావాలనే ఆశతో టీడీపీ తీర్థం పుచ్చుకుని పాణ్యం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీలో చేరికకు.. కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఆయన భారీగా ఖర్చు చేశారు.
అయితే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనుండటంతో కె.జె.రెడ్డి పరిస్థితి అగమ్యగోచరం కానుంది. నందికొట్కూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బిచ్చన్న పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఆయన ఆస్తులు అమ్ముకున్నట్లు పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఆయనను కాదని.. లబ్బి వెంకటస్వామిని పార్టీలోకి ఆహ్వానించి బరిలో నిలపాలనే అధినేత నిర్ణయాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే నిరజారెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తెలుస్తోంది. అదే జరిగితే పార్టీనే నమ్ముకున్న వైకుంఠం ప్రసాద్ భవిష్యత్ ఏమిటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడుతున్న ఇలాంటి నాయకులంతా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.