బెడిసికొట్టిన టీడీపీ కుట్ర | TDP Leaders plan failed In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన టీడీపీ కుట్ర

Published Tue, Sep 10 2019 8:49 AM | Last Updated on Tue, Sep 10 2019 8:49 AM

TDP Leaders plan failed In Visakhapatnam - Sakshi

వరుస సెలవుల కారణంగా కార్పొరేషన్‌ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి. దీనికి తోడు గత ప్రభుత్వం 010 పద్దు పరిధిలోకి జీవీఎంసీని తీసుకొచ్చే ముందు చేయాల్సిన పని పూర్తి చేయకపోవడంతోనే ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చి వైఎస్సార్‌ సీపీ సర్కారుపై తప్పును నెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ట్రెజరీకి బిల్లులు పంపిన విషయం తెలిసి కూడా ధర్నా చేసి ప్రభుత్వాన్ని నిందించాలని టీడీపీ ఎమ్మెల్యేలు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జీతాలు ఉద్యోగుల ఖాతాలో జమ కావడంతో ధర్నాకు ఒక్కరూ హాజరు కాలేదు. చేసేది లేక ఎమ్మెల్యేలు వెనుదిరిగారు.

సాక్షి, విశాఖపట్నం : సుమారు దశాబ్ద కాలం పోరాటం తర్వాత మహా విశాఖ నగర పాలక సంస్థలో 010 పద్దు అమలుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకూ ఉద్యోగుల జీతాల్ని జీవీఎంసీ చెల్లించేది. 010 పద్దు అమలుతో ట్రెజరీ నుంచి ప్రతి ఉద్యోగికీ జీతం జమవ్వాలి. గత ఏప్రిల్‌కు సంబంధించిన జీతాలు ఈ పద్దు పరిధిలోకి వచ్చి.. ట్రెజరీ నుంచి పడతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి 010 అమలు చేసే రెండు నెలల ముందే జీవీఎంసీకి ప్రభుత్వం సూచనలివ్వాల్సిన అవసరం ఉంది. అలా సమాచారం అందిస్తే పద్దు పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి సంబంధించిన అన్ని దస్త్రాలు సిద్ధం చేసి అమలైన వెంటనే ట్రెజరీకి అప్పగించే అవకాశముండేది. ఫలితంగా నిర్ణీత సమయానికి జీతాలు చెల్లింపులు జరిగేవి. కానీ అవేమీ చేయకుండా కేవలం ఎన్నికలు వస్తున్నాయన్న నెపంతో ఆదరాబాదరాగా జీవో జారీ చేసేశారు అప్పటి టీడీపీ పెద్దలు. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు నాలుగు నెలలుగా జీతాలు, పింఛన్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కొత్త ప్రభుత్వంపై నెపం నెట్టే యత్నం
జీతాలు చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని యూనియన్లు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం జీతాల చెల్లింపు విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ట్రెజరీ, జీవీఎంసీ అధికారుల్ని ఆదేశించింది. దీంతో ఫైళ్లు చకచకా కదిలాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 2,677 మంది 010 పద్దు పరిధిలోకి వచ్చారు. వీరితో పాటు 1,675 మంది రిటైర్డు ఉద్యోగులు కూడా ఈ పద్దు పరిధిలోకి వచ్చారు. వీరికి సంబంధించిన ఉద్యోగ దస్త్రాల్ని ప్రభుత్వ ఖజానాకు జీవీఎంసీ అధికారులు గత నెల 28న అందించేశారు. అయితే వరుస సెలవులు రావడంతో జీతాలు చెల్లింపులో ఆలస్యమైంది. ఈ విషయం తెలుసుకున్న నగర టీడీపీ ఎమ్మెల్యేలు.. తమ హయాంలో జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు పన్నాగం పన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవీఎంసీ ఉద్యోగుల్ని పట్టించుకోవడం లేదంటూ ధర్నా చేయాలని నిర్ణయించారు.

ముందే జమైన జీతాలు
జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ప్రజలు, ఉద్యోగుల్ని మభ్యపెట్టేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో సీఐటీయూ, ఉద్యోగులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 11 గంటలకు ధర్నా చేస్తున్నట్లు నోటీసులిచ్చారు. పది రోజుల క్రితమే దస్త్రాలు పంపించామని అధికారులు వివరించినా వినకుండా ధర్నా చేయాలని భావించారు. అయితే సోమవారం ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరవగానే ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. దీంతో ఉద్యోగులెవ్వరూ ధర్నాకు హాజరు కాలేదు. ఫలితంగా ధర్నా చేపట్టేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిందించాలనుకున్న తమ వ్యూహం బెడిసికొట్టిందని తెలుసుకుని తోకముడిచి వెనుదిరిగారు.

మంత్రికి ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
వేతనాల చెల్లింపు విషయంలో వేగవంతంగా ప్రభుత్వం చొరవ చూపడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు నెలల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను గుర్తింపు యూనియన్‌ గౌరవాధ్యక్షుడు ఎం.ఆనందరావు ఉద్యోగులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి 010 పద్దు కారణంగా జీవీఎంసీ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపుల్లో తలెత్తిన జాప్యానికి శుభంకార్డు పడింది. ఇకపై ప్రతి నెలా ఠంచనుగా ఉద్యోగులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందనున్నాయని జీవీఎంసీ కమిషనర్‌ సృజన తెలిపారు. 

రూ.34 కోట్లు జమ
గత నెల 28న ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లుల్ని జీవీఎంసీ అధికారులు బ్యాంకుకు పంపించారు. దస్త్రాలు పరిశీలించిన తర్వాత జీతాలు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ నెల 1, 2 తేదీలు సెలవు దినాలు కావడం, ఆదివారం కూడా రావడంతో వేల మంది ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల బిల్లుల్ని పరిశీలించేందుకు సమయం పట్టింది. ఈ కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయి. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగాలనుకోవడంపై కొందరు ఉద్యోగుల ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం జీపీఎఫ్‌ పరిధిలో ఉన్న 1,782 మంది ఉద్యోగులకు జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు, సీపీఎస్‌ పరిధిలో ఉన్న 895 మంది ఉద్యోగులకు మే, జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు చెల్లించారు. మొత్తం 2,677 మంది ఉద్యోగులకు రూ.34 కోట్లు వేతనాలు సోమవారం జమ అయ్యాయి. అదే విధంగా 1,675 మంది రిటైర్డు ఉద్యోగులకు రూ.4.50 కోట్లు పింఛన్‌ సొమ్ము జమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement