మేము చెప్పిందే శాసనం!
తుని నియోజకవర్గంలోఅధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని తృణీకరించి, రాజ్యాంగేతర శక్తులుగా రెచ్చిపోతున్నారు. జనాభిమానంతో గెలుపొందిన విపక్ష ప్రజా ప్రతినిధి మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. తాము ఓడినా.. తమ పార్టీ గద్దెనెక్కిందన్న మదంతో అహంకరిస్తున్నారు. తమ కనుసన్నల్లో మెలగని అధికారులపై కన్నెర్రజేస్తున్నారు. శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని హెచ్చరించడమే కాకుండా తక్షణం చేసి చూపిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : గెలిపించిన జనానికి ఎంతో కొంత మేలు చేయాలనుకోవడమే తుని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తప్పు అన్నట్టు అక్కడి అధికారపార్టీ ముఖ్యనేతలు వ్యవహరిస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను కలిసినా శిక్షార్హమైన నేరమని దురహంకారం ప్రదర్శిస్తున్నారు. దాడిశెట్టిని కలిసిన తుని రూరల్ ఎంపీడీఓ భానుప్రకాష్‌ను ఆగమేఘాలపై 24 గంటల్లో ఏజెన్సీలోని మారేడుమిల్లికి బదిలీ చేయడమే వారి అధికార మదానికి అద్దం పడుతోందని ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. టీడీపీకి చెందిన రాజ్యాంగేతరశక్తి దాష్టీకాన్ని భరించలేక, ఎదిరించలేక ఆ నియోజకవర్గంలోని అధికారులు, ఉద్యోగులు నలిగిపోతున్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలంలో తహశీల్దార్, ఏఓ, ఈఓపీఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తుని మున్సిపాలిటీ సహా నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కీలక పోస్టుల్లో పని చేసేందుకు అధికారులు వెనకడుగు వేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎమ్మెల్యే రాజా ఇటీవల తుని మున్సిపల్ అధికారులతో సమీక్షకు సిద్ధమవగా మున్సిపల్ కమిషనర్, ఏఈ సహా ఇతర అధికారులెవరినీ హాజరు కానివ్వకుండా ఆ రాజ్యాంగేతరశక్తులేఅడ్డు తగిలారనే విమర్శలు వెల్లువెత్తాయి. తొండంగి మండల పరిషత్ సమావేశానికి ఆహ్వానం అందిన ఎమ్మెల్యే రాజా మండల పరిషత్ కార్యాలయంలోకి అడుగుపెడుతుండగా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించేశారు. ఈఓపీఆర్డీ కె.శేషారత్నం సోమవారం వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎంపీపీ నీరజ చాంబర్‌ను టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు జె.వెంకటలక్ష్మికి అడ్డగోలుగా కేటాయించడం వివాదాస్పదమై చివరకు పోలీసు కేసు వరకు వెళ్లడం గమనార్హం. కక్షకట్టి ఎంపీడీఓను బదిలీ చేసిన రాజ్యాంగేతరశక్తులు ఆయన స్థానంలో శేషారత్నంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో కృతజ్ఞతగానే ఇలా వ్యవహరించినట్టు భావిస్తున్నారు.
పేట్రేగిపోతున్న రాజ్యాంగేతర శక్తులు..
తుని నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, 2014 ఎన్నికల్లో వరుసకు ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజాకు 19 వేల భారీ మెజార్టీ కట్టబెట్టారు. ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్నప్పటికీ సీనియర్ అనే ఉద్దేశంతో రామకృష్ణుడుకి ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిని కట్టబెట్టారు. దాంతో ఆసరాగా తెలుగుతమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తులుగా పేట్రేగుతూ అన్ని శాఖల ఉద్యోగులపై కర్ర పెత్తనం చెలాయిస్తున్నారు. తమ మాట వినకపోతే వేటు తప్పదని ఎంపీడీఓ భానుప్రకాష్‌ను బదిలీ చేయించడంతో చాటుకున్నారు. ఈ ఉదంతం కంటే ముందు తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో వివాదం జరిగింది.
ఆ గ్రామంలో 45 మంది సీనియర్ మేట్లు ఉన్నారు. వారంతా వైఎస్సార్ సీపీకి చెందిన మేట్ పేరును సిఫార్సు చేశారు. దీనికి భిన్నంగా మేట్ కాని వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా వేయాలని టీడీపీ వారు ఒత్తిడి తెచ్చారు. అయితే నిబంధనల ప్రకారం చేయమని ఉపాధి హామీ సిబ్బందికి ఎంపీడీఓ సూచించారు. దీనిని వ్యతిరేకించిన తెలుగుతమ్ముళ్లు ఉన్నతస్థాయిలో లాబీయింగ్ చేసి తాము కోరిన వ్యక్తిని నియమింపజేశారు. ఇవన్నీ చూసిన అధికారులు, ఉద్యోగులు ఏ క్షణాన ఆ రాజ్యాంగేతర శక్తులు ఎవరిపై ప్రతాపం చూపుతారోనని ఆందోళన చెందుతున్నారు. తుని నియోజకవర్గంలో పని చేృయడమంటే కత్తి మీద సాము చేయడమేనని బిక్కుబిక్కుమంటున్నారు.