హాజరైన టీడీపీ అసమ్మతి నేతలు సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత మోదుగుల నరసింహారావు
గుంటూరు, ఈపూరు(వినుకొండ): అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకొద్దు అంటూ వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన టీడీపీ అసమ్మతి నేతలు గురువారం ముక్తకంఠంతో నినదించారు. ఈపూరు మండలంలోని ఆరేపల్లి ముప్పాళ్లలో దాదాపు 300 మంది టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. దాదాపు 1600 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే జీవీ క్షేత్రస్థాయిలో అవి ఏమేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయో తెలుసుకోలేకపోవడంపై నిరసనలు వ్యక్త మయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వినుకొండ ఎమ్మెల్యే సీటు ఎట్టి పరిస్థితులలో జీవీ ఆంజనేయులుకు ఇవ్వవద్దని వారు విజ్ఞప్తిచేయడం గమనార్హం. ప్రభుత్వ నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ పర్సంటేజిలు ఇవాల్సిన దుస్థితి నెలకొందని, లేనిపక్షంలో బిల్లులు ఆపించడం ఎమ్మెల్యేకు అలవాటైన పని అని కొందరు నాయకులు వాపోయారు.
ఇటీవల జన్మభూమి సభలో మా గ్రామానికి మీరు ఏం చేస్తున్నారని ఒక కార్యకర్త ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్ట్ చేయించారని చెప్పారు. ఎమ్మెల్యే బావమరిది బొల్లాపల్లి మండలంలో చేస్తున్న భూ ఆక్రమణలు, అడంగల్, ఆన్‌లైన్‌లో పేర్లు మార్చటాలపై దిగువ బొల్లాపల్లి మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సన్నిహితుడైన ఓ న్యాయవాది, ఓ దళారీ చేస్తున్న భూమాపియా, రేషన్‌మాఫియా వంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయన్నారు. వేసిన సిమెంట్ రోడ్లు నాసిరకంగా ఉండి పగుళ్లు ఇవ్వడం, తారు రోడ్లు వేసిన మూడు గంటలకే కుంగటంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారని, దీనికి కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే కుమ్మక్కు కావడమే కారణమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీలో సభ్యత్వం లేనివారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెటడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో వర్గాలను ప్రోత్సహించడం వలనే పార్టీలో సంక్షోభం ముదిరినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలు నూతన అభ్యర్థి అన్వేషణలో ఉన్నారని సీనియర్ నాయకులు ఒకరు చెప్పారు. జీవీని తప్పించి మంత్రి లోకేష్‌కు వినుకొండ అసెంబ్లీ సీటు కేటాయించాలని ముఖ్యమంతిని అభ్యర్థిస్తున్నామని తెలిపారు.
కొసమెరుపు
జరుగుతున్న సమావేశం వద్దకు ఎమ్మెల్యే తన ప్రతినిధులుగా ముగ్గురిని పంపించారు. వారు వచ్చి పార్టీ కోసం పనిచేయాలని సూచించగా అదేదో ఎమ్మెల్యేనే ఇక్కడకు వచ్చి సమస్యలు పరిష్కరించమని కార్యకర్తలు కోరారు. దీంతో సమాధానం చెప్పలేక వారు వెనుదిరిగారు. సమావేశంలో మోదుగుల సత్యం, మోదుగుల నరసింహా రావు, విడపలపాటి హనుమయ్య, కట్టా కోటయ్య,బుచ్చారావు,రామసుబ్బయ్య, ముండ్రు హనుమంతరావు, శాఖమూరి రామమూర్తి, కోటా నాయక్, వజ్రాల సోమిరెడ్డి, కట్టా వలరాజు, కంచేటి చంద్రరావు, కన్నెదారి బ్రహం,కాకాని శ్రీనివాసరావు, పాలడుగు శివయ్య, జాస్తి సీతయ్య, గోగినేని సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment